‘ఇప్పటికే రూ.10 కోట్లు.. ఇంటికి పంపించండి’

14 Aug, 2020 19:08 IST|Sakshi

హోటల్‌ క్వారంటైన్‌ కేంద్రాల్లో గల్ఫ్‌ కార్మికుల ఆవేదన

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడం కోసం ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ విధించాయి. దాంతో భారత్‌ నుంచి ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లిన ఎందరో కార్మికులు తిరిగి ఇండియాకు వచ్చారు. ఈ క్రమంలో గల్ఫ్‌ దేశాల నుంచి సుమారు 20 వేల మంది తెలంగాణ వాసులు హైదరాబాద్‌ చేరుకున్నారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని వీరందరిని స్వస్థలాలకు పంపించకుండా హైదరాబాద్‌లోనే క్వారంటైన్‌లో ఉంచింది ప్రభుత్వం. ఈ క్రమంలో తొలుత వచ్చిన 5,500 మందికి తెలంగాణ ప్రభుత్వం ఉచిత క్వారంటైన్‌ సదుపాయం కల్పించింది. అయితే జూన్‌ 7 ‘వందే భారత్‌ మిషన్’‌లో భాగంగా దాదాపు 14,500 వేల మంది తెలంగాణ వాసులు గల్ఫ్‌ దేశాల నుంచి తిరిగి వచ్చారు. వీరందరికి ఉచిత క్వారంటైన్‌ కల్పించడం కష్టంగా భావించిన సర్కార్‌ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఒక్కొక్కరి దగ్గర నుంచి 8,000 రూపాయలు వసూలు చేసి హోటల్స్‌లో క్వారంటైన్‌ ఏర్పాటు చేసింది. ఇలా ప్రభత్వం వీరి దగ్గర నుంచి సుమారు 10 కోట్ల రూపాయలు వసూలు చేసింది. (ప్రభుత్వానికంటే ప్రైవేటు ఆస్పత్రులే బలమైనవా?)

తాజాగా హోటల్‌ సిబ్బంది మరోసారి డబ్బులు కట్టాల్సిందిగా వీరిని డిమాండ్‌ చేస్తున్నారు. అసలే ఉద్యోగాలు కోల్పోయి స్వదేశం వచ్చారు. ఇంకా ఇళ్లకు కూడా వెళ్లలేదు. చేతిలో ఉన్న కొద్ది మొత్తం క్వారంటైన్‌ పేరుతో హోటల్‌కే ఖర్చయ్యింది. ప్రస్తుతం జేబులో రూపాయి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వేలకు వేలు పోసి హోటల్‌లో క్వారంటైన్‌లో ఉండలేము.. మమ్మల్ని హోం ఐసోలేషన్‌కు అనుమతించండి అంటూ గల్ఫ్‌ కార్మికులు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ సందర్భంగా వలసకార్మికుల సంక్షేమ సంఘం సభ్యుడు ఎం. బాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘కరోనా సంక్షోభ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గల్ఫ్‌ కార్మికుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయి. 14,500 మంది దగ్గర నుంచి ఎనిమిది వేల  చొప్పున 10 కోట్ల రూపాయలు వసూలు చేశారు. గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్, ఖతార్, కువైట్, బహ్రెయిన్ నుంచి హైదరాబాద్‌కు రావడానికి ఒక్కొక్కరి దగ్గర నుంచి సగటున 1,000 యూఏఈ దిర్హామ్స్, సౌదీ / ఖతారి రియాల్స్ (సుమారు రూ .20,000) ’వసూలు చేశారని తెలిపారు. (క్వారంటైన్‌ నుంచి భార్యాభర్తల పరార్‌)

ఈ లెక్క ప్రకారం, 20,000 మంది వలసదారులు ఉంటే ఒక వ్యక్తి నుంచి 20,000 రూపాయల చొప్పున మొత్తం 40 కోట్ల రూపాయలు వసూల చేశారని తెలిపారు బాల్‌రెడ్డి. అంతేకాక ‘కేరళ, మహారాష్ట్రల్లో విదేశాల నుంచి తిరిగి వచ్చినవారిని ‘హోం క్వారంటైన్‌’కు అనుమతిస్తున్నారు. ఇక ఏపీ, ఢిల్లీలో గల్ఫ్ ప్రాంతం నుంచి వస్తోన్న పేద వలస కార్మికుల కోసం ప్రభుత్వాలే ఉచిత క్వారంటైన్‌ సదుపాయాలు కల్పిస్తున్నాయి’ అని తెలిపారు బాల్‌రెడ్డి. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ సంక్షోభాన్ని వ్యాపార అవకాశంగా మార్చుకుంటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం, ఆగస్టు 13 వరకు 46,488 మంది ప్రయాణికులు వందే భారత్ మిషన్‌లో భాగంగా హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. వీరంతా 30 దేశాల నుంచి 285 విమానాల్లో హైదరాబాద్‌ చేరుకున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు