ముక్కోటి వృక్షార్చనకు ఏర్పాట్లు పూర్తి

24 Jul, 2021 01:00 IST|Sakshi
ఎంపీ సంతోష్‌ కుమార్‌

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ నిర్వాహకుల ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌: శనివారం మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా తలపెట్టిన ముక్కోటి వృక్షార్చనకు ఏర్పాట్లు పూర్తి అయినట్లు గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ నిర్వాహకులు ప్రకటించారు. వివిధ జిల్లాల్లో నమోదవుతున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని ఒక్క గంటలో నాటాలన్న నియమాన్ని సడలించినట్టు తెలిపారు. వర్షాల తెరిపి, వీలును బట్టి రోజంతా తమతమ ప్రాంతాల్లో మొక్కలు నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీ సంతోష్‌ కుమార్‌ పిలుపు నిచ్చారు. కేటీఆర్‌కు ఈ మొక్కలు నాటడాన్నే పుట్టినరోజు కానుకగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అన్ని స్థాయిల్లోని ప్రజా ప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు, ప్రజలు తమ పరిధిలో వీలైనన్ని మొక్కలు నాట డం ద్వారా హరిత తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలని కోరారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ స్ఫూర్తిని దేశవ్యాప్తం చేయాలన్న తమ సంకల్పానికి ప్రజలు ఇచ్చే ఈ మద్దతు చాలా కీలకమని సంతోష్‌ పేర్కొన్నారు.

ఒక్కరోజే 3.30 కోట్ల మొక్కలునాటేలా కార్యాచరణ...
రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఒక్కరోజే 3.30 కోట్ల మొక్కలు నాటేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్టు నిర్వాహకులు వెల్లడించారు. రాష్ట్రంలోని సర్పంచులు 2.5 కోట్ల మొక్కలు, జీహెచ్‌ఎంసీ మేయర్, కార్పొరేటర్లు కలిపి హైదరాబాద్‌ వ్యాప్తంగా 10 లక్షల మొక్కలు. 142 మున్సిపాలిటీలలో చైర్మన్లు, కౌన్సిలర్ల సహకారంతో 25 లక్షలు మొక్కలు నాటేలా కార్యాచరణ రూపొందించామన్నారు. అన్ని కాలనీ సంఘాలు, ఇతరులు కలిసి 20 లక్షల మొక్కలు, అటవీ శాఖ పరిధిలోని ఖాళీ స్థలాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో 50 లక్షల మొక్కలు, హెచ్‌ఎండీఏ పరిధిలో ప్రజాప్రతినిధులతో 20 లక్షలు మొక్కలు నాటేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ముక్కోటి వృక్షార్చనలో పాల్గొని మొక్కలు నాటేవారు తాము నాటిన మొక్కతో ఫొటో దిగి 9000365000 నంబర్‌కు వాట్సాప్‌ ద్వారా పంపాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. మొక్కల కోసం గ్రామాల్లోని పంచాయతీ నర్సరీలు, అటవీ, మున్సిపల్‌ నర్సరీలను ఇప్పటికే అనుసంధానించినట్టు తెలియజేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు