Gulab Cyclone: తెలంగాణలో భారీ వర్షాలు

27 Sep, 2021 09:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహా నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. బంగాళాఖాతాంలో ఏర్పడిన గులాబ్‌ తుపాను ప్రభావంతో పాటు, ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లలోకి నీరుచేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వాహనదారులు రోడ్లపైకి రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. దిల్ సుఖ్ నగర్, చైతన్య పురి, కొత్తపేట్, సరూర్ నగర్, మీర్‌పేట్‌, పంజాగుట్ట, బంజారాహిల్స్‌, సికింద్రాబాద్‌ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

రాష్ట్రంలో వరుసగా రెండ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, కామారెడ్డి తదితర జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అదేవిధంగా అదిలాబాద్, మంచిర్యాల, కుమ్రుంభీం ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, హన్మకొండ, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కూడా రెండురోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండాలని జోనల్‌ కమిషనర్లందరికీ సూచించింది.

కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసి సమీక్షించాలి
రాష్ట్రంలో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. సీఎం కేసీఆర్‌తో కలిసి ఢిల్లీ వెళ్లిన సీఎస్‌.. ఆదివారం అక్కడినుంచే కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గులాబ్‌ తుపాను ప్రభావం మరో రెండురోజుల పాటు మొత్తం రాష్ట్రంపై ఉండనుందని తెలిపారు.

ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్‌ అలర్ట్, దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించినట్టు తెలిపారు. ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి పరిస్థితులను నిరంతరం సమీక్షించాలని ఆదేశించారు. పోలీస్, ఇతర సంబంధిత శాఖలను సమన్వయం చేసుకుని పని చేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు