జాతీయ నూతన విద్యావిధానంతో మేలు 

25 Nov, 2022 01:22 IST|Sakshi
పాలమూరు యూనివర్సిటీ స్నాతకోత్సవంలో విద్యార్థినికి సర్టిఫికెట్లు అందజేస్తున్న గవర్నర్‌ తమిళిసై 

పౌష్టికాహారంతోపాటు మాతృభాషలో విద్య  

పీయూ స్నాతకోత్సవంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌  

కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు దూరం 

గవర్నర్‌కు స్వాగతం పలికిన అదనపు కలెక్టర్‌ 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ప్రపంచంతో విద్యార్థి పోటీపడేలా జాతీయ నూతన విద్యావిధానం దేశంలో అమల్లోకి రానున్నట్లు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యార్థులకు పౌష్టికాహారంతోపాటు మాతృభాషలో విద్యనందిస్తారన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా బండమీదిపల్లిలో గురువారం పాలమూరు విశ్వవిద్యాలయం (పీయూ) మూడో స్నాతకోత్సవానికి హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ వైస్‌ చాన్స్‌లర్‌ బీజే రావుతో కలిసి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ ప్రస్తుత విద్యావిధానాల వల్ల విద్యార్థుల్లో సామర్థ్యాలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం జాతీయ విద్యా విధానాన్ని అమల్లోకి తేనుందని.. దీని ద్వారా మాతృభాషకు ప్రాధాన్యం పెరిగి విద్యార్థుల్లో సామర్థ్యం పెరుగుతుందన్నారు. దేశంలో ఇంకా పేదరికం, అవినీతి, అనారోగ్య సమస్యలున్నాయని.. వీటిని రూపుమాపే పరిశోధనలకు నూతన విద్యావిధానం పునాది వేస్తుందని ఆకాంక్షించారు.

క్లిష్టమైన సమయంలో కరోనాకు వ్యాక్సిన్‌ను కనుగొని భారత్‌ ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోగలదని నిరూపించిందన్నారు. విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. స్నాతకోత్సవానికి ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ హాజరుకాలేదు. అదనపు కలెక్టర్‌ సీతారామారావు గవర్నర్‌కు స్వాగతం పలికారు.  

గొప్ప వ్యక్తులు కలిస్తే అద్భుతాలు 
గొప్ప వ్యక్తులు కలిస్తే అద్భుతాలు జరుగుతాయని గవర్నర్‌ తమిళిసై చెప్పారు. 1893లో స్వామి వివేకానంద, జంషెడ్‌ టాటా ఒకే ఓడలో కెనడాలోని వాంకోవర్‌కు బయల్దేరారని గుర్తుచేశారు. ఆ సమయంలో టాటా.. బ్రిటీష్‌ ఇండియాకు స్టీల్‌ ఉత్పత్తులు తెచ్చి విక్రయిస్తున్న విషయం వారి మధ్య చర్చకు వచ్చిందని చెప్పారు.

భారత్‌లోనే సైన్స్‌ ఆఫ్‌ స్టీల్‌కు సంబంధించిన పరిశోధనాలయాన్ని ఏర్పాటు చేయాలని, ఇక్కడే స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసేలా కృషి చేయాలని టాటాకు వివేకానంద సూచించారన్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న టాటా 1898లో బెంగళూరులో టాటా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆరుగురికి పీహెచ్‌డీ, 72 మంది పీజీ, డిగ్రీ విద్యార్థులకు గోల్డ్‌ మెడల్స్‌ ప్రదానం చేశారు.  

మరిన్ని వార్తలు