వారికి రెమిడెసివిర్, ప్లాస్మా చికిత్సతో సమస్యలు తప్పవు

13 May, 2021 03:11 IST|Sakshi

కరోనాకు ఇస్తున్న మందులు, చికిత్సతో సమస్య జటిలం 

విచక్షణారహితంగా వాడటం వల్ల వైరస్‌ జన్యువుల్లో మార్పులు 

మోస్తరు లక్షణాలున్న వారికీ రెమిడెసివిర్, ప్లాస్మా చికిత్సతో సమస్యలు 

కరోనా చికిత్సపై ప్రముఖ డాక్టర్‌ రమన్‌ గంగాఖేడ్‌కర్‌ అభ్యంతరాలు

సాక్షి, హైదరాబాద్‌: కరోనాకు స్పష్టమైన చికిత్స లేదు. శాస్త్రీయంగా రుజువులు ఉన్న మందులను చికిత్సకు ఉపయోగిస్తున్నారు. అయితే భారత్‌లో కొందరు కరోనా బాధితులకు అందిస్తున్న మందులు, అనుసరిస్తున్న చికిత్స పద్ధతుల వల్ల సమస్య మరింత జటిలం అవుతుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్‌ రమన్‌ గంగాఖేడ్‌కర్‌. భారత వైద్య పరిశోధన సమాఖ్య (ఐసీఎంఆర్‌)లో పనిచేసిన ఆయన ఎప్పటికప్పుడు కరోనా ప్రబలిన తొలినాళ్లలో ఈ వైరస్‌కు సంబంధించిన వివరాలను విలేకరుల సమావేశంలో ప్రపంచానికి తెలియజేసేవారు. గతేడాది జూన్‌లో ఆయన పదవీ విరమణ చేశారు. తాజాగా కరోనా వైరస్, అందిస్తున్న చికిత్స పద్ధతులపై కొన్ని అభ్యంతరాలు తెలుపుతూ వెబ్‌ పోర్టల్‌ ‘ది ప్రింట్‌’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. 

విచ్చలవిడి చికిత్సల వల్లే.. 
‘కోవిడ్‌ చికిత్సకు పనికిరావని నిర్ధారణ అయిన చికిత్స పద్ధతులను విచక్షణరహితంగా వాడటం వల్ల వైరస్‌ రూపాంతరం చెందడమే కాకుండా.. మరింత శక్తిమంతం అవుతుంది. తేలికపాటి లక్షణాలున్న వారికి కూడా రెమిడెస్‌విర్‌ వాడటం, మోస్తరు నుంచి తీవ్రస్థాయి లక్షణాలున్న వారికి ప్లాస్మా ఇస్తే వైరస్‌ బలం పుంజుకునే ప్రమాదం ఉంది. ఈ రకమైన చికిత్స పద్ధతులు, మందులు వాడొద్దని వైద్యులు, ఆస్పత్రులకు ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. లేదా వాటిని సహేతుకమైన పద్ధతిలో వాడటమైనా అలవాటు చేయాలి. భారత్‌లో రూపాంతరం చెందిన వైరస్‌లు ఎక్కువ కావడం ఇతర దేశాలకూ ఆందోళనకరమైన అంశం. అస్పష్టమైన చికిత్సలు, మందుల వాడకం ద్వారా టీకాలకు లొంగని రూపాంతరాలు వృద్ధి చెందే ప్రమాదం ఉంది. ఏదైనా కొత్త వ్యాధిని ఎదుర్కొనేందుకు పురాతన కాలంలో ప్లాస్మాను ఉపయోగించేవారు.

భారత్‌లో ప్రస్తుతం దాన్ని విచ్చలవిడిగా వాడుతున్నాం. వైరస్‌ సోకిన ఏడో రోజు తర్వాత ప్లాస్మా అస్సలు ఇవ్వకూడదు. వైరస్‌లలో లోపాలతో కూడిన పునరుత్పత్తి ఎంజైమ్‌లు ఉంటాయి. వీటి కారణంగానే జన్యుపరమైన మార్పులు జరుగుతుంటాయి. వైరస్‌తో కూడిన కణాలు ఎన్ని ఎక్కువసార్లు విభజితమైతే.. రూపాంతరం చెందేందుకు, జన్యుమార్పులను పోగేసుకునేందుకు అవకాశాలు అంతగా పెరుగుతాయి. ఈ జన్యు మార్పులన్నీ ప్రమాదకరం కాకపోయినా అసమర్థమైన, అహేతుకమైన యాంటీవైరల్‌ మందుల వాడకం లేదా రోగ నిరోధక వ్యవస్థ ద్వారా ఒత్తిడి పెంచేందుకు ప్లాస్మాను ఉపయోగించినా వైరస్‌ అప్రమత్తమవుతుంది. వీటన్నింటి నుంచి తప్పించుకునేందుకు తనవంతు ప్రయత్నాలు మొదలుపెడుతుంది. ఆ క్రమంలో వైరస్‌ మరింత సమర్థ, శక్తిమంతంగా మారొచ్చు.’  చదవండి: (వ్యాక్సిన్‌ విదేశాలకు ఎందుకంటే..)  

రెమిడెసివిర్‌తో ఇలా జరగొచ్చు.. 
‘వైరస్‌ పునరుత్పత్తి ఎంజైమ్‌లన్నింటిపై కాకుండా ఏదో ఒకదానిపై రెమిడెసివిర్‌ ప్రభావం చూపుతుంది. ఇదికాస్తా మందు పనిచేస్తున్న ప్రాంతంలో కొన్ని జన్యుమార్పులు చేసి నకళ్లు సృష్టించేందుకు వైరస్‌కు అవకాశం కల్పిస్తుంది. ప్లాస్మా చికిత్స వాడిన వారిలో వైరస్‌ 4 రెట్లు ఎక్కువ వేగంతో రూపాంతరం చెందుతుందని కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీకి చెందిన డాక్టర్‌ రవి గుప్తా అధ్యయనంలో తేలింది. మన దేశంలో రెమిడెసివిర్‌తోనూ ఆ రకమైన ఫలితాలే ఇవ్వొచ్చు. ప్రభుత్వం నుంచి తగిన సమాచారం లేని కారణంగా దేశంలో కరోనా బాధితులకు ఎప్పుడు, ఏ చికిత్స వాడాలన్న విషయంలో స్పష్టత లేదు. ఈ సమాచారం ఉంటే రోగుల బంధువులు పలానా చికిత్స కావాలంటూ ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం రావు. మోస్తరు నుంచి తీవ్ర లక్షణాలు ఉన్నవారికి ప్లాస్మా ఇవ్వొద్దు. రెమిడెసివిర్‌ ఇస్తే ఆస్పత్రిలో ఉండే సమయం కొంత తగ్గొచ్చు. తేలికపాటి లక్షణాలున్న వారికి ఈ యాంటీవైరల్‌ డ్రగ్‌ ఇవ్వడం సరికాదు. కరోనా వైరస్‌ తీవ్రమయ్యే దశలో కొన్ని చికిత్సలు సక్రమంగా పనిచేయవని చాలా మందికి తెలియదు. సామాజిక మాధ్యమాల్లో లేదా వేరే మార్గాల ద్వారా తెలుసుకుని పలానా చికిత్స ఇవ్వాలని ఆస్పత్రులకు వెళ్లడం బాధాకరం.’అని డాక్టర్‌ గంగ ఖేడ్‌కర్‌ వివరించారు. 

>
మరిన్ని వార్తలు