మెడికల్ కాలేజీ‌ల ఏర్పాటు ఓ అద్భుతం..

26 Jul, 2020 12:54 IST|Sakshi

సాక్షి, నల్గొండ: మనోధైర్యం, వైద్యుల సలహాలతో  కరోనాను జయించవచ్చని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాతో సహజీవనం తప్పదు. మా ఇంట్లో ఇప్పటికే ఆరుగురు కరోనాను జయించారు. మొదట నా కొడుకు, కోడలికి పాజిటివ్‌ వచ్చింది. తర్వాత 15 రోజుల్లో మళ్లీ నెగిటివ్‌ వచ్చింది. తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పోవాలని ప్రజలను కోరుతున్నా.

హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిని ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తది నిర్మించాలని గతంలోనే ప్రతిపాదించినప్పటికీ అప్పుడు ప్రతిపక్షాలు నానా రాద్ధాంతం చేశాయి. అప్పుడు అడ్డుకొని ఇప్పుడు మాటమార్చి రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉమ్మడి నల్గొండలో 3 మెడికల్ కాలేజీ‌లు ఏర్పాటు చేయడం ఓ అద్భుతమేనని అన్నారు. కరోనా వ్యాధి నిర్ధారణ కోసం అన్ని ఏరియా ఆసుపత్రిల్లో, పీహెచ్‌సీ కేంద్రాల్లో  ప్రభుత్వం రాపిడ్ కిట్‌ల ద్వారా పరీక్షలు నిర్వహించి వైద్యం అందిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్యంపైనే అధిక నిధులు ఖర్చు చేస్తున్నది. (గుజరాత్‌ తర్వాత మనమే!)

పరిపాలనా సౌలభ్యం కోసం సచివాలయం కొత్తది  నిర్మించడం  చాలా  అవసరం. అందువల్ల కోర్టులలో కేస్‌లు వేసిన వారు విత్ డ్రా చేసుకొని  నూతన నిర్మాణానికి సహకరించాలి. ప్రతి విషయంలో రాజకీయాలు అవసరం లేదు. అనవసర విషయాలలో ప్రతిపక్షాలు రాద్ధాంతం మానుకోని కలిసి మెలిసి  రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో 100 అంబులెన్స్‌లు సమకూర్చడం అభినందనీయమని' గుత్తా సుఖేందర్‌ రెడ్డి పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు