చేనేతకు వీడియో ‘కాల్‌’

26 Feb, 2021 04:38 IST|Sakshi

ఆన్‌లైన్‌ బాటలో వస్త్ర వ్యాపారులు..

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్,యూట్యూబ్‌లో చీరల డిజైన్లు

వీడియో కాల్‌లో డిజైన్లు చూపుతూ ఆర్డర్లు రాబట్టే యత్నం

యాదాద్రి జిల్లాలో నెలకు సగటున రూ.4 కోట్ల అమ్మకాలు

నిన్నటి వరకు.. గుట్టలుగా పట్టుచీరలు.. ఎలా అమ్ముకోవాలో తెలియదు.. బేరం వస్తే వచ్చినట్టు లేదంటే లేదు.. కొత్తగా ఏదైనా ఆలోచన చేయాలన్నా బయటి పరిస్థితులు, మార్కెట్‌పై అంతంతగానే అవగాహన.. ప్రత్యేకించి ఆన్‌లైన్‌పై అవగాహన లేక అమ్మకాల్లో వెనుకబాటు.. ఈ క్రమంలోనే నష్టాలు.. ఆపై బతుకు కష్టాలు..

ప్రస్తుతం.. అవసరం అన్నిటినీ నేర్పిస్తుంది. ఇప్పుడు భూదాన్‌పోచంపల్లి పట్టు చీరల వ్యాపారులు ‘ఆన్‌లైన్‌’ బాటపట్టారు. వీడియో కాల్‌లో డిజైన్‌ చూపించి అమ్మడం నేర్చుకున్నారు. మంచి డిజైన్లను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌చేసి ఆర్డర్లు రాబట్టుకుంటున్నారు. కరోనా కాలంలో అన్ని రంగాలు కుదేలైపోతే ఇక్కడి వ్యాపారులు మాత్రం ఆన్‌లైన్, సామాజిక మాధ్యమాల ద్వారా లక్షల విలువైన చేనేత వస్త్రాలను విక్రయించారు.

సాక్షి, యాదాద్రి: ఆన్‌లైన్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా జాతీయ, అంతర్జాతీయస్థాయిలో భూదాన్‌ పోచంపల్లి పట్టుచీరల అమ్మకాలు ఊపం దుకున్నాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ల ద్వారా వందలాది మంది యువ చేనేత కళాకారులు ఇక్కత్, టైఅండ్‌డై పట్టుచీరలు, పెళ్లిచీరలు, కాటన్‌ చీరలు, డ్రెస్‌ మెటీరియల్‌ అమ్మకాలను పెంచుకుని ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఒక్క యాదాద్రి భువనగిరి జిల్లావ్యాప్తంగా ప్రతి నెలా సుమారు రూ.4 కోట్ల మేరకు ఆన్‌లైన్‌ వ్యాపారం సాగుతోందని అంచనా. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లితో పాటు చౌటుప్పల్, రామన్నపేట, హైదరాబాద్‌ కేంద్రాలుగా ఆన్‌లైన్‌లో వస్త్రాల అమ్మకాలు సాగుతున్నాయి. చేనేత కుటుం బాల్లో ఉన్నత చదువులు చదువుకున్న యువత.. తమకున్న అవగాహనతో ఈ రంగంలో రాణిస్తున్నారు. జిల్లాలో సుమారు 700 మంది వరకు ఆన్‌లైన్‌ వ్యాపారంలో కొనసాగుతున్నారు. కరోనా సమయంలోనూ తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకుని కొత్త డిజైన్లతో కొనుగోలుదారులకు చేరువయ్యారు.

ధర తక్కువ.. మంచి డిజైన్‌
కరోనా నేపథ్యంలో అందరి ఆర్థిక పరిస్థితులు తారుమారయ్యాయి. జనం అనవసర ఖర్చులు తగ్గించుకున్నారు. దీంతో వస్త్రాల కొనుగోళ్లూ పడిపోయా యి. మరోపక్క రవాణా వసతి లేక, శుభకార్యాలు నిలిచిపోవడంతో చేనేత పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడింది. ఎగుమతులు నిలిచిపోవడంతో కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఉత్పుత్తులు తగ్గాయి. ఈ పరిస్థితుల్లో ఈ రంగంలోని యువత చేనేత వస్త్రాలను వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూ బ్‌ వంటి మాధ్యమాల్లో పెడుతూ వాటి గురించి ప్రచారం చేశారు. చివరకు వీడియో కాల్‌ ద్వారా డిజైన్లను చూపించి ఆకర్షించే యత్నం చేశారు. త క్కువ ధరకే మంచి రంగులు, అందమైన చీరల డిజైన్లను ఆన్‌లైన్‌లో ఉంచి కొనుగోలుదారులను ఆకట్టుకోగలిగారు. దీంతో వస్త్రాల కొనుగోళ్లు పెరిగాయి.

ఆన్‌లైన్‌లో అమ్మకాలు ఇలా..
భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్, సిరిపురం, వెల్లం కి, బోగారం, రామన్నపేట, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారులు ఆన్‌లైన్‌ అమ్మకాల్లో ముందున్నారు. పోచంపల్లి ఇక్కత్‌ (టై అండ్‌ డై) పట్టుచీరలు, డ్రెస్‌మెటీరియల్స్‌తోపాటు, మస్‌రస్‌ (మెర్స్‌రైజ్డ్‌), సిల్కు, పట్టు, కాటన్‌ వస్త్రాలలో తమకు అందుబాటులో ఉన్న డిజైన్లను, వాటి ధరలను వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేస్తారు. డిజైన్లు, ధర నచ్చి డబ్బులు చెల్లించిన వారికి కొరియర్‌ ద్వారా పంపిస్తారు. నమ్మకం కుదిరిన వారికి, సంస్థలకు క్రెడిట్‌ కూడా ఇస్తున్నారు. దీంతో లాక్‌డౌన్‌ సమయంలోనూ ఆన్‌లైన్‌ అమ్మకాలు జోరుగా సాగాయి. ఒక్కొక్కరు నెలకు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల విలువైన సరుకు విక్రయించారని అంచనా. లాక్‌డౌన్‌ అనంతరం దుకాణాలు తెరుచుకోవడంతో ఆన్‌లైన్‌ వ్యాపారం కాస్త తగ్గింది. కాగా, ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 30 వేల చేనేత కుటుంబాలు ఉండగా, ప్రతి నెలా సగటున లక్ష పట్టుచీరలు ఉత్పత్తవుతున్నాయి. ఆన్‌లైన్‌లో విక్రయించే వారికి సొంతంగా వెబ్‌సైట్లు, కొందరికి యూట్యూబ్‌ చానల్స్‌ ఉన్నాయి. హైదరాబాద్‌ కేంద్రంగా వ్యాపారం చేసేవారు కొందరు అమెజాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. 

విదేశాల నుంచి ఆర్డర్లు..
ఆన్‌లైన్‌లో పట్టుచీరల కోసం ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయి. కరోనాతో తగ్గిన సేల్స్‌ను ఆన్‌లైన్‌ ద్వారా పెంచుకున్నాం. ఆర్థిక ఇబ్బందులను గుర్తించి కొనుగోలుదారుల కోసం తక్కువ ధర చీరలను కొత్త డిజైన్లతో ఎక్కువగా తయారుచేసి అమ్మకానికి పెట్టాం. వీడియో కాల్‌ ద్వారా చీరల రంగులు, డిజైన్లు చూపించి.. నచ్చితే ఆన్‌లైన్‌ చెల్లింపులతో విక్రయిస్తున్నాం. వీరికి ఇండియా పోస్ట్, కొరియర్ల ద్వారా పార్శిళ్లను పంపిస్తున్నాం. – అంబటి సాయినాథ్, ఆన్‌లైన్‌ వస్త్రవ్యాపారి, భూదాన్‌పోచంపల్లి

మార్జిన్‌ తగ్గించుకున్నాం
లాక్‌డౌన్‌ వేళ ఆన్‌లైన్‌ వస్త్రవ్యాపారం బాగా జరిగింది.  షాపింగ్‌కు బయటకు వెళ్లే వీల్లేకపోవడంతో చాలామంది ఆన్‌లైన్‌ ద్వారా చీరల్ని సెలెక్ట్‌ చేసుకొని ఆర్డర్‌ ఇచ్చారు. కరోనా సమయంలో మేం కూడా మార్జిన్‌ (లాభం) తగ్గించుకున్నాం. ఒక్క పోచంపల్లిలోనే సుమారు 300పైగా యువకులు, దుకాణదారులు ఆన్‌లైన్‌ బిజినెస్‌ చేస్తున్నారు. ప్రస్తుతం అన్‌సీజన్‌తో గిరాకీ కొంచెం తగ్గింది. – భారత హరిశంకర్, ఆన్‌లైన్‌ వస్త్రవ్యాపారి, భూదాన్‌పోచంపల్లి 

>
మరిన్ని వార్తలు