సామాజిక భద్రతలో సిటీ భేష్‌

24 Jun, 2022 08:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌లో మహిళలపై వేధింపులు, లైంగిక దాడుల కేసులు నిత్యం పెరుగుతున్నప్పటికీ.. వారి సామాజిక భద్రత విషయంలో దేశంలో పలు మెట్రో నగరాలతో పోలిస్తే గ్రేటర్‌లో పరిస్థితి కాస్త మెరుగేనని తాజా సర్వేలో వెల్లడైంది. ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాల్లో  పనిచేసే మహిళల విషయానికి వస్తే సిటీలో జీవన వ్యయం కూడా వారికి భారంగా పరిణమించడంలేదని.. అన్ని వర్గాల వారికీ అందుబాటులోనే ఉందని నెస్ట్‌అవే అనే రెంటల్‌ సంస్థ ఆన్‌లైన్‌ మాధ్యమంలో నిర్వహించిన తాజా సర్వేలో తేల్చింది.

ఈ సంస్థ ప్రధానంగా హైదరాబాద్, పుణె, బెంగళూరు, ఢిల్లీ నగరాల్లో మహిళా నెటీజన్ల అభిప్రాయాలు సేకరించి ఈ సర్వే నిర్వహించింది. ఇందులో విద్య, వ్యాపార, వాణిజ్య, సేవారంగాల్లో పని చేస్తున్న మహిళల భద్రత విషయంలో హైదరాబాద్‌ నగరం 4.2 పాయింట్లు సాధించి అత్యంత మెరుగైన స్థానంలో ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాత 4 పాయింట్లు సాధించిన పుణె రెండోస్థానంలో నిలిచిందని పేర్కొంది. మూడో స్థానంలో ఉన్న బెంగళూరు స్కోరు 3.9 పాయింట్లు. 3.4 పాయింట్లు సాధించిన ఢిల్లీ నాలుగో స్థానంలో నిలిచిందని ప్రకటించింది. 

జీవన వ్యయమూ అందుబాటులోనే.. 
నగరంలోని మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్‌ సిటీ, శంషాబాద్, మియాపూర్, కేపీహెచ్‌బీ, శేరిలింగంపల్లి, చందానగర్‌ తదితర ప్రాంతాల్లో ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇంటి అద్దెలు, హాస్టల్‌ రెంట్లు పనిచేసే మహిళలకు ఆర్థిక భారంగా పరిణమించడంలేదని వెల్లడించింది. పలు మెట్రో నగరాల్లో ఉద్యోగంచేసే ఒంటరి మహిళలు తమకు లభిస్తోన్న వేతనంలో 50 శాతం వరకు నివాస వసతి, భోజనం ఇతరత్రా జీవన వ్యయానికి వెచ్చిస్తున్నట్లు తేలింది.  

  • ఇక వసతి విషయంలో హైదరాబాద్‌ నగరంలోని పలు హాస్టళ్లలో రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు లభ్యమవుతున్నాయని పేర్కొంది. పనిచేసే ప్రదేశానికి అయిదు లేదా పది కిలోమీటర్ల పరిధిలోని హాస్టళ్లు, ఇళ్లలో నివాసం ఉండేవారికి ఇతర అవసరాలకు చేసే జీవన వ్యయం కూడా అందుబాటులోనే ఉన్నట్లు సర్వేలో పాల్గొన్న పలువురు మహిళలు అభిప్రాయపడినట్లు వెల్లడించింది.  
  • నగరంలో ప్రధాన ప్రాంతాలైన మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ఇంటి అద్దెలు మహిళలకు అందుబాటులో ఉన్నట్లు తేలింది. హాస్టళ్లలో ఉండే వసతులను బట్టి పురుషుల నుంచి వసూలు చేస్తున్న అద్దెలతో పోలిస్తే మహిళలు చెల్లిస్తున్న అద్దెలు కూడా వారికి ఏమాత్రం భారంగా పరిణమించడంలేదని.. ఈ విషయంలో తాము ఎలాంటి వివక్ష ఎదుర్కోవడం లేదని పలువురు వర్కింగ్‌ ఉమెన్స్‌ అభిప్రాయపడ్డారని తెలిపింది. 

ఆయా నగరాల్లో జీవనవ్యయాలిలా... 
హైదరాబాద్‌ నగరంలో పలు ప్రాంతాల్లోని హాస్టళ్లలో నివాస వసతి పొందేందుకు ఒక మహిళ సగటున సుమారు రూ.6 నుంచి రూ.7 వేలు ఖర్చు చేస్తున్నట్లు ఈ సర్వే తెలిపింది. పుణె నగరంలో సగటున రూ.8 నుంచిరూ.9 వేలు, బెంగళూరులో సగటున రూ.9 నుంచి 10వేలు, ఢిల్లీలో రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఖర్చుచేస్తున్నట్లు ఈసర్వే తెలిపింది.  

(చదవండి: రోబోలు మనుషుల స్థానాన్ని భర్తీ చేయలేవు)

మరిన్ని వార్తలు