పట్టభద్రుల చైతన్యం.. గణనీయంగా పెరిగిన పోలింగ్‌

15 Mar, 2021 08:06 IST|Sakshi
ఆదివారం జనగామ జిల్లా పాలకుర్తిలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటేసేందుకు బారులు తీరిన పట్టభద్రులు

బ్యాలెట్‌ పెట్టెల్లో అభ్యర్థుల భవితవ్యం..

2 పట్టభద్రుల మండలి స్థానాలకు పోలింగ్‌ ప్రశాంతం

17న ఓట్ల లెక్కింపు, ఫలితాలు

హైదరాబాద్‌ 64 %

నల్లగొండ 76 % 

సాక్షి, హైదరాబాద్‌:  పట్టభద్రులు చైతన్యం కనబరిచారు. రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గాలకు ఆదివారం నిర్వహిం చిన ఎన్నికల్లో గణనీయంగా పోలింగ్‌ శాతం పెరిగింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన పోలింగ్‌ చెదురుమదురు ఘటనలు తప్ప ప్రశాంతంగా ముగిసింది. మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్‌ పట్ట భద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 64.87 శాతం, వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 76.35% పోలింగ్‌ నమోదైనట్టు ఆయా నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు ప్రకటించారు. సాయంత్రం 4 తర్వాత జరిగిన పోలింగ్‌ను పరిగణనలోకి తీసుకుని ఆర్‌వోలు ఈ ప్రకటన చేశారు. అయితే, సాయంత్రం నాలుగు గంటల నాటికి హైదరాబాద్‌ స్థానానికి 59.96 శాతం, నల్లగొండ స్థానానికి 64.7 శాతం పోలింగ్‌ నమోదైందని సీఈవో శశాంక్‌ గోయల్‌ ప్రకటించారు.

సోమవారం కచ్చితమైన పోలింగ్‌ గణాంకాలను ప్రకటిస్తామని తెలిపారు. పోలింగ్‌ సిబ్బందికి, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎండ తీవ్రత తగ్గాక సాయంత్రం 4 గంటల నుంచి పోలింగ్‌ ముగిసే సమయం వరకు చాలా పోలింగ్‌ కేంద్రాల్లో పెద్దసంఖ్యలో ఓటర్లు క్యూలైన్లలో నిలబడి ఉండటంతో నిబంధనల ప్రకారం వారికి ఓటేసేందుకు అవకాశం కల్పించారు. కొన్ని చోట్లలో రాత్రి 7 గంటలు దాటిన తర్వాత కూడా పోలింగ్‌ జరిగింది. కొన్ని పోలింగ్‌ కేంద్రాల నుంచి స్ట్రాంగ్‌ రూంలకు బ్యాలెట్‌ పెట్టెలు రావాల్సి ఉందని, అప్పుడే స్పష్టమైన పోలింగ్‌ గణాంకాలు వెల్లడవుతాయని శశాంక్‌ గోయల్‌ ‘సాక్షి’కి తెలిపారు. 

 బ్యాలెట్‌ పెట్టెల్లో భవితవ్యం 
‘హైదరాబాద్‌’మండలి స్థానం నుంచి ఏకంగా 93 మంది, ‘నల్లగొండ’స్థానం నుంచి 71 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో భారీ సైజు బ్యాలెట్‌ పేపర్లు, జంబో బ్యాలెట్‌ బాక్స్‌లను ఉపయోగించి పోలింగ్‌ నిర్వహించారు. జంబో బ్యాలెట్‌ బ్యాక్సుల్లో ఓటర్ల తీర్పు నిక్షిప్తమై ఉంది. ఈ నెల 17న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో ‘హైదరాబాద్‌’, నల్లగొండ పట్టణంలోని మార్కెట్‌ శాఖ గిడ్డంగిలో ‘నల్లగొండ’ఓట్లను లెక్కించనున్నారు. పట్టిష్టమైన భద్రత ఏర్పాట్లతో బ్యాలెట్‌ పెట్టెలను ఆయా ప్రాంతాల్లో నిల్వచేశామని సీఈవో శశాంక్‌ గోయల్‌ తెలిపారు. 

ఓట్ల నమోదు నుంచి కనిపించిన చైతన్యం 
చివరిసారిగా 2015 మార్చిలో జరిగిన ఎన్నికల్లో ‘హైదరాబాద్‌’స్థానానికి 39 శాతం పోలింగ్‌ జరగగా, తాజా ఎన్నికల్లో 64.87 శాతానికి పెరిగింది. అప్పటి ఎన్నికల్లో ‘నల్లగొండ’స్థానానికి 58 శాతం పోలింగ్‌ నమోదు కాగా తాజా 74 శాతానికి పెరిగింది. గత ఎన్నికల్లో హైదరాబాద్‌ స్థానంలో 2,96,318 మంది ఓటర్లు ఉండగా, ఈసారి 5,31,268 మందికి పెరిగారు. నల్లగొండ స్థానంలో 2,81,138 మంది ఓటర్లు ఉండగా, ఈసారి 5,05,565 మందికి పెరిగారు. గత ఎన్నికల నాటితో పోలిస్తే ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో మార్పులు రావడం, భారీగా పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావడం, రాజకీయపార్టీలు, అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహించడం, ఆదివారం పోలింగ్‌ నిర్వహించడం వంటి కారణాలతో ఈసారి పోలింగ్‌ శాతం పెరగడానికి దోహదపడిందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. 

హోంమంత్రిపై ఈసీకి నివేదిక
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవి మేడమ్‌కు ఓటు వేశానని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ చేసిన కామెంట్స్‌పై ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సమర్పించిన నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామని సీఈవో శశాంక్‌ గోయల్‌ తెలిపారు. నివేదిక పరిశీలించి చర్యలపై ఈసీ నిర్ణయం తీసుకుంటుందన్నారు.  

మరిన్ని వార్తలు