సర్కారు భూములు అమ్మాలని కేబినెట్‌ నిర్ణయం

1 Jun, 2021 03:49 IST|Sakshi

రాజధాని శివారు, రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి జిల్లాల్లోని భూములకు యమ గిరాకీ

తొలి ఏడాదిలో రూ. 15 వేల కోట్ల వరకు రాబట్టుకునే యోచన

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం భూముల అమ్మకం ప్రతిపాదనకు ఎట్టకేలకు మోక్షం లభించినట్టు కనిపిస్తోంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు వీలుగా, ప్రభుత్వ భూములను అమ్మి నిధులు సమీకరించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత రెండేళ్లుగా ఈ మేరకు ప్రతిపాదనలకు మాత్రమే పరిమితమైన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ ఏడాది దాన్ని అమల్లోకి తీసుకువచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఆదివారం జరిగిన సమావేశంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై చర్చించిన మంత్రివర్గం కరోనా కష్టాల నుంచి బయటపడేందుకు గాను ప్రభుత్వ భూముల అమ్మకం ప్రతిపాదనకు అనుమతి ఇచ్చింది.

రూ.50 వేల కోట్లకు అవకాశం ఉన్నా..
రాష్ట్రంలో ఎక్కడ, ఎంత విస్తీర్ణంలో, ఎంత విలువైన భూములున్నాయన్న వివరాలను రెవెన్యూ శాఖ ఇప్పటికే ప్రభుత్వానికి ఇవ్వగా, వాటిలో తక్షణం అమ్మడానికి వీలున్న భూముల వివరాలను క్రోడీ కరించడంపై రెవెన్యూ వర్గాలు దృష్టి్ట పెట్టాయి. రాజధాని హైదరాబాద్‌ శివార్లతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న భూములను అమ్మడం ద్వారా రూ.50 వేల కోట్ల వరకు నిధులు సమీకరించుకునే అవకాశ ముందనే ఓ అంచనా ప్రభుత్వం వద్ద ఉన్నా... ప్రస్తుతానికి 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.15 వేల కోట్ల వరకు సమీకరించుకోవడానికి ప్రభుత్వం పరిమితం కానుందనే చర్చ జరుగు తోంది. ఈ మేరకు కార్యాచరణ త్వరలోనే ప్రారం భం కానుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

శివార్లపైనే ఆశలు
రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో ప్రభుత్వ భూములున్నప్పటికీ హైదరాబాద్‌ శివార్లలోని భూములపైనే ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. ఈ మేరకు హెచ్‌ఎండీఏ పరిధిలోకి వచ్చే భూములకు సంబంధించిన ప్రత్యేక నివేదికను కూడా రెవెన్యూ శాఖ నుంచి తెప్పించుకుంది. ఇటీవల సుప్రీంకోర్టులో కేసు గెలిచిన కోకాపేటలోని దాదాపు 200 ఎకరాలు, మేడ్చల్, శంషాబాద్, రాజేంద్రనగర్‌ ప్రాంతాల్లో ఉన్న ఇవాక్యూ (కాందిశీకులు) భూములు, ఇజ్జత్‌నగర్‌లో 35 ఎకరాలు, హైటెక్స్‌ సమీపంలో 8 ఎకరాలు, తెల్లాపూర్‌లో 50 ఎకరాలు....ఇలా అమ్మకానికి అనువుగా ఉన్న భూముల వివరాలతో కూడిన నివేదిక ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉంది. తాజాగా భూముల అమ్మకానికి కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం, వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని సీఎస్‌ను ఆదేశించడంతో ఇప్పుడు ఈ భూముల అమ్మకానికి షెడ్యూల్‌ విడుదల చేయడమే తరువాయి అని రెవెన్యూ వర్గాలంటున్నాయి. 

అసైన్డ్‌ భూములు కూడా...
రాష్ట్రంలో లక్షలాది ఎకరాలను గతంలో భూమి లేని పేదలకు అసైన్‌చేశారు. ఈ భూముల్లో కనీసం 30 శాతం ఇప్పుడు ఆ పేదల చేతుల్లో లేవని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఆయా భూములను కూడా ప్రభుత్వ అవసరాల కోసం తీసుకోవాలని, ఇందుకు గాను అసైనీలకు పరిహారం చెల్లించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆయా భూముల్లో కబ్జాలో ఉన్న వారి సామాజిక స్థితిగతులతో కూడిన నివేదికను కూడా తెప్పించుకుంది. ఇలా సేకరించిన అసైన్డ్‌ భూము లను వీలును బట్టి వేలం వేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. ఇందుకు గాను తొలి దశలో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని ఐదు గ్రామాల్లో ఉన్న అసైన్డ్‌ భూములతో పాటు మరో 188 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేయడం లేదంటే బహుళ జాతి సంస్థలకు నిర్దేశిత ధరకు విక్రయించాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపి స్తోంది.

హైదరాబాద్‌ శివార్లలో ఉన్న రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొంగరఖుర్దు, మాదాపూర్, రావి ర్యాల, తుమ్మలూరు, రాయన్నగూడ గ్రామాల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా సర్వే చేయించింది. ఈ గ్రామాల్లో అసైన్‌చేసిన భూములకు గాను 1,636 ఎకరాలు అమ్మకానికి అనువుగా ఉన్నాయని తేల్చింది. గత ఏడాది కేవలం సర్వేకు మాత్రమే పరిమితమైన ప్రభుత్వం ఇప్పుడు ఈ భూములను వేలం వేయడం లేదా బహుళ జాతి సంస్థలకు విక్రయించే ప్రతిపాదనను సీరియస్‌గా పరిశీలి స్తోందనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది.

గృహ నిర్మాణ సంస్థ భూములు సైతం..
గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రూ.8,504 కోట్ల వ్యయంతో 46,565 యూనిట్లను నిర్మించాలని అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2008 నుంచి 2011 వరకు రూ.6,301 కోట్లను వెచ్చించి పలు హౌసింగ్‌ ప్రాజెక్టులు చేపట్టారు. ఆ తర్వాత ఇందుకోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌లో ఆర్థిక సంక్షోభం రావడం, ప్రాజెక్టును కొనసాగించడం కష్టసాధ్యమని 2013లోనే మంత్రివర్గ ఉపసంఘం తేల్చడంతో ఈ ప్రాజెక్టు పూర్తిగా నిలిచిపోయింది.

అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఈ కార్పొరేషన్‌కు ఉన్న రూ.1,070 కోట్లకు పైగా అప్పులను రాష్ట్ర ప్రభుత్వం తీర్చింది. ఇందుకు గాను బ్యాంకుల్లో తనఖా ఉన్న ప్రాజెక్టులు, భూములను విడిపించింది. ఈ కార్పొరేషన్‌కు రాష్ట్ర వ్యాప్తంగా 3,337 ఎకరాల భూములు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ గృహాలు, భూములను అమ్మడం ద్వారా నిధులను సమీకరించే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. 

  • ప్రభుత్వ భూముల అమ్మకంపై రెండేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైన సర్కారు ఈ ఏడాది దాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేసింది.
  • రాజధాని శివార్లలోని విలువైన భూములతో పాటు అసైన్డ్, గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలోని భూములు అమ్మే అవకాశం
  • ఈ ప్రక్రియ మొదలైతే దశల వారీగా రూ.50,000 కోట్ల వరకు సమీకరించుకునే అవకాశం ఉంది. 

రెండేళ్లుగా పన్నేతర ఆదాయం ప్రతిపాదిస్తున్నా..

భూములు అమ్మడం ద్వారా నిధులు సమీకరించుకోవాలన్న ప్రతిపాదన గత రెండేళ్ల నుంచీ రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ మేరకు ఆయా సంవత్సరాలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లలో కూడా పన్నేతర ఆదాయాన్ని ప్రతిపాదించారు. కానీ గత రెండేళ్లలో అనివార్య కారణాల వల్ల ఇది సాధ్యం కాలేదు. అయితే, 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ ఏడాది మార్చి 18న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పన్నేతర ఆదాయం పద్దు కింద రూ.30,557 కోట్లను ప్రభుత్వం చూపెట్టింది. కానీ గత మూడేళ్ల లెక్క లను పరిశీలిస్తే పన్నేతర ఆదాయం ఎప్పుడూ రూ.10 వేల కోట్లను దాటలేదు. 2018–19లో రూ. 10,007 కోట్లు, 2019–20లో రూ.7,360 కోట్లు చూపెట్టగా.. 2020–21లో అయితే రూ.5 వేల కోట్లు కూడా దాటలేదు.

గత ఆర్థిక సంవత్సరంలో కూడా పన్నేతర ఆదాయం కింద రూ. 30,600 కోట్ల పద్దు చూపెట్టినా అందులో ఆరో వంతు మాత్రమే వచ్చింది. అప్పుడు కూడా ప్రభుత్వ భూములను అమ్మే ప్రతిపాదనలున్నప్పటికీ అమల్లోకి రాలేదు. ఈ నేపథ్యంలో 2021–22 సంవత్సరంలో కూడా రూ. 30,557 కోట్లను పన్నేతర పద్దు కింద ప్రభు త్వం చూపెట్టడంతో ఈసారి భూముల అమ్మకాలు తప్పనిసరి అని స్పష్టమవుతోంది. నిరుపయోగంగా ఉన్న గృహ నిర్మాణ సంస్థ భూములతో పాటు డెక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ ద్వారా సేకరించిన భూములు, కోకాపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలో ఉన్న భూములను  అమ్మ కానికి పెట్టి రూ.10 వేల కోట్ల వరకు రాబట్టే అవకాశా లున్నాయని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. 


 

మరిన్ని వార్తలు