మున్సిపాలిటీల్లో ‘గ్రీన్‌ స్పేస్‌ ఇండెక్స్‌’ 

31 Aug, 2020 03:02 IST|Sakshi

పచ్చదనం పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం: మంత్రి కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపాలిటీల్లో పచ్చదనం పెంచేందుకు ‘గ్రీన్‌ స్పేస్‌ ఇండెక్స్‌’పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖ రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. నాలుగేళ్ల పాటు అన్ని మున్సిపాలిటీల్లో గ్రీన్‌ స్పేస్‌ ఇండెక్స్‌ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఇందులో పచ్చదనాన్ని పెంచే అత్యుత్తమ పురపాలికలకు ఏటా అవార్డులు ఇస్తామని, తద్వారా పోటీతత్వం పెంచుతామని వెల్లడించారు. గ్రీన్‌ స్పేస్‌ ఇండెక్స్‌లో భాగంగా వినూత్న డిజైన్లు, రోడ్ల పక్కన పచ్చదనం, ఇంటి మొక్కల పెంపకం వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని మంత్రి ప్రకటించారు.

మున్సిపాలిటీల్లో ప్రస్తుతమున్న గ్రీన్‌ కవర్‌ను మదించేందుకు జియోగ్రఫిక్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (జీఐఎస్‌), ఉపగ్రహ చిత్రాలు, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, జియో ట్యాగింగ్‌ పద్ధతుల ద్వారా రికార్డు చేస్తామని వెల్లడించారు. ఈ డేటా ఆధారంగా వచ్చే ఏడాది ఆయా పట్టణాల్లో గ్రీన్‌ కవర్‌ ఎంత మేర పెరిగిందనే అంశాన్ని తిరిగి మదింపు చేస్తామని తెలిపారు. మున్సిపాలిటీల వారీగా ఆయా పట్టణాల్లో గ్రీన్‌ కవరేజీకి 85 శాతం, గ్రీన్‌ కవర్‌ పెంచడంలో అవలంబించిన ఇన్నోవేటివ్‌ పద్ధతులకు 5 శాతం, ఆకట్టుకునే డిజైన్లతో చేపట్టే ప్లాంటేషన్‌కు మరో 10 శాతం వెయిటేజీ ఇచ్చి ఉత్తమ పురపాలికలను ఎంపిక చేస్తామన్నారు. అత్యధిక అర్బన్‌ గ్రీన్‌ స్పేస్, బెస్ట్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫ్‌ అర్బన్‌ గ్రీన్‌ స్పేస్, అర్బన్‌ గ్రీన్‌ స్పేస్‌ పర్‌ క్యాపిట, రోడ్ల పక్కన మొక్కల పెంపకం వంటి కేటగిరీల్లో అవార్డులు ఇస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు