రజాకార్లకు ఎదురొడ్డిన గుండ్రాంపల్లి!

16 Sep, 2022 03:52 IST|Sakshi
1993లో గుండ్రాంపల్లిలో అమరవీరుల స్తూపం ప్రారంభోత్సవంలో గ్రామస్తులు 

ఖాసిం రజ్వీ అనుచరుడు మక్బూల్‌

ఆధ్వర్యంలో గ్రామస్తులపై రజాకార్ల దాడులు

30 మందిని బావిలో వేసి సజీవ దహనం చేసిన అరాచక మూకలు

కమ్యూనిస్టు సాయుధ దళాల తిరుగుబాటుతో పరారైన మక్బూల్‌.. అమరవీరుల స్మారకార్థం గ్రామంలో స్తూపం

తమ గ్రామానికి గుర్తింపు ఇవ్వాలంటున్న స్థానికులు

చిట్యాల: నిజాం కాలంలో రజాకార్ల అకృత్యాలకు సజీవ సాక్ష్యం నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి గ్రామం. నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఇక్కడి యువకులెందరో రజాకార్లకు ఎదురొడ్డి పోరాడి ప్రాణాలు వదిలారు. నాటి పోరాటానికి జ్ఞాపకంగా గ్రామంలో అమరవీరుల స్తూపం సగౌరవంగా నిలబడి ఉంది. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం తమ గ్రామానికి తగిన గుర్తింపు లేదని స్థానికులు వాపోతున్నారు.

రక్షక దళాలుగా ఏర్పడి..
రజాకార్ల దారుణాలు సాగుతున్న సమయంలో సూర్యాపేట తాలూకా వర్దమానకోటకు చెందిన సయ్యద్‌ మక్బూల్‌ అనే వ్యక్తి.. తన సోదరి నివాసం ఉంటున్న గుండ్రాంపల్లికి వలస వచ్చాడు. మొదట బతుకుదెరువు కోసం ఇదే మండలం ఏపూరులో ఒక భూస్వామి వద్ద పనిలో చేరాడు. కానీ తర్వాత రజాకార్ల బృందంలో చేరాడు. గుండ్రాంపల్లి కేంద్రంగా సాయుధ పోరాటంలో పాల్గొంటున్నవారిపై రజాకార్లతో కలిసి అరాచకాలకు పాల్పడ్డాడు.

అవి ఎంత దారుణంగా ఉండేవంటే.. గ్రామంలో తాను నిర్మించుకున్న ఇంటి పునాదిలో నిండు గర్భిణులను సజీవ సమాధి చేసి ఆపై నిర్మాణాన్ని చేపట్టాడని గ్రామస్తులు చెప్తున్నారు. ఈ క్రమంలో మక్బూల్, ఇతర రజాకార్ల ఆగడాలను అడ్డుకోవడానికి గుండ్రాంపల్లి కేంద్రంగా ఏపూర్, రెడ్డిబావి, సైదాబాద్, గుండ్లబావి, ఆరెగూడెం, పలివెల, వెలిమినేడు, పెద్దకాపర్తి, చిన్నకాపర్తి, ఎలికట్టె గ్రామాలకు చెందిన యువకులు రక్షక దళాలుగా ఏర్పడ్డారు. రజాకార్ల దాడులను తిప్పికొట్టారు.

30 మందిని సజీవ దహనం చేసి..
గుండ్రాంపల్లి కేంద్రంగా జరుగుతున్న తిరుగుబాటుతో రగిలిపోయిన మక్బూల్‌.. పెద్ద సంఖ్యలో రజాకార్లను కూడగట్టి భారీ దాడికి దిగాడు. తమకు దొరికిన 30 మంది యువకులను గుండ్రాంపల్లిలో ఎడ్లబండ్లకు కట్టి చిత్రహింసలు పెట్టాడు. తర్వాత గుండ్రాంపల్లి నడిబొడ్డున మసీదు ఎదురుగా బావిలో వారందరినీ పడేసి సజీవ దహనం చేశాడు. ఇది తట్టుకోలేక ప్రజలు తిరగబడ్డారు. ప్రస్తుత మునుగోడు మండలం పలివెలకు చెందిన కొండవీటి గురునాథరెడ్డి నాయకత్వంలో సాయుధ దళాలు మక్బూల్‌పై దాడికి ప్రయత్నించాయి.

కానీ మక్బూల్‌ తప్పించుకున్నాడు. తర్వాత మరోసారి చేసిన దాడిలో మక్బూల్‌ చేయి విరిగినా, ప్రాణాలతో తప్పించుకుని పారిపోయాడు. మక్బూల్‌కు సహకరించిన వారి ఇళ్లపై కమ్యూనిస్టు సాయుధ దళాలు దాడి చేసి హతమార్చాయి. నిజాం పాలన నుంచి విముక్తి లభించాక గుండ్రాంపల్లి ఊపిరిపీల్చుకుంది. నాటి పోరాటంలో యువకులను సజీవ దహనం చేసినచోట 1993 జూన్‌ 4న సీపీఐ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపాన్ని నిర్మించారు. అమరులైన వారిలో గుర్తించిన 26 మంది పేర్లను ఆ స్తూపంపై రాశారు. ఏటా సెప్టెంబర్‌ 17న తెలంగాణవాదులు ఈ స్తూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నారు. హైదరాబాద్‌ – విజయవాడ జాతీయ రహదారి విస్తరణలో ఈ స్థూపాన్ని తొలగించగా.. మరోచోట అమరవీరుల స్తూపాన్ని నూతనంగా ఏర్పాటు చేశారు.

గ్రామాన్ని సందర్శించిన అమిత్‌ షా
2017 మే నెలలో గుండ్రాంపల్లి గ్రామాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సందర్శించారు. నాటి సాయుధ పోరాటంలో అసువులు బాసిన వారసులను ఆయన సన్మానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర సందర్భంగా ఈ ఏడాది జూలైలో గుండ్రాంపల్లిని సందర్శించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే గుండ్రాంపల్లి గ్రామ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చుతామని.. గ్రామంలో స్మారక కేంద్రం, మ్యూజియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

రజాకార్ల దుర్మార్గాలు చెప్పలేనివి
నాకు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు రజాకార్ల దాడులు జరిగాయి. గ్రామంలోని యువకులు దళాలుగా ఏర్పడి తిరుగుబాటు చేశారు. రజాకార్లు వారిని పట్టుకుని చంపేశారు. తర్వాత మా ఊరితోపాటు చుట్టుపక్కల గ్రామాల వారంతా కలిసి మక్బూల్‌పై దాడి చేశారు.
నాటి రజాకార్ల దుర్మార్గాలు చెప్పనలవికాదు.
– గోపగోని రామలింగయ్య, గుండ్రాంపల్లి

గుండ్రాంపల్లికి గుర్తింపు ఇవ్వాలి
నిజాం నవాబుకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గుండ్రాంపల్లి గ్రామ చరిత్రకు తగిన గుర్తింపు ఇవ్వాలి. పోరాట చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చి ముందు తరాలకు తెలియజేయాలి. ఏటా సెప్టెంబర్‌ 17న మా గ్రామంలో అధికారికంగా ఉత్సవాలను నిర్వహించాలి.
– గరిశె అంజయ్య, గ్రామ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు,గుండ్రాంపల్లి

మరిన్ని వార్తలు