వజ్రోత్సవాల్లో విరివిగా జాతీయ పతాకాల వినియోగం.. వాటిని ఇప్పుడేం చేయాలి?

19 Aug, 2022 21:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా దేశమంతా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన విషయం విదితమే. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ఇంటింటికీ త్రివర్ణ పతాకాలను పంపిణీ చేసింది. స్వాతంత్రం సాధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమం కావడంతో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఇంటింటింకే కాదు.. తమ దేశ భక్తి చాటుకోడానికి వాహనాలకు, పబ్లిక్‌ ప్లేస్‌ల్లో, పార్కులలో, కార్యాలయాల్లో విస్తృతంగా త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు.

ఈసారి పంద్రాగస్టున లక్షల సంఖ్యలో జెండాలను ఘనంగా రెపరెపలాడించారు. కానీ జాతీయ జెండా అతి గౌరవప్రదమైనది. జెండాను ఎగురవేయడంలో, వినియోగించడంలో ఫ్లాగ్‌ కోడ్‌ విధిగా పాటించాలి. వజ్రోత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు వేడుకలను నిర్వహిస్తున్నారు. అనంతరం ఈ జెండాలను ఏ విధంగా పరిరక్షిస్తారు, ఫ్లాగ్‌ కోడ్‌ నిబంధనలకు అనుగుణంగా అగౌరవపరచకుండా జాగ్రత్తగా భద్రపరచాల్సిన అంశాలపైన అవగాహాన పెరగాల్సిన అవసరముంది.
చదవండి: ‘పతాక’ స్థాయిలో పొరపాట్లు! జెండాల పంపిణీలో ఫ్లాగ్‌ కోడ్‌ ఉల్లంఘనలు 

పరిరక్షణ బాధ్యతలపై వెలువడని మార్గదర్శకాలు..  
ఇంటింటికీ ఎగరేసిన జెండాలను జాగ్రత్తగా, గౌరవంగా చూసుకోవాల్సిన భాద్యత ఆ ఇంటి వారిదే అని నిపుణులు చెబుతున్నారు. ర్యాలీల పేరుతో వాహనాలకు కూడా జాతీయ జెండాను వినియోగించారు. వజ్రోత్సవాల అనంతరం వీటినన్నింటినీ జాగ్రత్తగా భద్రపరచాల్సిన అవసరముంది. ఈ విషయంలో మరింత అవగాహాన పెరగాలని, లేదంటే ఘనంగా నిర్వహించిన వేడుకల పేరుతో జాతీయ పతాకాన్ని అగౌరవపరిచినట్లేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ముఖ్యంగా పబ్లిక్‌ ప్లేస్‌లలో, పార్క్‌లు, వీధులు, పాఠశాలలు, కళాశాలలు, ఫుట్‌పాత్, ఫ్లైఓవర్, గ్రౌండ్స్, కూడళ్ల వద్ద భారీస్థాయిలో జాతీయ జెండాలను ఏర్పాటు చేశారు. మరికోద్ది రోజుల్లో వజ్రోత్సవాలు ముగియనున్నాయి. ఈ సందర్భంగా జాతీయ జెండా గౌరవానికి భంగం కలగకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిదన్న విషయంలో సందిగ్ధం కొనసాగుతోంది.

జెండాను అమర్చిన ప్రదేశం, సంస్థలను బట్టి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా వారిపైనే ఉంటుంది. ఈ విషయంలో ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ నుంచి ఇంకా ఎలాంటి మార్గ నిర్దేశకాలు విడుదల కాలేదు. జాతీయ పతాకాన్ని ఏ మాత్రం అగౌరవ పరచినా చట్టపరమైన చర్యలు, శిక్షలు తప్పవు. కాబట్టి జెండాల విషయంలో పౌరులు సంబంధిత సంస్థలు బాధ్యతాయుంగా, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది.  
చదవండి: రామంతాపూర్‌ నారాయణ కాలేజీలో ఎప్పుడేం జరిగింది?  

మరిన్ని వార్తలు