గురుకులాల్లో ‘పాఠశాల ప్రగతి’

8 Nov, 2021 03:00 IST|Sakshi

ప్రతి శనివారం విద్యార్థులకు సామాజిక స్పృహపై అవగాహన 

తొలుత మైనార్టీ గురుకుల సొసైటీ పరిధిలో అమలుకు సన్నాహాలు 

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందించే దిశగా సంక్షేమశాఖలు నడుంబిగించాయి. చెట్లు నాటడం, పారిశుధ్యం, వ్యర్థాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు వచ్చే శనివారం నుంచి కార్యాచరణ మొదలుపెట్టనున్నాయి. ఇందులో భాగంగా ‘పాఠశాల ప్రగతి’పేరిట కొత్త కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించాయి. ముందుగా మైనార్టీ గురుకుల సొసైటీ పరిధిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలోని 204 మైనార్టీ గురుకుల విద్యాసంస్థల్లో ప్రతి శనివారం ‘పాఠశాల ప్రగతి’పేరిట కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ప్రతి విద్యార్థికి ్రప్రకృతిపట్ల అవగాహన, వనరుల ఆవశ్యకతపై చైతన్యాన్ని కలిగిస్తారు. చెట్లు నాటడం, వాటిని సంరక్షించడం, పారిశుధ్యం, వ్యర్థాల వినియోగంపై అవగాహన కల్పించడంతోపాటు ప్రయోగాత్మక కార్యక్రమాలు చేపడతారు. ప్రతి విద్యార్థికి సామాజిక స్పృహపట్ల విశ్వాసాన్ని కల్పిస్తారు. దీనికిగాను ప్రత్యేకంగా ఓ ఉపాధ్యాయుడికి బాధ్యత అప్పగించాలని మంత్రి ఈశ్వర్‌ సొసైటీ అధికారులను ఆదేశించారు. అనంతరం ఎస్సీ గురుకుల సొసైటీలో కూడా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి ‘సాక్షి’కి తెలిపారు.    

మరిన్ని వార్తలు