అయితే హింస.. లేదంటే కుంగుబాటు!

2 Mar, 2023 04:55 IST|Sakshi

యువతలో పెరిగిపోతున్న విపరీత మనస్తత్వం..

ప్రేమ కోసమంటూ హత్యలకూ వెరవని వైనం 

సమస్యలు చుట్టుముడితే ఆత్మహత్యలకు పాల్పడుతున్న దైన్యం 

జీవితంలో ఆటుపోట్లను యువత అంగీకరించేలా చూడాలంటున్న నిపుణులు 

వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించే చర్యలు చేపట్టాలని సూచన

తాను ప్రేమించిన యువతిని  ప్రేమిస్తున్నాడనే కక్షతో హైదరాబాద్‌లో ఓ ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థి తన స్నేహితుడిని  ఇటీవల అత్యంత కిరాతకంగా హతమార్చాడు... సీనియర్‌ పీజీ వైద్య విద్యార్థి వేధింపులు, ర్యాగింగ్‌ను తాళలేక, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా తగిన స్పందన రాక తాజాగా ఓ పీజీ వైద్య విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది.  ఈ తరహా ఘటనలు ఇటీవల కాలంలో తరచూ చోటుచేసుకుంటుండటం దేనికి సంకేతం?  ఇందుకు కారణం ఏమిటి?

సాక్షి, హైదరాబాద్‌ :  నేటి ఉరుకుల పరుగుల జీవనంలో విద్యార్థులపై చదువుల ఒత్తిడి పెరగడం, వారి సమస్యలు ఏమిటో ఎవరూ అడిగి తెలుసుకొనే పరిస్థితి లేకపోవడం, సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్టే ప్రపంచంగా మారడం, మద్యం, డ్రగ్స్‌ వాడకం తదితర కారణాలతో కొంత మంది చెడుదారుల్లో పయనిస్తున్నారు. ఫలితంగా చిన్నచిన్న  కారణాలు, సమస్యలనే తట్టుకోలేని పరిస్థితికి చేరుకుని విపరీతమైన  నిర్ణయాలు తీసుకుంటున్నారు. 

ఏం చేయాలి? 
సమాజంలో నెలకొన్న పరిస్థితులు, వాటి వల్ల ఎదురుకాబోయే పరిణామాలపై విద్యార్థులకు శాస్త్రీయంగా అవగాహన కల్పించాలని మానసిక శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వారు మానసికంగా కుంగిపోకుండా ఆత్మవిశ్వాసం, మనోధైర్యం పెంపొందించే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వివిధ పరిస్థితులు, జీవితంపై పడబోయే ప్రభావాలను తల్లిదండ్రులు పిల్లలకు వివరించాలని చెబుతున్నారు.

ఏదో జరిగిపోతుందనే భయం కంటే భవిష్యత్తులో ఎలాంటి ఆటుపోట్లనైనా ఎదుర్కోగలిగే మనోస్థైర్యాన్ని, విశ్వాసాన్ని వారిలో కలిగించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఇంటర్నెట్‌ ప్రపంచంలో మునిగితేలకుండా ఇతర సామాజిక అంశాలపై వారికి అవగాహన కల్పించాలని చెబుతున్నారు. 

ఇన్‌స్టంట్‌ పరిష్కారాలే అసలు సమస్య.. 
ఇప్పుడు యువత ఇన్‌ స్టంట్‌ పరిష్కారాలు కోరుకుంటోంది. ఏవైనా సవాళ్లు ఎదురైనప్పుడు ఒత్తిళ్లను తట్టుకొనే శక్తి కొరవడటం, సంయమనం పాటించలేకపోవడం వారిలో సమస్యగా మారింది. ఓపికతో వ్యవహరించలేకపోవడం వల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు.

ఇవే హత్యలు, ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. పశ్చిమ దేశా ల్లో పిల్లలకు లైఫ్‌స్కిల్‌ ట్రైనింగ్‌లో వీటన్నింటిపై అవగాహన కల్పిస్తారు. మన దేశంలోనూ అలాంటి శిక్షణనివ్వాలి. ఒంటరిగా డిజిటల్‌ పరికరాలతో ఎక్కువ సమయం గడిపే బదులు మిత్రులతో ఆటపాటలు, మాటల వల్ల సోషల్‌ స్కిల్స్‌ పెరుగుతాయి. 
– డాక్టర్‌ నిషాంత్‌ వేమన, కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్, సన్‌ షైన్, చేతన హాస్పిటల్స్‌ 

వ్యక్తిత్వ లోపాలతోనే అలాంటి నిర్ణయాలు.. 
ప్రేమికుల్లో లేదా యువతలో క్రూరమైన ఆలోచనలు, కిరాతకంగా హత్యలకు పాల్పడాలనే ధోరణులు ఉత్పన్నమయ్యాయంటే వారిలో ‘సైకో పాథాలజీ’ లక్షణాలున్నట్లుగానే భావించాలి.వ్యక్తిత్వ లోపాలు ఉండటం వల్లే వారు అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఇళ్లలోనూ పిల్లలకు సమస్యలపై సరైన అవగాహన కల్పించకపోవడం కూడా ప్రస్తుత పరిస్థితులకు కారణం. ఇలాంటి వారికి ఎమోషనల్‌ అవేర్‌నెస్‌ కల్పించాలి. ప్రభుత్వాలు, యూనివర్సిటీలు, విద్యాసంస్థలు ప్రతి కాలేజీలో కమ్యూనికేషన్, కౌన్సెలింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలి. భావోద్వేగాలను ఎలా  నియంత్రించుకోవాలి, ప్రతికూల భావోద్వేగాలను  ఎలా అధిగమించాలనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. చిన్నప్పటి నుంచే బోధన పద్ధతుల్లో వాటిని భాగం చేయాలి.   
  – సి.వీరేందర్, సీనియర్‌ సైకాలజిస్ట్‌


ఒత్తిడిని  దూరం  చేసుకోవాలిలా 
ఏవైనా సంక్షోభ పరిస్థితులు ఎదురైతే మానసిక ప్రశాంతతను పాటిస్తూ ఒత్తిళ్లను  దరిచేరనీయరాదు.
 కష్టకాలంలో మనకు చేదోడువాదోడుగా నిలుస్తారనే విశ్వాసం, నమ్మకం ఉన్న వారితో మాట్లాడుతుండాలి. 
 మనకు ఆప్తులుగా ఉన్నవారితో మనలోని భావాలు పంచుకుంటూ రోజువారీ జీవితం ఆహ్లాదంగా గడిపేలా చూసుకోవాలి.


 

మరిన్ని వార్తలు