పోటీ చేస్తాం.. వలస గోస వినిపిస్తాం

14 May, 2023 03:44 IST|Sakshi

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి సత్తా చాటాలని గల్ఫ్‌ జేఏసీ నిర్ణయం 

‘గల్ఫ్‌’ సమస్యల పరిష్కారానికి అదే మార్గమంటున్న కమిటీ నేతలు 

మోర్తాడ్‌ (బాల్కొండ): ఎన్నికల ద్వారానే తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని గల్ఫ్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలను వేదికగా చేసుకుని గల్ఫ్‌ బోర్డు, సమగ్ర ప్రవాసీ విధానాన్ని (ఎన్‌ఆర్‌ఐ పాలసీ) సాధించాలని, అందుకోసం పోటీయే మార్గమని ఇటీవల సమావేశమై నిర్ణయించింది. 2019 పార్లమెంట్‌ సాధారణ ఎన్నికల్లో నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి 175 మంది పసుపు రైతులు నామినేషన్లు వేసి దేశం దృష్టిని ఆకర్షించిన విషయం విదితమే.

ఇదే తరహాలో గల్ఫ్‌ ప్రభావం ఉన్న 32 అసెంబ్లీ నియోజకవర్గాలలో గల్ఫ్‌ బాధితులతో పెద్దసంఖ్యలో నామినేషన్లు వేయించి తమ డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలపాలని భావిస్తోంది. గల్ఫ్‌ జేఏసీ కార్యాచరణపై ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ఇంటెలిజెన్స్, స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులు సమాచారం సేకరిస్తున్నట్టు సమాచారం. 

32 నియోజకవర్గాల్లో ప్రభావం! 
దాదాపు 15 లక్షల మంది తెలంగాణవాసులు గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. మూడు దశాబ్దాలుగా మరో 30 లక్షల మంది గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లి తిరిగి వచ్చారు. గల్ఫ్‌ కార్మికుల కుటుంబసభ్యుల ఓట్లను లెక్కలోకి తీసుకుంటే సుమారు కోటి వరకు ఉంటుందని జేఏసీ నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల బరిలోకి దిగి తమ ప్రభావం చూపాలని జేఏసీ భావిస్తోంది.

గల్ఫ్‌ వలసలు ఎక్కువగా ఉన్న బాల్కొండ, నిజామాబాద్‌ రూరల్, ఆర్మూర్, నిజామాబాద్‌ అర్బన్, నిర్మల్, ముధోల్, ఖానాపూర్, వేములవాడ, సిరిసిల్ల, చొప్పదండి, కోరుట్ల, జగిత్యాల్, ధర్మపురి, ఎల్లారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, హుజూరాబాద్, హుస్నాబాద్, మానకొండూరు, బోధన్, పెద్దపల్లి, మక్తల్, దేవరకద్ర, మెదక్, సిద్దిపేట, దుబ్బాక, నల్లగొండ, మిర్యాలగూడ, భువనగిరి, పరిగి నియోజకవర్గాలను తాము ప్రభావితం చేయగలమని జేఏసీ చెబుతోంది. 

పోటీకి పలువురు సిద్ధం! 
గోవిందుల అఖిల, మండలోజు సుచరిత, నారుకుల్ల అనిత (జగిత్యాల జిల్లా గోపాల్‌పూర్, ఇబ్రహీంపట్నం, తిప్పాయిపల్లి), ముడా లక్ష్మి (నిర్మల్‌ జిల్లా కౌట్ల(కే) గల్ఫ్‌ జేఏసీ మద్దతుతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

తమ భర్తలు వివిధ కారణాలతో గల్ఫ్‌ దేశాల్లో మరణించగా, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సాయం అందలేదని, తమ గోడు వినిపించేందుకే పోటీకి దిగుతున్నట్టు వీరు చెబుతున్నారు. ఇంకా పలు నియోజకవర్గాల్లో గల్ఫ్‌ జేఏసీ ఆధ్వర్యంలో మూకుమ్మడిగా నామినేషన్లు వేసే యోచనలో ఉన్నారు.

ప్రభుత్వాలు మాట తప్పడంతోనే.. 
గల్ఫ్‌ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు మాట తప్పడంతోనే ఎన్నికల్లో పోటీకి జేఏసీ సిద్ధమవుతోంది.  – మంద భీంరెడ్డి,  గల్ఫ్‌ వ్యవహారాల విశ్లేషకుడు 

సత్తా చూపిస్తాం.. 
ఎన్నికల్లో పోటీ చేసి గల్ఫ్‌ వలస కార్మికుల సత్తా ఏమిటో చూపిస్తాం. ఎన్నికల బరిలో నిలిచి మా బలాన్ని నిరూపిస్తాం. –గుగ్గిల్ల రవిగౌడ్, గల్ఫ్‌ జేఏసీ చైర్మన్‌ 

మరిన్ని వార్తలు