పోతుకు గడ్డివేసి, ఆవును పాలిమ్మంటే..

20 Sep, 2020 17:01 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట : ‘దున్నపోతుకు గడ్డివేసి.. ఆవును పాలు ఇవ్వమంటే ఎలా?.. పని చేసే ప్రభుత్వానికి ప్రజలు వెన్నుదన్నుగా ఉండాలి’ అని మంత్రి తన్నీరు హరీష్‌రావు వ్యాఖ్యానించారు. ఆదివారం దుబ్బాక రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన బ్యాంకు రుణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌ మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రిగా కేసిఆర్ బాధ్యతలు చేపట్టాకే దుబ్బాక ప్రజల నీటి గోస తీరింది. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదింటి ఆడబిడ్డల పెండ్లికి ఆర్థిక సహాయం అందిస్తున్నాం. దుబ్బాక నియోజకవర్గంలో ఇప్పటివరకూ 5 వేల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం చేశాం. దుబ్బాక నియోజకవర్గంలో 56,900 మందికి పింఛన్‌లు అందిస్తున్నాం. ( ఉత్కంఠగా పోరులో విజయం ఎవరిదో..! )

పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రులలో కాన్పు సౌకర్యం కల్పించాం. బాలింతలకు 12 వేల ఆర్థిక సహాయంతో పాటు కేసీఆర్ కిట్‌ను అందిస్తున్నాం. దుబ్బాక నియోజకవర్గంలో నెలన్నరలో 100 పడకల ఆసుపత్రిని వినియోగంలోకి తెస్తాం. అర్హులందరికీ పింఛన్లు అందించే బాధ్యత నాది. కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ... అభివృద్ధిలో వెన్నంటి ఉంటా. దుబ్బాక నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న మహిళా భవనాలను సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తాం. కొత్తగా పీఎఫ్‌ వచ్చిన బీడీ కార్మికులకు జీవన భృతి అందిస్తా’’మన్నారు.

>
మరిన్ని వార్తలు