కోమటిరెడ్డి బ్రదర్స్‌కు లైఫ్‌ అండ్‌ డెత్‌...

29 Jul, 2022 02:35 IST|Sakshi

దేశంలో ప్రత్యామ్నాయ నాయకత్వం లేనందునే బీజేపీ ఆటలు

తెలంగాణ, ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన జరపాలి

మునుగోడు ఉప ఎన్నికలో కోమటిరెడ్డి సోదరుల మునక ఖాయం

మీడియాతో ఇష్టాగోష్టిలో శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి

రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయడం గవర్నర్‌ పరిధి కాదని, రాష్ట్ర గవర్నర్‌ తన పరిధిలోనే ఉండాలని రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. తాను కూడా రాజ్యాంగ పదవిలో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ ఈ పదవుల్లో ఉన్న వారు తమ హద్దులను గుర్తెరగాలన్నారు. దేశంలో సరైన ప్రత్యామ్నాయ నాయకత్వం లేనందునే బీజేపీ ఆటలు సాగుతు న్నాయని, దేశానికి సరైన నాయకత్వం అవసరముందన్నారు. శాసనమండలిలోని తన చాంబర్‌లో గురువారం మీడియాతో గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. సమకాలీన రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..    
– సాక్షి, హైదరాబాద్‌

రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోంది
రాజకీయాల్లో నాణ్యత తగ్గుతోంది. రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం ప్రతి విషయంలోనూ మోకాలడ్డుతోంది. నిరంకుశ, నియంత పాలన వైపుగా దేశాన్ని నడిపేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా తెలంగాణ, ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన జరపాలి. జమ్మూకశ్మీర్‌లో సాధ్యమైనపుడు తెలంగాణ, ఏపీలో ఎందుకు సాధ్యం కాదు? రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎనిమిదేళ్ల తర్వాత కేంద్రానికి గుర్తుకొచ్చాయా?

సీఎంది పార్లమెంటరీ భాషే!
ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్‌ పార్లమెంటరీ భాషలోనే మాట్లాడుతున్నారు. ఏది పార్లమెంటరీ.. ఏది అన్‌పార్లమెంటరీ అనే అంశంపై మార్గదర్శకాలు ఇవ్వాలి. సర్వేల్లో బీజేపీ పుంజుకుందని చెబుతున్నా అధికారం టీఆర్‌ఎస్‌దే అనే విషయాన్ని మరిచిపోవద్దు. తెలంగాణలో మళ్లీ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడంతోపాటు కేసీఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. హుజూర్‌­నగర్, హుజూరా­బాద్‌లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను 95 శాతం మేర నెరవేర్చింది. ఎన్నికల సమయంలో కొందరు నాయకులు పార్టీలు మారడం సహజం. ఈటలకు టచ్‌లో ఉన్న నేతలెవరో ఆయనకు తప్ప ఎవరికీ తెలియదు. చంద్రబాబు మాట విని ఏడు మండలాలను బీజేపీ ఏపీలో విలీనం చేసింది. పోలవరం ముంపు తగ్గించేందుకు సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. పోలవరంతో తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు ప్రమాదం ఉంది. ప్రకృతి ప్రకో­పిస్తే అమెరికానే మునిగింది. కాళేశ్వరం కూ­డా ప్రకృతి వైపరీత్యమే. షర్మిల కోరుకుంటు­న్న పాలన తెలంగాణలో కాదు రావాల్సింది. 

కోమటిరెడ్డి బ్రదర్స్‌కు లైఫ్‌ అండ్‌ డెత్‌...
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతాను అని అడిగిన విషయం నాకు తెలియదు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అంశం రాజగోపాల్‌రెడ్డి చేతిలోనే ఉంది. అయితే ఆయన రాజీనామా అంశాన్ని సాగదీసే అవకాశం ఉంది. కోమటిరెడ్డి సోదరులకు మునుగోడు ఉప ఎన్నిక రాజకీయంగా చావుబతుకులకు సంబంధించిన సమస్య. ఉప ఎన్నిక వస్తే ఇద్దరు సోదరులు మునుగుతారు. మునుగో­డులో నేను పోటీ చేయాలా వద్దా అనేది సీఎం నిర్ణయిస్తారు. 

మరిన్ని వార్తలు