9,168 గ్రూప్‌-4 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్‌!

20 May, 2022 01:36 IST|Sakshi

గ్రూప్‌–4 ఉద్యోగాలపై వారంలోగా వెలువడనున్న ఉత్తర్వులు 

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ మరింత వేగవంతమైంది. ఇప్పటికే 18 వేలకు పైగా ఉద్యోగాలకు నియామక సంస్థలు ప్రకటనలు జారీ చేయగా.. త్వరలో గ్రూప్‌–4 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ కూడా వెలువడనుంది. గ్రూప్‌–4 కింద నిర్దేశించిన 9,168 ఖాళీల భర్తీకి ఈ నెలాఖరులోగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. గ్రూప్‌–1 కేటగిరీలో 503 ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయగా ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది.

పోలీసు శాఖలో 17 వేల పోస్టుల భర్తీకి టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ నోటిఫికేషన్లు విడుదల చేయగా.. దరఖాస్తుల స్వీకరణ గడువు ఒకట్రెండు రోజుల్లో ముగియనుంది. రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ విధానంలో మొత్తం 80 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేయగా.. ఇప్పటికే దాదాపు పావువంతు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడ్డాయి. తాజాగా గ్రూప్‌–4 కింద గుర్తించిన ఉద్యోగాలను కూడా ఒకే దఫాలో భర్తీ చేసేలా నోటిఫికేషన్‌ వెలువడనుంది. ప్రస్తుతం ప్రభుత్వ విభాగాల వారీగా ప్రతిపాదనలకు రూపకల్పన కొనసాగుతోంది. 

శాఖల వారీగానే ప్రతిపాదనల పరిశీలన 
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ గురువారం టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ బి.జనార్దన్‌రెడ్డితో కలిసి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో గ్రూప్‌–4 ఉద్యోగాల భర్తీపై సన్నాహక సమావేశం నిర్వహించారు. గ్రూప్‌–4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి శాఖల వారీగా ఉన్న ఖాళీలు, రోస్టర్‌ పాయింట్ల ప్రకారం పోస్టులను నిర్దేశిస్తూ ప్రతిపాదనలు తయారు చేయాల్సిందిగా ఆదేశించారు.

ఈనెల 29 నాటికి నిర్దేశించిన అన్ని ప్రభుత్వ శాఖలు ఖాళీలకు సంబంధించిన ఇండెంట్లను టీఎస్‌పీఎస్సీకి సమర్పించాలని స్పష్టం చేశారు. నిర్దేశించిన తేదీలోగా ప్రతిపాదనలను సమర్పించినట్లైతే శాఖల వారీగా ప్రతిపాదనల పరిశీలనకు టీఎస్‌పీఎస్సీ తేదీలను ఖరారు చేయనుంది. దాదాపుగా గ్రూప్‌–4 పోస్టులన్నీ జిల్లా కేడర్‌కు చెందినవే అయినప్పటికీ.. జిల్లాల వారీగా కలెక్టర్ల సమన్వయంతో టీఎస్‌పీఎస్సీ పరిశీలన ప్రక్రియ సులభ సాధ్యం కాదు కాబట్టి, విభాగాధిపతుల ఆధ్వర్యంలో శాఖల వారీగానే ప్రతిపాదనలను పరిశీలించి రోస్టర్‌ పాయింట్లు, పోస్టుల ఖాళీలు తదితరాలపై స్పష్టత ఇవ్వనున్నారు.

ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి దాదాపు మూడురోజులు పట్టే అవకాశం ఉంది. పరిశీలన ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రతిపాదనల్లో ఎలాంటి లోపాలు లేనిపక్షంలో జూన్‌ నెలాఖరులో నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది. 

స్థానికులకే 95శాతం ఉద్యోగాలు: సీఎస్‌ 
నూతన జోనల్‌ విధానంతో ఉద్యోగ నియామకాల్లో స్థానికులకే అధిక ప్రాధాన్యం దక్కుతుందని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ వెల్లడించారు. గురువారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో గ్రూప్‌–4 కొలువుల భర్తీ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేడర్‌కు చెందిన గ్రూప్‌–4 ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే కేటాయించామని తెలిపారు. మిగతా 5 శాతంలో కూడా స్థానిక అభ్యర్థులకే ఎక్కువ అవకాశం దక్కుతుందన్నారు. ఇటీవల గ్రూప్‌–1 కింద 503 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రక్రియను ప్రారంభించిందన్నారు.

పోలీసు రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ కూడా కొనసాగుతుండగా, విద్యాశాఖకు కూడా టెట్‌ నిర్వహణకు క్లియరెన్స్‌ ఇచ్చినట్లు తెలిపారు. జూనియర్‌ అసిస్టెంట్‌ లేదా తత్సమాన పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ కోసం నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉంటుందని, సీనియర్‌ అసిస్టెంట్, సూపరింటెండెంట్‌ క్యాడర్‌లలో ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేసి, తద్వారా ఏర్పడ్డ జూనియర్‌ అసిస్టెంట్‌ ఖాళీలను కూడా నోటిఫై చేయాలని సీఎస్‌ అధికారులకు సూచించారు.

సమావేశంలో గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌ శర్మ, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్, పశు సంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్‌ సిన్హా, ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ అంజనీ కుమార్, సీనియర్‌ కన్సల్టెంట్‌ శివశంకర్, టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, పంచాయతీ రాజ్‌ శాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, స్టాంపులు– రిజిస్ట్రేషన్ల సీఐజీ శేషాద్రి, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్‌ రోస్, అటవీ శాఖ పీసీసీఎఫ్‌ డోబ్రియల్‌తో పాటు ఇతర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు