మూడో పంట పండింది 

2 Sep, 2020 06:05 IST|Sakshi
రైతులు విక్రయానికి తీసుకొచ్చిన ధాన్యం

జనగామలో కత్తెర పంట 

ప్రారంభమైన ధాన్యం దిగుబడి, అమ్మకాలు 

జనగామ: వరి సాగు ఏడాదికి ఎన్నిసార్లు సాగు చేస్తారని అడిగితే ఎవరైనా రెండు సార్లు అంటూ సమాధానం చెబుతారు. కానీ జనగామ జిల్లా రైతులు మాత్రం మూడుసార్లు సాగు చేస్తామని అంటారు. ఏటా రబీ, వానాకాలం సాగు మధ్యలో కత్తెర పంటను సాగుతో అదనపు ఆదాయం సాధిస్తారు. మూడో పంట (కత్తెర) సాగుకు అనుకూలమైన నేలలు ఉండటంతో రైతులకు కలసి వస్తుంది. ఏప్రిల్‌ చివరి వారం నుంచి సాగు పనులు మొదలుపెట్టి, ఆగస్టు మొదటి వారంలో కోతలను ప్రారంభిస్తారు. ఈసారి గోదావరి జలాల పరుగులతో పాటు జోరుగా కురిసిన వర్షాలతో భూగర్భ జలాలు పెరగడంతో జిల్లాలో సుమారు 30 వేల ఎకరాలకు పైగా కత్తెర పంట సాగు చేయగా, 54 వేల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా.  

కొనుగోళ్లు ప్రారంభం
కత్తెర పంటకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్న జనగామ జిల్లాలో ఆగస్టు 24వ తేదీ నుంచి కొనుగోళ్లు ప్రారంభమయ్యా యి. ఎకరాకు 30 బస్తాలకుపైగా దిగుబడి వస్తోందని రైతులు చెబుతున్నారు. ఇప్పటి వరకు  పది వేల బస్తాలకు పైగా ధాన్యం కొనుగోలు చేసినట్లు అంచనా. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం తరఫున కొనుగోళ్లకు అనుమతులు లేకపోవడంతో ప్రైవేట్‌ వ్యా పారులు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. నాణ్యత ఆధారంగా క్వింటా ధాన్యానికి రూ.1,220 నుంచి రూ.1440 వరకు ధర లభిస్తోంది. 
 

మరిన్ని వార్తలు