TS: అక్టోబర్‌ 16న గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ 

15 Jun, 2022 01:56 IST|Sakshi

వచ్చే ఏడాది జనవరి/ ఫిబ్రవరిలో మెయిన్స్‌ పరీక్షలు 

స్పష్టత ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్షపై స్పష్టత ఇచ్చింది. ఇదివరకే గ్రూప్‌–1 నోటిఫికేషన్‌లో వెల్లడించినట్లుగా ప్రిలిమ్స్‌ పరీక్షను జూలై/ఆగస్టు నెలల్లో నిర్వహించాల్సి ఉండగా, వివిధ కారణాలతో అక్టోబర్‌కు వాయిదా వేస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ 16న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో చైర్మన్‌ బి.జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన కమిషన్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పరీక్ష తేదీ ఖరారుకు సంబంధించి చర్చ జరిగింది. వివిధ రకాల పరీక్షలున్న సమయంలో గ్రూప్‌–1 పరీక్ష నిర్వహించొద్దని, తేదీని కొన్నిరోజులు వాయిదా వేయాలని పలువురు టీఎస్‌పీఎస్సీకి వినతులు, లేఖలు సమర్పించారు.

ఆగస్టు, సెప్టెంబర్‌ల్లో పోలీసు ఉద్యోగాల అర్హత పరీక్షలు, జాతీయ స్థాయిలో యూపీఎస్సీ, ఐబీపీఎస్, ఆర్‌ఆర్‌బీ ఉద్యోగ అర్హత పరీక్షలు కూడా ఉన్నాయి. గ్రూప్‌–1 ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి భారీ స్పందన వచ్చినందున సన్నద్ధతకు మరిం త సమయం ఇవ్వాలంటూ కోరడంతో కమిషన్‌ సానుకూలంగా స్పందించింది.

మరోవైపు రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొదటిసారి గ్రూప్‌–1 నియామకాలు జరగనున్నాయి. వివిధ శాఖల్లో 503 గ్రూప్‌–1 పోస్టులకు ఏకంగా 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. అక్టోబర్‌ 16న ప్రిలిమ్స్‌ నిర్వహించనున్న నేపథ్యంలో మెయిన్‌ పరీక్షలను వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన తేదీలను ప్రిలిమ్స్‌ పరీక్షల తర్వాత కమిషన్‌ వెల్లడించనుంది.    

మరిన్ని వార్తలు