బిర్సా ముండా పోరు స్ఫూర్తిదాయకం

16 Nov, 2021 04:48 IST|Sakshi
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న గవర్నర్‌ తమిళిసై 

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

సాక్షి, హైదరాబాద్‌: భారత స్వాతంత్య్ర సంగ్రా మంలో గిరిజన యోధుడు భగవాన్‌ బిర్సా ముండా జరిపిన పోరు స్ఫూర్తిదాయకమని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. బిర్సా ముండా 146వ జయంతిని సోమవారం రాజ్‌భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిర్సా ముండా చిత్రపటానికి గవర్నర్‌ పుష్పాంజలి ఘటించారు. స్వాతంత్య్ర పోరులో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి, త్యాగాలు చేసిన గిరిజన స్వాతంత్య్ర సమరయోధులను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానిం చారు.

బిర్సా ముండా జయంతిని జన జాతీయ గౌరవ దినోత్సవంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం అభినంద నీయమని అన్నారు. గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల సేవలను భావితరాలకు తెలిసేవిధంగా దేశంలోని పలు ప్రాంతాల్లో మ్యూజియాలను నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించడం శుభపరిణామమని చెప్పారు. గొప్ప చారిత్రక సాంస్కృతిక వారసత్వ సంపద కలిగిన గిరిజనుల విశిష్ట సంస్కృతి సంప్ర దాయాలను, కళలను కాపాడాల్సిన అవసరముందన్నారు. సమగ్ర అభివృద్ధికి, వారి సాధికారతకు పని చేయడమే బిర్సా ముండాకి మనమిచ్చే నిజమైన నివాళి అని గవర్నర్‌ తెలిపారు.  

బిర్సా ముండాకు సీఎం కేసీఆర్‌ నివాళి
ఆదివాసీ గిరిజన నాయకుడు, భారత స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా జయంతి సంద ర్భంగా సీఎం కేసీఆర్‌ ఆయనకు నివాళులర్పించా రు. స్వరాజ్యం కోసం, ఆదివాసీ గిరిజనుల ఆత్మ గౌరవం కోసం, వారి హక్కుల కోసం పోరాడుతూ అతిచిన్న వయసులో ప్రాణత్యాగం చేసిన బిర్సాముండా.. దేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయారని పేర్కొన్నారు. తెలంగాణ స్వయం పాలనలో గిరిజనులు, ఆది వాసీల ఆత్మగౌరవాన్ని పరిరక్షిస్తూ వారి అభివృద్ధి సంక్షేమానికి రాష్ట్రప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తున్నదని సీఎం తెలిపారు. 

మరిన్ని వార్తలు