పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల గడువు పూర్తి

23 Feb, 2021 15:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో త్వరలో జరుగనున్న రెండు పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల గడువు పూర్తి అయ్యింది. మహబూబ్‌నగర్‌ - రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 60 మందికిపైగా అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేశారు. రేపు (బుధవారం) నామినేషన్ల పరిశీలన, 26న ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. మార్చి14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగనుంది. మార్చి17న ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టనున్నారు. టీఆర్‌ఎస్‌తో పాటు విపక్ష పార్టీలు సైతం  ఈ రెండు స్థానాలను ఎంతో ప్రతిష్టాత్మంగా భావిస్తున్నాయి. ఇప్పటికే ప్రచార హోరును ప్రారంభించాయి. పట్టభద్రులను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు.

కాగా హైదరాబాద్-రంగారెడ్డి స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణిదేవి బరిలో ఉండగా., బీజేపీ నుంచి రామచంద్రరావు, కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా ఫ్రొపెసర్‌ నాగేశ్వర్‌ పోటీలో నిలిచారు. మరోవైపు ఖమ్మం-నల్లగొండ-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. అధికార టీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, కాంగ్రెస్‌ నుంచి రాములు నాయక్‌తో పాటు కోదండరాం, జయసారధి రెడ్డి, తీన్‌మార్‌ మల్లన్న, ప్రేమేందర్‌ రెడ్డి, రాణిరుద్రమ దేవి వంటి ప్రముఖులు పోటీపడుతున్నారు. 


 

మరిన్ని వార్తలు