కులవృత్తులను ప్రోత్సహించేలా కార్యక్రమాలు : మంత్రి హరీశ్‌

24 May, 2022 01:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కుల వృత్తులను ప్రోత్సహిం చేలా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. పశుసంవర్థక, పాడి పరిశ్రమ, మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు, పథకాల అమలుపై అధికారులతో మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్‌హెచ్‌డీ)లో సోమవారం సమీక్ష నిర్వహించారు.

ఉచిత చేప పిల్లల పంపిణీ, సబ్సిడీపై గొర్రెల యూనిట్ల పంపిణీ, పాడి పశువుల పంపిణీ తదితర పథకాలపై పురోగతిని అధికారులను అడిగి తెలుసుకు న్నారు.  పశు వైద్యశాలల ఆధునీకరణ, నూతన పశు వైద్యశాలల నిర్మాణం, రావిర్యాలలో నిర్మిస్తున్న మెగా డైరీ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు.  సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్‌ రాస్, పశుసంవర్థక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ అధర్‌ సిన్హా, మత్స్య శాఖ కమిషనర్‌ లచ్చిరాం భూక్యా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ రాంచందర్, డెయిరీ అధికారులు పాల్గొన్నారు.

కొత్త మెడికల్‌ కాలేజీల పనులు త్వరగా పూర్తిచేయాలి
గ్రామీణ ప్రాంత ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లాకొక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇందులో భాగంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఎనిమిది మెడికల్‌ కాలేజీల పనులు వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

సోమవారం ఎంసీహెచ్‌ఆర్డీలో వైద్య, ఆరోగ్య, ఆర్‌ అండ్‌ బీ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ వైద్య విద్యా సంవత్సరం నుంచే ఈ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాలని ముఖ్య మంత్రి ఆదేశించిన నేపథ్యంలో అవసరమైన అన్ని చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని అన్నారు.  సమీక్షలో ఆర్‌అండ్‌ బీ ఈఎన్‌సీ గణపతిరెడ్డి, డీఎంఈ రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు