గ్రీనరీ.. పెరిగిన సీనరీ

29 Sep, 2020 02:31 IST|Sakshi

తెలంగాణలో పెరిగిన పచ్చదనం

163.31 చ.కి.మీ. పెరిగిన అటవీ విస్తీర్ణం

2015– 17లో దేశంలో తెలంగాణకు ఐదోస్థానం

4 జిల్లాల్లోనే దట్టమైన అడవులు... 

సత్ఫలితాలు ఇచ్చిన హరితహారం... భారత అటవీ సర్వే వెల్లడి

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: తెలంగాణ పచ్చదనానికి హారతిపడుతోంది. హరితానికి హారం వేస్తోంది. దీనికి రాష్ట్ర ప్రభు త్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం దోహదం చేస్తోంది. వనాలు, సామాజిక అడ వులు, అవెన్యూ ప్లాంటేషన్, గ్రామానికో నర్సరీ మొదలైన కార్యక్రమాలు సత్ఫలితాలిస్తు న్నాయి. భారత అటవీ సర్వే గణాంకాలే దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. లక్ష్య సాధనలో ముందడుగు జాతీయ అటవీ విధానం ప్రకారం దేశ భూభాగంలోని 33 శాతం విస్తీర్ణంలో అడవులు ఉండాలి. దీనిని అంచనా వేసేందుకు జాతీయ అటవీ సర్వే సంస్థ (ఎఫ్‌ఎస్‌ఐ) రెండేళ్లకోసారి ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా దేశంలో అటవీ విస్తీర్ణం పెరుగుదల, క్షీణత తీరుతెన్నులపై సర్వే చేస్తోంది. భారత అటవీ సర్వే – 2019 లెక్కల ప్రకారం.. తెలంగాణ అటవీ విస్తీర్ణం 163.31 చ.కి.మీ. పెరిగింది.

గత రెండేళ్లలో 12,730 హెక్టార్లలో అవెన్యూ ప్లాంటేషన్‌ కింద మొక్కలను నాటారు. మొత్తం భౌగోళిక విస్తీర్ణం 1,12,077 చ. కి.మీ.కాగా 20,582.31 చ.కి.మీ.మేర అడవులు వ్యాపించి ఉన్నాయి. తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో అడవులు 18.36 శాతమే. 2015 – 2019 మధ్య కాలంలో పరిశ్రమలు, ఇతర అవసరాల కోసం ఫారెస్ట్‌ కన్జర్వేషన్‌ యాక్ట్‌ – 1980 కింద 9,420 హెక్టార్లలో చెట్లు నరికారు. కానీ, హరితహారం కింద గత నాలుగేళ్లలో దాదాపుగా 150 కోట్ల మొక్కలను నాటారు. 

2015– 17లో తెలంగాణకు ఐదో స్థానం
2015 –17లో విడుదల చేసిన భారత అటవీ సర్వే నివేదిక ప్రకారం తెలంగాణకు ఐదోస్థానం దక్కింది. భౌగోళికంగా, జనాభాపరంగా చిన్నవైన ఈశాన్య రాష్ట్రాలు పర్యావరణ పరిరక్షణ, పచ్చదనాల్లో దేశంలో అగ్రస్థానంలో ఉన్నాయి ఆయా రాష్ట్రాల్లో ఏకంగా 75 – 90 శాతం వరకు అటవీ ప్రాంతాలే ఉంటాయి. పెద్ద రాష్ట్రాల్లో పచ్చదనం 10 – 27 శాతమే. జాతీయస్థాయి సగటు పచ్చదనం 24 శాతం కాగా, తెలంగాణది మాత్రం 20.6 శాతమే. 2015తో పోలిస్తే 2017లో తెలంగాణలో 565 చ.కి.మీ.ల మేర పచ్చదనం పెరిగింది. 2017 – 19 నివేదిక ప్రకారం 163.31 చ.కి.మీ. మేర అటవీ విస్తీర్ణం తెలంగాణలో పెరిగింది. 

 సర్వేలో వెల్లడైన విషయాలు

  • ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలు మాత్రమే 33 శాతం అడవులను కలిగి ఉన్నాయి. 
  • జాతీయ అటవీ సర్వే – 2019 నివేదిక ప్రకారం ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 6.69 చ.కి.మీ.లలో అడవుల విస్తీర్ణం తగ్గింది. మిగిలిన అన్ని జిల్లాల్లో పెరిగింది.
  • దట్టమైన అడవులు కేవలం వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లోనే ఉన్నాయి.
  • రాష్ట్రంలో మూడు జాతీయ పార్కులు, 9 వన్యప్రాణుల సంరక్షణ అభయారణ్యాలున్నాయి. 

పర్యావరణ నిపుణుల సూచనలు
అటవీ విస్తీర్ణం పెరుగుదల, క్షీణతకు సంబంధించిన గణాంకాల నమోదు విషయంలో పర్యావరణ రంగ నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ఉపగ్రహ ఛాయా చిత్రాలతో చెట్ల పైభాగంలోని పచ్చదనం(పందిరి) ఒక హెక్టార్‌లో 10 శాతం మేర ఆవరించి ఉంటే ఆ ప్రాంతాన్ని అడవిగా గుర్తించడంపై కొన్నాళ్లుగా పర్యావరణ నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అడవులు, పర్యావరణంపై ఇటీవల వరంగల్‌లో జరిగిన సదస్సులోనూ పలువురు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అడవుల పచ్చదనాన్ని అంచనా వేసేటప్పుడు అటవీ భూముల యాజమాన్య హక్కులు, చెట్ల జాతులు నిర్వహణ వంటి వాటిని పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు.

మరిన్ని వార్తలు