తాత చనిపోయాడని.. ఆస్పత్రిలో యువతి బీభత్సం

24 Apr, 2021 03:30 IST|Sakshi
ఆస్పత్రిలో వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న యువతి

వెంటిలేటర్‌ పగులగొట్టి, సిబ్బందితో వాగ్వాదం

తాత మృతిని తట్టుకోలేకపోయిన మనుమరాలు

హిమాయత్‌నగర్‌ (హైదరాబాద్‌): కరోనాతో తమ తాతయ్య ప్రాణం పోవడం తట్టుకోలేక ఓ యువతి వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. గురువారం కింగ్‌ కోఠి జిల్లా ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఆస్పత్రిలో బోడుప్పల్‌కు చెందిన సంజీవ్‌రావు (88) నాలుగు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ రావడంతో అడ్మిట్‌ అయ్యాడు. సంజీవరావును కాపాడేందుకు వైద్యులు అన్ని విధాలా తమవంతుగా ప్రయత్నించారు. మూడ్రోజులపాటు 12 లీటర్ల ఆక్సిజన్‌ను అతనికి పెట్టారు. అయితే అతడిలో ఆక్సిజన్‌ శాచురేషన్‌ స్థాయిలు తగ్గిపోతుండటంతో వెంటిలేటర్‌ పెట్టాలని వైద్య సిబ్బంది సంజీవరావు కుటుంబ సభ్యులకు సూచించగా.. అందుకు వారు ఒప్పుకోలేదు.


ఆస్పత్రిలో ధ్వంసమైన వెంటిలేటర్‌

చివరికి గురువారం మధ్యాహ్నం సంజీవరావు ఆరోగ్యం విషమించడంతో వెంటిలేటర్‌ పెట్టగా.. కొద్దిసేపటికే మృతి చెందాడు. దీంతో ఆవేదన చెందిన మనవరాలు ఆస్పత్రి వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో సంజీవరావుకు పెట్టిన వెంటిలేటర్‌ను పగుల గొట్టడంతో వెంటిలేటర్‌ పాడైంది. కాగా, యువతి చర్యపై కింగ్‌ కోఠి జిల్లా ఆస్పత్రి వైద్యులు నారాయణగూడ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు