గ్రేటర్‌లో ఆర్టీసీ బస్సులను నడపండి

24 Sep, 2020 16:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణాల వల్ల హైదరాబాద్‌ సిటీలో ఆర్టీసీ బస్సులు మూతపడ్డాయి. మార్చి నుంచి ఇప్పటి వరకు బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. జిల్లాల్లో కేసుల సంఖ్య కొంత మేర తగ్గడం, ప్రజా రవాణకు తీవ్ర ఇబ్బందులు ఎదురుకావడంతో రాజధాని నుంచి జిల్లా సర్వీసులను ప్రభుత్వం గతంలో ప్రారంభించింది. అయితే గ్రేటర్‌లో కరోనా విజృంభణ అదుపులోకి రాకపోవడం ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేపోయింది. ఈ క్రమంలోనే గతవారం రోజులుగా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం, కోలుకునే వారిసంఖ్య పెరగడంతో గ్రేటర్‌లో ఆర్టీసీ సర్వీసులను నడపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ప్రజల అవసరాలు దృష్టిలో ఉంచుకుని గ్రేటర్‌ పరిధిలో బస్సులను నడపాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. గురువారం ప్రగతి భవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో సీఎం కేసీఆర్‌ నిర్వహించిన భేటీలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. మెట్రో సేవలు సైతం ఇప్పటికే ప్రారంభం అయ్యాయని, ఇక ఆర్టీసీని కూడా రోడ్డు ఎక్కించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. దీనిపై రానున్న రెండు రోజుల్లో కేసీఆర్‌ నిర్ణయం తీసుకోనున్నారు.  (జీతాలు ఇచ్చేదెట్లా?)

శివారు గ్రామాలకు బస్సులు 
మరోవైపు చేతిలో చిల్లిగవ్వలేక సతమతమవుతున్న ఆర్టీసీ రోజువారీ ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో నగరానికి సమీపంలో ఉన్న ఊళ్లకు తిప్పే బస్సులను బుధవారం తిరిగి ప్రారంభించింది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉండే రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ డిపోల్లో బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో సిటీ బస్సులకు అనుమతి లేకపోవటంతో జిల్లా సర్వీసులను తిప్పుతున్న సంగతి తెలిసిందే. నగరానికి చేరువగా ఉన్న గ్రామాలకు సిటీ డిపోల నుంచి తిరిగే బస్సులను కూడా జిల్లా సర్వీసులుగానే పరిగణిస్తూ బుధవారం ఉదయం నుంచి తిప్పటం ప్రారంభించారు. నగరంలోని 18డిపోల నుంచి 230 సర్వీసులు ప్రారంభించారు. నగరానికి 50 నుంచి 60 కి.మీ. పరిధిలో ఉన్న కొన్ని గ్రామాలకు ఇవి తిరుగుతాయి. వీటి రూపంలో రోజుకు రూ.25 లక్షల వరకు ఆదాయం సమకూరుతుందని ఆర్టీసీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం జిల్లా సర్వీసుల ద్వారా వస్తున్న రూ.4 కోట్ల రోజువారీ ఆదాయానికి ఇది తోడై కొంత ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇక సిటీ బస్సులు నడపాలా వద్దా అన్న నిర్ణయం ముఖ్యమంత్రి పరిధిలో ఉంది. ఆయన ఆదేశం కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. (ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో బొంతు రామ్మోహన్‌..!)

మరిన్ని వార్తలు