గ్రేటర్‌ మేయర్‌: వాకౌటా.. గైర్హాజరా?

8 Feb, 2021 10:20 IST|Sakshi

మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక 

కీలకంగా మారనున్న మజ్లిస్‌ పాత్ర      

వ్యూహ రచనపై పార్టీ తర్జనభర్జన  

11న దారుస్సలాంలో సమావేశం  

తుది నిర్ణయం తీసుకునే అవకాశం 

సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు సంబంధించి మజ్లిస్‌ పార్టీ పాత్ర కీలకంగా మారింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించకపోవడంతో మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక సమస్యగా పరిణమించింది. మజ్లిస్‌కు మేయర్, డిప్యూటీ మేయర్‌ పీఠాలపై పెద్దగా ఆశలు లేకపోవడంతో పాటు అందుకు తగినంత సంఖ్యా బలం లేకుండాపోయింది. అధికార టీఆర్‌ఎస్‌తో దోస్తీ ఉన్నప్పటికీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగింది. ఇరు పక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి.

ఈ ప్రభావంతో మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలో మద్దతు ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు బీజేపీకి మజ్లిస్‌ మద్దతు ఇచ్చే ప్రసక్తి ఉండదు. అలాగే టీఆర్‌ఎస్‌కు ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చేందుకూ ఆ పార్టీ సిద్ధంగా లేదు. ఇందుకు వ్యతిరేకంగానూ ఓటు వేసే అవకాశాలు కనిపించడం లేదు. ఈ క్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికల్లో పాల్గొనే అంశంపై మజ్లిస్‌ తర్జనభర్జన పడుతోంది. సమావేశం నుంచి వాకౌట్‌ చేయడమా? మొత్తానికే గైర్హాజర్‌ కావడమా అనే అంశాలపై చర్చించనుంది.  
 
మజ్లిస్‌ సంఖ్యాబలం 54.. 
బల్దియాలో మజ్లిస్‌ సంఖ్యా బలం 54. ఇందులో 44 మంది కార్పొరేట్లరతో పాటు 10 మంది ఎక్స్‌అఫీషియో సభ్యులు ఉన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలకు ఓటు హక్కు ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య 193 కాగా.. కోరం సంఖ్య 97. ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలుపుకొంటే టీఆర్‌ఎస్‌ సంఖ్యాబలం 88కు మించదు. దీంతో మజ్లిస్‌ పాత్ర కీలకంగా మారింది.

దూరం పాటించడమే..  
జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల ప్రక్రియకు దూరం పాటించాలని మజ్లిస్‌ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కార్పొరేటర్ల ప్రమాణ స్వీకరణ అనంతరం మేయర్‌ ఎన్నికల కోసం జరిగే ప్రత్యేక సమావేశం నుంచి నేరుగా వైదొలగడమా? ప్రత్యేక సమావేశానికి గైర్హాజరు కావడమా? అనే అంశాలపై ఆ పార్టీ తర్జనభర్జన పడుతోంది. పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాంలో ఈ నెల 11న ఉదయం జరిగే కార్పొరేటర్ల ప్రత్యేక సమావేశంలోనే అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో అవలంబించే వ్యూహంపై స్పష్టతనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

మరిన్ని వార్తలు