ఫారెస్ట్రీ విద్యకు ఉజ్వల భవిష్యత్తు

23 Jan, 2022 13:14 IST|Sakshi

విద్యార్థులకు అటవీ శాఖ ఉద్యోగాల్లో

రిజర్వేషన్‌తో పెరగనున్న డిమాండ్‌

2016లో ప్రారంభమైన ములుగు అటవీ కళాశాల

బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సులో 311 మందికి ప్రవేశం..

97 మంది విద్య పూర్తి 

ప్రభుత్వ నిర్ణయంతో సంతోషం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు

సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల, పరిశోధన సంస్థలో ఫారెస్ట్రీ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పడ్డాయి. అటవీ శాఖలో ఉద్యోగాలకు ఇక్కడ ఫారెస్ట్రీ విద్యను అభ్యసించిన వారికి ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రకటించడంతో ఇదివరకు ఇక్కడ చదువుకున్నవారు, ప్రస్తుతం కోర్సుల్లో ఉన్న విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అడవులు, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్న క్రమంలో అటవీ నిర్వహణను ప్రోత్సహించాలన్న సంకల్పంతో ప్రత్యేక విద్యను అందుబాటులోకి తీసుకొచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వం 2016లో అటవీ కళాశాల, పరిశోధన సంస్థను ప్రారంభించింది. తొలుత సొంత భవనం లేకపోవడంతో హైదరాబాద్‌లోని దూలపల్లి ఫారెస్ట్‌ అకాడమీలో సంస్థను ప్రారంభించారు. అనంతరం సిద్దిపేట జిల్లా ములుగు సమీపంలో 52 హెక్టార్ల విస్తీర్ణంలో నూతన భవనాన్ని నిర్మించారు. 2019 నుంచి ములుగులోని నూతన భవనంలో తరగతులు ప్రారంభమయ్యాయి. 

కళాశాల విద్యార్థులకు ఎక్కువ ఉద్యోగాలు..  
ఫారెస్ట్రీ విద్యను అభ్యసించిన వారికి అటవీ శాఖకు సంబంధించిన ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని ఇటీవల జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఎఫ్‌ఆర్‌ఓ (ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌) ఉద్యోగానికి 50 శాతం, అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (ఏసీఎఫ్‌) ఉద్యోగానికి 25 శాతం, ఫారెస్టర్స్‌ ఉద్యోగాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. ప్రభుత్వ నిర్ణయం ఫలితంగా ఫారెస్ట్రీ విద్యను అభ్యసించిన వారిలో ఎక్కువ మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై అటవీ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ ఉద్యోగాలలో ప్రత్యేక రిజర్వేషన్‌ కల్పించడంతో ఈ కోర్సుకు మరింత డిమాండ్‌ పెరగనుంది.  

బీఎస్సీ ఫారెస్ట్రీ.. నాలుగేళ్ల కోర్సు 
ములుగు కళాశాలలో బీఎస్సీ ఫారెస్ట్రీ నాలుగేళ్లు, ఎంఎస్సీ ఫారెస్ట్రీ రెండేళ్ల కోర్సులు కొనసాగుతున్నాయి. బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సుకు తొలి రెండు సంవత్సరాలు ఇంటర్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించారు. 2018 నుంచి ఎంసెట్‌ (బీపీసీ)లో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లను కేటాయిస్తున్నారు. ఇప్పటి వరకు రెండు బ్యాచ్‌లలో 97 మంది విద్యార్థులు నాలుగేళ్ల కోర్సును పూర్తి చేయగా మరో 214 మంది విద్యార్థులు ఈ కోర్సును అభ్యసిస్తున్నారు.

2020లో ఎంఎస్సీ ఫారెస్ట్రీ కోర్సును ప్రారంభించారు. ఏఐఈఈఏ ఎంట్రెన్స్‌ ఉత్తీర్ణులు అయిన వారు ఎంఎస్సీ కోర్సులో చేరేందుకు అర్హులు. ఎంఎస్సీ మొదటి బ్యాచ్‌ విద్యార్థులకు ఈ సంవత్సరం విద్య పూర్తికానుంది. ఇందులో ఒక్కో సంవత్సరం 17 మందికి అడ్మిషన్‌ ఇస్తున్నారు, ఇప్పటి వరకు 34 మందికి ప్రవేశాలు కల్పించారు.
 

మరిన్ని వార్తలు