ఉపాధ్యాయులు దేశానికి దిశా నిర్దేశకులు 

6 Sep, 2020 04:11 IST|Sakshi

గవర్నర్‌ తమిళిసై

సాక్షి, హైదరాబాద్‌: ‘భావి భారతావనికి ఉపాధ్యాయులే రూపకర్తలు. వివిధ రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకులను తయారు చేస్తారు’ అని గవర్నర్‌ తమిళిసై కొనియాడారు. దేశ, పౌరుల వ్యక్తిగత భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపు దిద్దుకుంటుందని, విద్యార్థులు తమ పూర్తి శక్తి, సామర్థ్యాలను తెలుసుకునేలా ఉపాధ్యాయులు కృషి చేస్తారని ప్రశంసించారు. తాను ఈ రోజు ఈ స్థితిలో ఉండటానికి కారణం తన ఉపాధ్యాయులేనని తెలిపారు. నర్సరీ నుంచి వైద్య కళాశాల వరకు ఉపాధ్యాయులే తన చదువు పట్ల శ్రద్ధ వహించారని ఆమె గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఆమె రాజ్‌భవన్‌ నుంచి జాతీయ విద్యా విధానం–2020పై వెబినార్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలియజేశారు. గొప్ప ఉపాధ్యాయుల వల్లే గొప్ప వ్యక్తులు, దిగ్గజాలు తయారవుతారన్నారు. ఎందరో అభాగ్యులను ఉపాధ్యాయులు ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం– 2020తో దేశం మేథోపరంగా సూపర్‌ పవర్‌గా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అంతకు ముందు ఆమె మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి నివాళి అర్పించారు.

మరిన్ని వార్తలు