గాంధీలో విద్యుత్‌ అంతరాయం

24 Jul, 2020 02:53 IST|Sakshi

35 నిమిషాలపాటు అంధకారంలో వార్డులు

గాంధీ ఆస్పత్రి: కోవిడ్‌ నోడల్‌ కేంద్రమైన సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో గురువారం సాయంత్రం సుమారు అరగంటపైగా విద్యుత్‌ అంతరాయం కలిగింది. అత్యవసర, సాధారణ వార్డుల్లో అంధకారం అలముకోవడంతో కరోనా బాధితులతోపాటు వైద్యులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అనంతరం జనరేటర్లు ఆన్‌ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గాంధీ ఆస్పత్రిలో సాయం త్రం 5.30 గంటలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. చీకట్లు కమ్ముకోవడంతో ఏం జరుగుతుం దో తెలియక రోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఐసీయూ, అత్యవసర విభాగాల్లో సుమా రు 850 మంది ఆక్సిజన్, వెంటిలేటర్లపై వైద్యసేవలు పొందుతున్నారు.

విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ఆయా విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. స్పం దించిన ఆస్పత్రి పాలనా యంత్రాంగం సంబంధిత ఎలక్ట్రీషియన్లను అప్రమత్తం చేసింది. ఆస్పత్రిలో ఉన్న 500 కేవీ జనరేటర్లను ఆన్‌ చేసి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. 35 నిమిషాల తర్వాత ఆస్పత్రి మొత్తానికి విద్యుత్‌ సరఫరా జరిగింది. 11 కేవీ ఫీడర్‌లైన్‌ ద్వారా ఆస్పత్రి ఎలక్ట్రిసిటీ కంట్రోల్‌ బోర్డుకు విద్యుత్‌ సరఫరా జరుగుతోంది. ఉదయం నుంచి నిరంతరం కురుస్తున్న వర్షానికి ఫీడర్‌లైన్‌ జంపర్‌ హఠాత్తుగా తెగిపోవడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడమే కాకుండా ఓవర్‌లోడ్‌ పడడంతో ఆటోమేటిక్‌గా ఆన్‌ కావాల్సిన జనరేటర్లు స్విచ్చాఫ్‌ అయ్యాయి.  

గాంధీలో ఆరుగురే కాంట్రాక్టు సిబ్బంది
సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో మొత్తం 21 ఎలక్ట్రీషియన్‌ పోస్టులు అవసరం కాగా ప్రస్తుతం మూడు షిఫ్ట్‌ల్లో ఆరుగురు కాంట్రాక్టు ఎలక్ట్రీషియన్లు మాత్ర మే అందుబాటులో ఉన్నారు. వారికి కూడా సంబం ధిత సర్టిఫికెట్, తగినంత సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం గమనార్హం. 

అంతరాయం 7 నిమిషాలే..
గాంధీ ఆస్పత్రిలో కేవలం ఏడు నిమిషాలు మాత్రమే విద్యుత్‌ అంతరాయం కలిగిందని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజారావు వివరణ ఇచ్చారు. గురువారం సాయంత్రం 5.35 నుంచి 5.56 గంటల వరకు సరఫరా నిలిచిపోయిందని, ఏడు నిమిషాల వ్యవధిలో జనరేటర్ల ద్వారా విద్యుత్‌ పునరుద్ధరించామని చెప్పారు. ఐసీయూ, అత్యవసర విభాగాలతో పాటు సాధారణ వార్డులో రోగులకు అందిస్తున్న చికిత్సలకు ఎటువంటి అంతరాయం కలగలేదని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు