ఠాణా ఆవరణలో వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం 

26 Sep, 2022 01:56 IST|Sakshi
వృద్ధురాలితో మాట్లాడుతున్న పోలీసు 

అడ్డుకున్న ఏఎస్సై సమ్మూలాల్‌ 

శాయంపేట: భూ సమస్య పరిష్కారం కాకపోవడంతో మనస్తాపం చెందిన వృద్ధ దంపతులు పోలీస్‌స్టేషన్‌ ప్రాంగణంలో ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. ఏఎస్సై సమ్మూలాల్‌ వారిని అడ్డుకున్నారు. హనుమకొండ జిల్లా శాయంపేటలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన కోడిమాల లక్ష్మి, మల్లయ్య దంపతులకు సర్వే నం.114/బీలో 1.05 ఎకరాల భూమి ఉంది.

ఈ భూమి మల్లయ్యకు తండ్రి ఓదెలు నుంచి వారసత్వంగా సంక్రమించింది. దీంతో ఆ భూమిని సాగు చేసుకుంటూ దంపతులు జీవనం సాగిస్తున్నారు. అయితే అదే గ్రామానికి చెందిన బండ నారాయణరెడ్డి.. ఆ భూమి తనకు ఇస్తే సర్వే నం.507/బీలోని చిట్టిరెడ్డి రాజిరెడ్డికి చెందిన 2.12 ఎకరాల భూమిని ఇస్తామని చెప్పి.. జనవరి 1990లో రాజిరెడ్డి భూమి విక్రయించినట్లుగా..అందుకు బయానా రూ.2వేలు తీసుకున్నట్లు వీరికి కాగితం రాసిచ్చాడు.

దీంతో వీరు రెండెకరాల 12 గుంటల భూమిలో కాస్తులో ఉన్నారు. అయితే రాజిరెడ్డి ఆ భూమిని గ్రామంలోని అన్నబోయిన రఘుపతికి విక్రయించాడని బాధితులకు తెలియడంతో పలుమార్లు పెద్దమనుషుల దృష్టికి తీసుకెళ్లారు. నారాయణరెడ్డి ఎకరం ఐదు గుంటల భూమి తీసుకొని ఇచ్చిన రెండెకరాల 12 గుంటల భూమిని రాజిరెడ్డి, రఘుపతికి అప్పగించడంతో ఉన్న భూమి కోల్పోయి వృద్ధాప్యంలో అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆగ్రహంతో ఇటీవల మార్కెట్‌లో సర్పంచ్‌ రాజిరెడ్డిని దుర్భాషలాడారు. దీంతో సర్పంచ్‌ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

దీనిపై బాధితులు తమకు సర్పంచ్‌ అన్యాయం చేస్తున్నారని విన్నవించుకున్నారు. భూమిని కోల్పోయి ఇబ్బందులు పడుతున్నామని, తమ భూమి తమకు ఇప్పించాలని కోరుతూ ఆదివారం లక్ష్మి, మల్లయ్యలు పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఆవరణలో పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే ఏఎస్సై అడ్డుకొని వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. దీనిపై ఎస్సై ఇమ్మడి వీరభద్రరావును వివరణ కోరగా.. సర్పంచ్‌ రాజిరెడ్డి తనను లక్ష్మి, మల్లయ్య తిట్టారని ఫిర్యాదు చేయడంతో వారిని స్టేషన్‌కు పిలిపించామని తెలిపారు. దీనిపై విచారణ చేస్తున్నామని వివరించారు.  

మరిన్ని వార్తలు