నేడు రాష్ట్రవ్యాప్తంగా 1,200 కేంద్రాల్లో డ్రైరన్‌..

8 Jan, 2021 08:39 IST|Sakshi

50 ఏళ్లు పైబడిన వారు, ఆలోపు వ్యాధిగ్రస్తుల కోసం..

 పీహెచ్‌సీలు, మీసేవ కేంద్రాల్లో కోవిన్‌ యాప్‌లో నమోదు 

 కేంద్రం నిర్ణయం.. నాలుగు రోజుల్లో రాష్ట్రానికి వ్యాక్సిన్లు

 టీకా  తేదీపై ఇంకా స్పష్టత ఇవ్వని వైనం

సాక్షి, హైదరాబాద్‌: వ్యాక్సిన్‌ లబ్ధిదారుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. కోవిన్‌ యాప్‌లో పేర్లను ఎవరికి వారు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని మొదట్లో విజ్ఞప్తి చేయగా, ఇప్పుడు దాంతో పాటు మరో రెండు పద్ధతులను అందుబాటులోకి తెచ్చింది. తద్వారా 50 ఏళ్లు పైబడిన వారు, 50 ఏళ్ల లోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు సులువుగా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. అన్ని మండలాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీసేవ కేంద్రాల్లో ఆయా లబ్ధిదారులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. అందుకోసం పీహెచ్‌సీల్లో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేస్తారు.

అలాగే మీసేవ కేంద్రాల్లోనూ ఏర్పాట్లు చేస్తారు. అక్కడ కూడా కోవిన్‌ యాప్‌ ద్వారానే నమోదు ప్రక్రియ జరుగుతుంది.  మొదట్లో చెప్పినట్లుగా ఎవరికి వారు సొంతంగా కోవిన్‌ యాప్‌ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. గ్రామాలు, పట్టణాల్లో సొంతంగా యాప్‌లో నమోదు చేసుకోవడం సాధ్యంకాని వారి కోసం సులభతర ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే 50 ఏళ్లు పైబడిన వారు తమ పుట్టినతేదీ ధ్రువీకరణ పత్రం తీసుకురావాల్సి ఉంటుంది. అది లేనివారు ఓటర్‌ గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్‌ తదితర ప్రభుత్వం ప్రకటించిన నిర్ణీత ఐడీ కార్డులు తెస్తే ఏదో ఒకదాన్ని అప్‌లోడ్‌ చేసి వారి పేర్లను నమోదు చేస్తారు.  

వ్యాధిగ్రస్తులపై స్పష్టత కరువు.. 
ఇటు 50 ఏళ్ల లోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను ఎలా నమోదు చేస్తారన్న దానిపై స్పష్టత లేదు. ఎందుకంటే చాలామందికి బీపీ, షుగర్‌ వంటివి ఉన్నాయన్న విషయం కూడా తెలియదు. కాబట్టి పీహెచ్‌సీల్లో వారికి పరీక్షలు చేసి పేర్లను నమోదు చేస్తారా అనేది స్పష్టత లేదు. అయితే ఇతరత్రా దీర్ఘకాలిక వ్యాధులుంటే వాటి వైద్య పరీక్షల రిపోర్టులు చూపిస్తే సరిపోతుందని అధికారులు అంటున్నారు. దీనిపై త్వరలో స్పష్టత వస్తుందని చెబుతున్నారు. వీరి నమోదులో ఎక్కడైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే 1075 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. ఆ నంబర్‌ 24 గంటలూ అందుబాటులో ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.

ఇక రాష్ట్రంలో 75 లక్షల మందికి మొదటి దశలో వ్యాక్సిన్‌ ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే అందులో 2.88 లక్షల మంది వైద్య సిబ్బంది ఉండగా, మరో 3 లక్షలకు పైగా పంచాయతీ, మున్సిపల్, పోలీసు తదితర శాఖల్లోని ఫ్రంట్‌లైన్‌ ఉద్యోగులున్నారు. అందులో మొదటగా కేవలం వైద్య సిబ్బందికి, తర్వాత ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు టీకా వేస్తారు. ఆ తర్వాతే 50 ఏళ్లు పైబడిన, ఆలోపు వయసున్న దీర్ఘకాలిక రోగులకు వేస్తారు. ఎంతో సమయం ఉన్నందున వీరి నమోదు ప్రక్రియపై ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలు వస్తాయని చెబుతున్నారు. వీరుగాక రెండో విడతలో సాధారణ ప్రజలకు ఎప్పుడు టీకా వేస్తారో ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం జరగలేదు. 

మూడు, నాలుగు రోజుల సమయం.. 
దేశవ్యాప్తంగా టీకాల కార్యక్రమం ఈ నెల 11న ప్రారంభమవుతుందని కేంద్రం ఇటీవల రాష్ట్రాలకు సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.. అయితే వ్యాక్సిన్ల సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం ఒకటికి నాలుగుసార్లు తనిఖీలు చేస్తుండటంతోనే జాప్యమవుతోందని అధికారులు అంటున్నారు. వ్యాక్సిన్లు తయారైనప్పటికీ బ్యాచ్‌ల వారీగా వాటిని మరోసారి పరీక్షిస్తారు. ఎక్కడైనా లోపం ఉంటే వెంటనే వాటిని పక్కనపెడతారు. ఈ విషయంలో కసరత్తు జరుగుతుందని చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒకటికి నాలుగు సార్లు వాటి సామర్థ్యం, లోపాలను గుర్తించకపోతే తర్వాత జరిగే పరిణామాలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకే ఆలస్యం అవుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన ఒక అధికారి వెల్లడించారు. అందుకే ముందనుకున్న తేదీపైనా కూడా కేంద్రం స్పష్టత ఇవ్వడం లేదు.

ఇటు రాష్ట్రానికి మొదటి విడతగా ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన 6.5 లక్షల డోసుల కరోనా వ్యాక్సిన్‌ టీకాలు పుణే నుంచి ప్రత్యేక ఇన్సులేటెడ్‌ కార్గో విమానంలో హైదరాబాద్‌కు వస్తాయని అధికారులు వెల్లడించారు. ఆ టీకాలను ముందనుకున్నట్లుగా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోని వైద్య సిబ్బంది అందరికీ వేస్తారు. అనంతరం ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల కోసం మరో రెండు, మూడు వారాల్లో టీకాలు రాష్ట్రానికి వస్తాయంటున్నారు. అప్పుడు ఏ కంపెనీకి చెందినవి వస్తాయో మాత్రం చెప్పలేమంటున్నారు. ఇక దేశవ్యాప్తంగా టీకాల పంపిణీ, రవాణాకు కేంద్ర ప్రభుత్వం రూ. 480 కోట్లు మంజూరు చేసింది. ఇదిలావుండగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 1,200 కేంద్రాల్లో వ్యాక్సిన్‌ డ్రైరన్‌ నిర్వహిస్తారు. అందుకోసం ప్రత్యేకంగా పర్యవేక్షకులను హైదరాబాద్‌ నుంచి జిల్లాలకు పంపిస్తున్నట్లు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. ఆయన వరంగల్‌ జిల్లాలో నిర్వహించే డ్రైరన్‌ను పరిశీలిస్తారు.

వారికీ త్వరగా వ్యాక్సిన్‌ ఇవ్వాలి: ఈటల
తెలంగాణలోనే వ్యాక్సిన్‌ తయారవుతున్నందున రాష్ట్రానికి ఎక్కువ డోసులు అందజేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్‌ను కోరారు. శుక్రవారం వ్యాక్సిన్‌ డ్రైరన్‌ నిర్వహించనున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లు, లోటుపాట్లపై కేంద్ర మంత్రి హర్షవర్ధన్, సహాయ మంత్రి అశ్విని కుమార్‌ చౌబే అన్ని రాష్ట్రాల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. డ్రైరన్‌ ఏర్పాట్లు, సాఫ్ట్‌వేర్‌ పనితీరు, వ్యాక్సిన్‌ను నిల్వ చేయడానికి అవసరమైన కోల్డ్‌ స్టోరేజ్, రవాణాకు అవసరమైన కోల్డ్‌ చైన్, లబ్ధిదారుల నమోదుపై సుదీర్ఘంగా చర్చించారు. అన్ని రాష్ట్రాల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రుల అభిప్రాయాలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. ప్రస్తుతం వైద్య సిబ్బందికి మాత్రమే ఇస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్‌ వర్కర్లు, పోలీసులకు కూడా అతి త్వరగా వ్యాక్సిన్‌ అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 50 ఏళ్లు పైబడిన వారు, ఆలోపు వయసులోని దీర్ఘకాలిక రోగులందరికీ అతి త్వరలో వ్యాక్సిన్‌ అందించాలని కోరారు. తెలంగాణలో సాఫ్ట్‌వేర్‌ సమస్యలున్నాయని తెలిపారు. 14 జిల్లాల్లో వ్యాక్సిన్‌ లబ్ధిదారులను నమోదు చేయడానికి సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. స్పందించిన కేంద్ర మంత్రి తక్షణమే పరిష్కారం చూపిస్తామని హామీనిచ్చారు. సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు, కరోనా నిపుణుల కమిటీ సభ్యుడు గంగాధర్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి పుట్టా రాజు, యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ప్రతినిధి మనీశ్‌ హాజరయ్యారు.

>
మరిన్ని వార్తలు