గవర్నర్‌ ప్రసంగం సాఫీగా సాగుతుందని ఆశిస్తున్నా..

1 Feb, 2023 02:28 IST|Sakshi

ప్రభుత్వం, రాజ్‌భవన్, అసెంబ్లీ కలిసి పనిచేస్తేనే అభివృద్ధి 

చనిపోయిన టీడీపీని బతికించడం ఎవరితరం కాదు 

పవన్‌కల్యాణ్‌ ప్రభావం ఎంతమాత్రం ఉండబోదు: గుత్తా 

సాక్షి, హైదరాబాద్‌: తమిళనాడు అసెంబ్లీలో అక్కడి గవర్నర్‌ ప్రసంగం తరహాలో బడ్జెట్‌ సమావేశాల ప్రారంభంలో తెలంగాణ గవర్నర్‌ ప్రసంగం ఉండదని భావిస్తున్నట్లు శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. కేంద్రం చెప్పినట్లు రాష్ట్రాల గవర్నర్లు వ్యవహరిస్తున్నారని, గవర్నర్‌ ప్రసంగం సాఫీగా జరగాలని ఆశిస్తున్నానన్నారు. శాసనమండలి ఆవరణలో మంగళవారం గుత్తా సుఖేందర్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్‌ నడుమ వివాదం సర్దుకుంటుందని తానే ముందే చెప్పానని, గవర్నర్‌తో విభేదాలు రావడం, పోవడం సహజమని వ్యాఖ్యానించారు. గవర్నర్, ప్రభుత్వం, అసెంబ్లీ పరస్పర సంబంధం కలిగి ఉంటాయని, ఇందులో ఏ ఒక్కరిదో విజయం అంటూ ఉండదని పేర్కొన్నారు. అన్ని వ్యవస్థలు కలిసి పనిచేసినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. విపక్ష సభ్యులకు సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఇస్తామని, సభ్యుల సంఖ్య తక్కువగా ఉండటంతో వారికి కేటాయించే సమయం తక్కువగా ఉంటోందని చెప్పారు. ఫిబ్రవరి 3న ప్రారంభమయ్యే బడ్జెట్‌ సమావేశాలు 14వ తేదీ వరకు కొనసాగే అవకాశముందన్నారు. 

బీఆర్‌ఎస్‌కు జాతీయ స్థాయిలో ఆదరణ 
బీఆర్‌ఎస్‌కు జాతీయస్థాయిలో ఆదరణ ఉంటుందని, కొన్ని రాష్ట్రాల్లోని రాజకీయ శూన్యత బీఆర్‌ఎస్‌కు కలిసి వస్తుందని గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. రాజకీయ నాయకులు ఎన్నడూ తెరమరుగు కారని, వారి పని అయిపోయిందని భావించకూడదని, సమయం వచ్చినపుడు సత్తా చూపుతారన్నారు. ఇటీవల బీఆర్‌ఎస్‌లో చేరిన ఒడిశా మాజీ సీఎం గిరిధర్‌ గమాంగ్‌ చాలా సీనియర్‌ నేత అనే విషయాన్ని గుర్తు చేస్తూ నీలం సంజీవరెడ్డి చాలా ఏళ్ల పాటు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండి తర్వాతి కాలంలో ఎంపీగా, లోక్‌సభ స్పీకర్‌గా, రాష్ట్రపతిగా పదవులు చేపట్టారన్నారు. చనిపోయిన టీడీపీకి తెలంగాణలో జీవ గంజి పోసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నా అది సాధ్యం కాదన్నారు. పవన్‌ కల్యాణ్‌ వంటి వారి ప్రభావం ఎంతమాత్రం ఉండబోదని చెప్పారు.  

జగదీశ్‌రెడ్డితో విభేదాల్లేవు 
ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో మంత్రి జగదీశ్‌రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని, పంచాయతీలు, వ్యవహారాల్లో తలదూర్చను అని గుత్తా సుఖేందర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ మంచి ఫలితాలు సాధిస్తుందని, వామపక్షాలతో పొత్తు కలిసి వస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని తన కుమారుడు అనుకుంటున్నా, తుది నిర్ణయం పార్టీదే అని చెప్పారు.   

మరిన్ని వార్తలు