లక్ష్యం.. 70వేల కోట్లు

21 Mar, 2021 03:13 IST|Sakshi

వచ్చే నాలుగేళ్లలో పెట్టుబడులు ఆకర్షించేలా చర్యలు: కేటీఆర్‌

ప్రపంచ స్థాయి ఎలక్ట్రానిక్స్‌ హబ్‌గా తెలంగాణ

వచ్చే నాలుగేళ్లలో 3 లక్షల మందికి ఉపాధి లక్ష్యం

హౌజింగ్‌ బోర్డులో మళ్లీ ఇల్లు కట్టుకునేందుకు ఉచిత అనుమతుల అంశాన్ని పరిశీలిస్తాం

గ్రామ కంఠం భూముల సమస్యను పరిష్కరిస్తామని హామీ

అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో మంత్రి కేటీఆర్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రాబోయే నాలుగేళ్లలో రూ.70వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి.. ఎలక్ట్రానిక్స్, విద్యుత్‌ రంగాల్లో 3లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌ శాఖల మంత్రి కె.తారకరామారావు తెలిపారు. తెలంగాణను ప్రపంచ స్థాయి ఎలక్ట్రానిక్స్‌ తయారీ హబ్‌గా మారుస్తామని చెప్పారు. శనివారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేటీఆర్‌ సమాధానం ఇచ్చారు.

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన ఈ ఆరేండ్లలోనే ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తి రంగంలోని 250కిపైగా కంపెనీల్లో 1.60 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని చెప్పారు. గతంలో 50 వేల మందికే ఉపాధి ఉండేదని.. ఇప్పుడు మొత్తంగా 2.10 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని వివరించారు. ఎలక్ట్రానిక్‌ క్లస్టర్లలో 40 కంపెనీలకు కేటాయింపులు చేశామని, అందులో 40 వేల మందికి కంపెనీలు ఉపాధి కల్పించాయని తెలిపారు.

కరోనా కారణంగా ఇబ్బందులున్నా ఆయా కంపెనీలను ఆకర్షించగలిగామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్‌ తయారీ, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ను ప్రాధాన్య రంగంగా పరిగణిస్తోందని.. తెలంగాణను విశ్వవ్యాప్త ఎలక్ట్రానిక్స్‌ వ్యవస్థ రూపకల్పన, తయారీ గమ్యస్థానంగా చేసేందుకు కృషి చేస్తోందని ప్రకటించారు. ఆ పరిశ్రమల నిర్దిష్ట అవసరాలను తీర్చేందుకు ప్రత్యేక ఎలక్ట్రానిక్స్‌ విధానం ప్రారంభించామన్నారు.

విద్యుత్‌ వాహనాలకు ప్రోత్సాహం
రాష్ట్రంలో విద్యుత్‌ వాహనాలు, ఇంధన నిల్వ వ్యవస్థను సత్వరమే చేపట్టి తయారీ, పరిశోధనలను పెంచడానికి ‘విద్యుత్‌ వాహకం 2020–30 ఇంధన నిల్వ’విధానం ప్రారంభించామని కేటీఆర్‌ చెప్పారు. ఔటర్‌రింగ్‌ రోడ్డుకు కుడి పక్కన, విమానాశ్రయానికి దగ్గరలో ఉన్న 912 ఎకరాల్లో రెండు ఎలక్ట్రానిక్‌ తయారీ క్లస్టర్లు ఉన్నాయని తెలిపారు. దివిటిపల్లి, చందన్‌వెల్లిలలో విద్యుత్‌ వాహనాలు, ఇంధన నిల్వ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి రెండు కొత్త పారిశ్రామిక క్లస్టర్లను గుర్తించిందని వివరించారు. ఈవీ క్లస్టర్‌గా చందనవెల్లి, సంబం ధిత భాగాల అవసరాలను తీరుస్తోందని.. కొత్త ఇంధన పార్కుగా చేపట్టిన దివిటిపల్లిలో లీథియం–అయాన్‌ బ్యాటరీల తయారీ, సోలార్‌ సెల్, మాడ్యూల్‌ అసెంబ్లింగ్, ఇతర అవసరాలను తీరుస్తోందని తెలిపారు. ఎలక్ట్రానిక్స్‌ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. పరిశ్రమల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి స్టేక్‌ హోల్డర్లతో కలిసి ఎలక్ట్రానిక్స్‌ విభాగం పని చేస్తోందని కేటీఆర్‌ వివరించారు. ఇక విద్యుత్‌ వాహనాల ప్రోత్సాహం కోసం కమిటీని ఏర్పాటు చేశామని.. ఎలక్ట్రానిక్‌ వాహనాలకు డిమాండ్‌ పెంచడం, చార్జింగ్‌ నెట్‌వర్క్‌ అభివృద్ధి కోసం ఈ కమిటీ పనిచేస్తుందని చెప్పారు.

స్థానిక యువతకు ఉపాధి
పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉపాధి కల్పనపై చిత్తశుద్ధితో ఉన్నామని కేటీఆర్‌ చెప్పారు. టాస్క్‌ ద్వారా ఎలక్ట్రానిక్‌ సిస్టమ్‌ డిజైన్‌ అండ్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌లో (ఈఎస్‌డీఎం) 60 వేల మందికి శిక్షణ ఇచ్చామని, అందులో 30 వేల మందికి ఉపాధి కల్పించామని వివరించారు. ఎలక్ట్రానిక్స్‌ తయారీలో ఫ్యాక్టరీ సబ్సిడీలను రూ.2 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు, జీఎస్‌టీ రీయింబర్స్‌మెంట్, ట్రాన్స్‌పోర్టు సబ్సిడీ, విద్యుత్‌ సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. వికారాబాద్‌ జిల్లాలో స్థానిక పిల్లలకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఎన్ని అవసరమనే దానిపై ముగ్గురు ఎమ్మెల్యేలతో మాట్లాడి చర్యలు చేపడతామని చెప్పారు. ఇప్పటికే ఎంపీ రంజిత్‌రెడ్డి ఒకటి ఏర్పాటు చేస్తున్నారని.. ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తోందని వివరించారు.

100 రోజుల్లో 12,943 భవన నిర్మాణ అనుమతులు
భవన నిర్మాణాల అనుమతుల విషయంలో ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కాలేరు వెంకటేశ్‌ అడిగిన ప్రశ్నలకు కేటీఆర్‌ సమాధానం ఇచ్చారు. స్వీయ ధ్రువీకరణ ఆధారంగా ఆన్‌లైన్‌లోనే వేగంగా భవన నిర్మాణ అనుమతులు ఇచ్చేందుకు టీఎస్‌ బీపాస్‌ను ప్రవేశపెట్టామని చెప్పారు. 75 గజాల వరకు ఎలాంటి అనుమతి ఇవసరం లేదని, ఒక రూపాయి టోకెన్‌తో ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించారు. 650 చదరపు గజాల వరకు స్థలంలో 10 మీటర్ల ఎత్తు వరకు స్వీయ ధ్రువీకరణ ద్వారా అనుమతులు ఇస్తున్నామన్నారు.

10 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తయిన నివాసేతర భవనాలకు సింగిల్‌ విండో ద్వారా 21 రోజుల్లో పర్మిషన్లు ఇస్తున్నట్టు కేటీఆర్‌ చెప్పారు. స్వీయ ధ్రువీకరణ ద్వారా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ కూడా ఇస్తున్నామన్నారు. 100 రోజుల్లో 12,943 భవన నిర్మాణ అనుమతులు ఇచ్చామని వివరించారు. హౌజింగ్‌ బోర్డులో ఇళ్లు కొనుక్కున్న వారి పేరున ఇళ్లు ట్రాన్స్‌ఫర్‌ అయ్యాయని తెలిపారు. కూలిపోయిన ఇళ్లను మళ్లీ కట్టుకునేందుకు ఉచితంగా అనుమతి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. గ్రామకంఠం భూముల సమస్యను పరిష్కరించేలా చూస్తామని హామీ ఇచ్చారు.  

మరిన్ని వార్తలు