సూపర్‌ లగ్జరీ బస్సు దగ్ధం

24 Jul, 2021 02:48 IST|Sakshi

డ్రైవర్‌ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు

హన్మకొండ నుంచి ఉప్పల్‌ వెళ్తున్న బస్సు.. స్టేషన్‌ ఘన్‌పూర్‌ వద్ద ఘటన

స్టేషన్‌ ఘన్‌పూర్‌: హన్మకొండ నుంచి ఉప్పల్‌కు వెళ్తున్న వరంగల్‌–1 డిపోకు చెందిన సూపర్‌ లగ్జరీ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తు ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడ్డారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ బస్టాండ్‌ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. సూపర్‌ లగ్జరీ బస్సు హన్మకొండ నుంచి ఉప్పల్‌కు మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరింది. స్టేషన్‌ఘన్‌పూర్‌ ఫ్‌లైఓవర్‌ ఎక్కిన బస్సు నెమ్మదిగా వెళ్తుంటే డ్రైవర్‌కు అనుమానం వచ్చింది. అప్పటికే బస్సు వెనుక వైపు ఉండే ఇంజన్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల పొగలు వస్తున్నాయి.

వెనుక సీట్లలో కూర్చున్న ప్రయాణికులకు పొగ వాసన రావడంతో డ్రైవర్‌కు ఈ విషయాన్ని చెప్పారు. వెంటనే డ్రైవర్‌ బస్సును పక్కకు ఆపి ప్రయాణికులందరినీ కిందికి దించాడు. అప్పటికే బస్సులో మంటలు వ్యాపించాయి. అందరూ చూస్తుండగానే బస్సు పూర్తిగా కాలిపోయింది. వాటర్‌ ట్యాంకర్‌ తెప్పించి స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా అప్పటికే క్యాబిన్, సీట్లు, ఇంజన్‌ పూర్తిగా కాలిపోయాయి. అదే సమయంలో రాఘవాపూర్‌కు చెందిన తోట శ్రీకాంత్‌ బైక్‌ బస్సు పక్కనే ఉండటంతో పాక్షికంగా దగ్ధమైంది. కాగా, అగ్ని ప్రమాదం జరిగిన దాదాపు గంట తర్వాత పాలకుర్తి ఫైర్‌ ఇంజన్‌ ప్రమాదస్థలానికి చేరుకుంది. అనంతరం జనగామ నుంచి మరో ఫైర్‌ ఇంజన్‌ వచ్చింది. ఫైర్‌ ఇంజన్లు, వాటర్‌ ట్యాంకర్ల సహాయంతో మంటలను పూర్తిగా ఆర్పివేశారు.

మరిన్ని వార్తలు