బడి బాటలో పిల్లలు... బదిలీల బాధలో టీచర్లు

31 Jan, 2022 04:12 IST|Sakshi

317 జీవో అమలు తర్వాత ఇప్పుడే తెరుచుకుంటున్న స్కూళ్లు 

స్థానికత, ఇతర సమస్యలపై పోరాడుతున్న ఉపాధ్యాయులు 

వేధిస్తున్న ప్రధానోపాధ్యాయుల కొరత 

సాక్షి, హైదరాబాద్‌: దాదాపు మూడు వారాల తర్వాత పునః ప్రారంభమవుతున్న విద్యాసంస్థలకు టీచర్ల ఆందోళన ఇబ్బందిగా మారుతోంది. ఈ సెలవుల సమయంలోనే జోనల్‌ వ్యవస్థకు సంబంధించిన బదిలీల ప్రక్రియ పూర్తికాగా.. పలు అంశాలపై విభేదిస్తూ టీచర్లు ఆందోళన బాట పట్టారు. ప్రధానోపాధ్యాయలు మల్టీజోనల్ బదిలీల్లో హేతుబద్ధత లేదంటూ కోర్టుకెళ్లగా.. స్థానికత, మరికొన్ని అంశాలపై ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా దశలవారీ ఆందోళనలకు పిలుపునిచ్చాయి. సోమవారం నుంచి ఈ నిరసనలను తీవ్రతరం చేయాలని ఉపాధ్యాయ ఐక్యపోరాట కమిటీ నిర్ణయించింది.

ఫిబ్రవరి 5వ తేదీన హైదరాబాద్‌లో మహాధర్నాకు పిలుపునిచ్చింది. 317 జీవోలో ప్రధాన సమస్యలను పరిష్కారిస్తామని ప్రభుత్వం చెప్పినా.. ఇంతవరకు అధికారిక ఆదేశాలేవీ రాలేదు. పరస్పర బదిలీలు, ఒంటరి మహిళల ఆప్షన్లు, సీనియారిటీలో అన్యాయం వంటి పలు అంశాలపై ప్రభుత్వం తుది నిర్ణ యం ప్రకటించాల్సి ఉంది. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోనూ 317 జీవో వేడి పుట్టిస్తోంది. బదిలీలను వ్యతిరేకిస్తూ లెక్చరర్లు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో బోధనకు ఇబ్బంది ఉంటుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

ప్రధానోపాధ్యాయుల కొరతతో.. 
రాష్ట్రవ్యాప్తంగా 4,379 ప్రధానోపాధ్యాయుల పోస్టులుంటే.. ప్రస్తుతం 2,423 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మరో 1,956 హెచ్‌ఎం పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. 45 శాతం పోస్టుల ఖాళీ ఒక సమస్య అయితే.. ప్రస్తుతం మల్టీ జోనల్‌ బదిలీల్లో 98 మందిని ట్రాన్స్‌ఫర్‌ చేశారు. వారంతా బదిలీలపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది విధుల్లో చేరలేదు కూడా. 

ఇక రాష్ట్రంలో మొత్తం 591 మండలాల్లో 528 మండల విద్యాధికారుల పోస్టులున్నాయి. ఇందులో 20 మంది మాత్రమే రెగ్యులర్‌గా పనిచేస్తున్నారు. మిగతా వారంతా ఇన్‌చార్జులే. దీనికి తోడు 317 జీవో కారణంగా దాదాపు 15 వేల మంది ఉపాధ్యాయులు స్థానికేతర జిల్లాలకు వెళ్లాల్సి వచ్చింది. వారు ఇంతవరకూ క్లాసులకు హాజరవ్వలేదు. కొత్తగా విద్యార్థులను పరిచయం చేసుకుని బోధన చేయాల్సి ఉంటుంది. అందులోనూ కొందరు టీచర్లు పరస్పర బదిలీల కోసం నిరీక్షిస్తున్నారు. వీటన్నింటితో బోధనకు మరికొంత ఆలస్యం పట్టే అవకాశం ఉంది. దీంతో విద్యా బోధన ఎలా జరుగుతుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  

మరిన్ని వార్తలు