కంపెనీ సెక్రటరీల పాత్ర కీలకం  

11 Aug, 2020 03:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కార్పొరేట్‌ ప్రపంచం అవసరాలను గుర్తించేందుకు, మెరుగైన విధానాలు, పథకాలను రూపొందించేందుకు కంపెనీ సెక్రటరీలు ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తున్నారని ఆర్థికమంత్రి హరీశ్‌రావు ప్రశంసించారు. కరోనా కష్టకాలంలో కార్పొరేట్‌ రంగాన్ని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోందని, ఉద్యోగ కల్పనకు సాయపడుతున్న కంపెనీలకు ప్రత్యేక రాయితీలు, పథకాలను అందిస్తోందని తెలిపారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎస్‌ఐ) 46వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం జరిగిన వెబినార్‌కు హరీశ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంకు రుణాలు పొందేందుకు కంపెనీలు పాటించాల్సిన పద్ధతుల్లో కొన్నింటిపై స్టాంప్‌ డ్యూటీ మాఫీ చేసినట్టు చెప్పారు. కార్పొరేట్‌ ప్రపంచం సుస్థిర అభివృద్ధి సాధించాలంటే మారుతున్న టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు.

కోవిడ్‌–19 పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోందని.. కంపెనీలు, వృత్తి నిపుణులు కూడా తమ వంతు సాయం అందించాలని కోరారు. ఐసీఎస్‌ఐ 45 ఏళ్లు పూర్తి చేసుకోవడంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి.. సంస్థ గత 45 ఏళ్లలో సాధించిన విజయాలకు సంబంధించిన డిజిటల్‌ ఆల్బమ్‌ను ఆవిష్కరించారు. ఐసీఎస్‌ఐ అధ్యక్షుడు సీఎస్‌ అశీష్‌ గార్గ్‌ మాట్లాడుతూ.. దేశంలోని ఇతర ఐసీఎస్‌ఐ కేంద్రాలకు హైదరాబాద్‌ కేంద్రం రోల్‌ మోడల్‌గా నిలుస్తోందని కొనియాడారు. ఐసీఎస్‌ఐ ఉపాధ్యక్షుడు సీఎస్‌ నాగేందర్‌ డి.రావు, సదరన్‌ ఇండియా రీజనల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ సీఎస్‌ కన్నన్‌లతోపాటు సీఎస్‌ ఆహ్లాదరావు, కౌన్సిల్‌ సభ్యులు సీఎస్‌ ఆర్‌.వెంకటరమణ, సీఎస్‌ పల్లవి విక్రమ్‌రెడ్డి, సీఎస్‌ నవజ్యోత్‌ పుట్టపర్తి, ఐసీఎస్‌ఐ హైదరాబాద్‌ ఛాప్టర్‌ కార్యదర్శి సీఎస్‌ సుధీర్‌ కుమార్‌ పోలా తదితరులు వెబినార్‌లో పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా