ముందుకు సాగని మూడో దశ

8 Dec, 2021 02:17 IST|Sakshi

ముగింపు దశలో దేవాదుల ఎత్తిపోతలకు అడ్డంకులు

రెండున్నర వేల ఎకరాల భూసేకరణ ఇంకా పెండింగ్‌

పాలకుర్తి, నవాబ్‌పేటలో పూర్తికాని రిజర్వాయర్లుకొనసాగుతున్న కాల్వల పనులు 

సాక్షిప్రతినిధి, వరంగల్‌: జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం మూడో దశ ముందుకు సాగడం లేదు. హనుమకొండ, వరంగల్, జయశంకర్‌ భూ పాలపల్లి, జనగామ, ములుగు జిల్లాలతో పాటు కరీంనగర్, సిద్దిపేట, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లోని 6.21లక్షల ఎకరాలకు నీరిందించే ఈ ప్రాజెక్టు 18 ఏళ్లు కావస్తున్నా పూర్తి కావడం లేదు. రెండున్నర వేల ఎకరాలకు పైగా భూసేకరణ, కొన్నిచోట్ల రిజర్వాయర్లు పూర్తికాలేదు. సొరంగం పనులు పూర్తయినా కాల్వల లైనింగ్‌ పనులు కొనసాగుతున్నాయి. 2004లో రూ.6,084 కోట్లున్న అంచనా వ్యయం 2020 జూన్‌ నాటికే రూ.14,945 కోట్లకు పైగా పెరిగిందని అధికారులు వెల్లడించారు. 

6.21 లక్షల ఎకరాలకు పెరిగిన లక్ష్యం
3లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో 2004 లో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. తెలంగాణ ప్ర భుత్వం ఏర్పాటైన తర్వాత ఆయకట్టు లక్ష్యం 6.21 లక్షల ఎకరాలకు పెరిగింది. దేవాదుల ఎత్తిపోతల జలాలను ఉమ్మడి వరంగల్‌ జిల్లాకే వినియోగించాలని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఈ క్రమంలో 5.61లక్షల ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యం తో పనులు ప్రారంభించారు. అయితే ఇతర జిల్లాల రైతాంగ అవసరాలను బట్టి ఆయకట్టు లక్ష్యం 6.21 లక్షల ఎకరాలకు చేరింది. మొదటి దశలో 1.23 లక్షలు, రెండోదశలో 1.91 లక్షలు, మూడోదశలో 3.07 లక్షల ఎకరాల ఆయకట్టు కోసం పనులు మొదలు పెట్టారు. తొలుత 38.182 టీఎంసీలను పంపింగ్‌ చేయాలని నిర్ణయించగా.. ఇప్పుడు పెరి గిన ఆయకట్టు దృష్ట్యా దాదాపు 60 టీఎంపీల నీటి ఏటా ఎత్తిపోయాల్సి ఉంది. మొదటి రెండు దశల పనులు దాదాపుగా పూర్తికాగా మూడో దశ పనుల్లో ఎప్పటికప్పుడు తీవ్ర జాప్యం జరుగుతోంది. 

భూసేకరణకు అడ్డంకిగా కోర్టు కేసులు
ఈ ప్రాజెక్టు కోసం 31,383 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా, 28,793 ఎకరాలు సేకరించారు. మరో 2,590 ఎకరాలను సేకరించాల్సి ఉండగా, కోర్టు కేసుల వంటివి అడ్డంకిగా మారాయి. మరోవైపు పాలకుర్తి, లింగాల గణపురం మండలంలోని నవాబ్‌పేటలో రిజర్వాయర్లు పూర్తి కావలసి ఉంది. ఇక, దేవాదుల ప్రాజెక్టులో కీలకమైంది 49.08 కిలోమీటర్ల హైడ్రాలిక్‌ అండర్‌ టన్నెల్‌. మూడో దశ, మూడో ప్యాకేజీ కింద చేపట్టిన ఈ టన్నెల్‌ పనులకు 2008 నుంచి 2014 వరకు అవాంతరాలు ఏర్పడ్డాయి. 3 కాంట్రాక్టు ఏజెన్సీలను మార్చారు. తెలం గాణ రాష్ట్రం, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2016లో రూ.1,494 కోట్ల అంచనాతో పనులు పునఃప్రారంభమయ్యాయి. ఎట్టకేలకు సొరంగం పనులు పూర్తయినా, కాల్వల లైనింగ్‌ పనులు సాగుతున్నాయి. ధర్మసాగర్‌ చెరువులో నుంచి డిస్ట్రిబ్యూటరీ ద్వారా 1,22,700 ఎకరాలకు కాలువ ద్వారా సాగునీరు అందించేందుకు రెండు (45 అండ్‌ 46 ) ప్యాకేజీల ద్వారా రూ.150.43 కోట్లతో పనులు చేపట్టారు. 

మరిన్ని వార్తలు