6 నుంచి జీపీఎఫ్‌ఐ సమావేశాలు 

4 Mar, 2023 02:11 IST|Sakshi

డిజిటల్‌ చెల్లింపుల్లో నూతన పద్ధతులపై చర్చ 

జీ20 సదస్సు చీఫ్‌ కోఆర్డినేటర్‌ హర్షవర్ధన్‌ శ్రింగ్లా వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: ఆర్థికాంశాల్లో అందరినీ భాగస్వాములను చేసే లక్ష్యంతో సిద్ధం చేసిన యూపీఐ లాంటి వ్యవస్థలను అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకొనేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని జీ20 సదస్సు చీఫ్‌ కో–ఆర్డినేటర్‌ హర్షవర్ధన్‌ శ్రింగ్లా తెలిపారు. జీ20 సదస్సు వేదికగా యూపీఐ సహా ఇతర అంశాల్లో భారత్‌ అనుభవాలు, మేలైన పద్ధతులు, వనరులను అందించేందుకు సిద్ధమని, దీనివల్ల పేద దేశాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన చెప్పారు.

ఈ ఏడాది భారత్‌ అధ్యక్షతన జరుగుతున్న జీ20 సదస్సులో భాగంగా ఈ నెల 6, 7 తేదీల్లో గ్లోబల్‌ పార్ట్‌నర్‌షి ప్‌ ఫర్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూషన్‌ (జీపీఎఫ్‌ఐ) రెండో విడత సమావేశాలు జరగనున్నాయి. దానికంటే ముందు శని, ఆదివారాల్లో ‘నాలెడ్జ్‌ అండ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఎక్స్చేంజ్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ ద ఎమర్జింగ్‌ ఎకానమీస్‌ ఆఫ్‌ ద గ్లోబల్‌ సౌత్‌’సమావేశాలు నిర్వహించనున్నారు.

జీ20 దేశాలతోపాటు ఆసక్తిగల ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలూ ఇందులో పాల్గొననున్నాయి. ఆర్థిక అంశాల్లో అందరికీ చోటు కల్పించడంలో ఎదురవుతున్న ఇబ్బందులు, కష్టనష్టాలపై అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ అనుభవాలను పంచుకొనేందుకు ఈ వేదికను ఏర్పాటు చేసినట్లు హర్షవర్ధన్‌ శ్రింగ్లా తెలిపారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సమావేశం ప్రాముఖ్యత ఇతర వివరాలను వెల్లడించారు. 

భారత్‌ తయారీ యూపీఐ పేమెంట్లపై సర్వత్రా ఆసక్తి... 
భూదక్షిణార్ధ గోళంలోని దేశాలతో ప్రధాని మోదీ ఇప్పటికే ‘వాయిస్‌ ఆఫ్‌ గ్లోబల్‌ సౌత్‌’పేరుతో చర్చలు జరిపారని, ప్రజోపయోగం కోసం డిజిటల్‌ టెక్నాలజీ వాడకం అవసరాన్ని నొక్కి చెప్పారని హర్షవర్ధన్‌శ్రింగ్లా తెలిపారు. గ్లోబల్‌ సౌత్‌ ప్రాథమ్యాలు, గళం భారత్‌ గళమవుతుందని ప్రధాని స్పష్టం చేసినట్లు వివరించారు. ఈ నెల 6న చెల్లింపులు, రెమిటెన్సెస్‌లలో డిజిటల్‌ ఇన్నొవేషన్స్‌ అంశంపై జీపీఎఫ్‌ఐ సదస్సును నిర్వహించనున్నామని చెప్పారు.

డిజిటల్‌ టెక్నాలజీల అమలుకు పెట్టే పెట్టుబడుల వల్ల ఉత్పాదకత పెంపుతోపాటు ఖర్చులు కూడా తగ్గుతాయని అభివృద్ధి చెందుతున్న దేశాలు గుర్తించాయని, ఈ నేపథ్యంలోనే భారత్‌ సిద్ధం చేసిన యూపీఐ పేమెంట్ల పద్ధతులపై సర్వత్రా ఆసక్తి నెలకొందన్నారు. ఈ ఏడాది జనవరిలో కోల్‌కతాలో నిర్వహించిన తొలి జీపీఎఫ్‌ఐ సమావేశాల ద్వారా కొన్ని సత్ఫలితాలను సాధించామని, ప్రపంచ దేశాల రుణభారాన్ని తగ్గించడం, స్వదేశాలకు చేసే చెల్లింపులకు అయ్యే ఖర్చులు తగ్గించడం, ఆయా దేశాలకు మేలు జరగాలంటే సక్రియాత్మక డిజిటల్‌ మౌలిక సదుపాయాల అవసరం వంటి అంశాల్లో సభ్యుల మధ్య  అంగీకారం కుదిరిందని శ్రింగ్లా తెలిపారు.

కోవిడ్‌ మహమ్మారి కాలంలో భారత్‌ 3700 కోట్ల డాలర్ల మొత్తాన్ని మధ్యవర్తుల అవసరం లేకుండా నేరుగా లబ్దిదారులకు అందజేయడంపై అంతర్జాతీయ సంస్థలూ హర్షం వ్యక్తం చేస్తున్నాయన్నారు. విలేకరుల సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారు చంచల్‌ సర్కార్‌ తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు