ఆర్థోపెడిక్‌ అంతా ఆరోగ్యశ్రీలో 

21 Mar, 2022 01:37 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు 

ప్రైవేట్‌కు పోటీగా ప్రభుత్వంలో ఆర్థోపెడిక్‌ వైద్యం అందించాలి 

వైద్యులతో ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు 

మంచి సేవలందించే వైద్యులు, సిబ్బందికి అవార్డులిస్తామని వెల్లడి 

ప్రముఖ ఆర్థోపెడిక్‌ నిపుణులతో మంత్రి సమావేశం 

సాక్షి, హైదరాబాద్‌: అన్నిరకాల ఆర్థోపెడిక్‌ చికిత్సలు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నాయని వైద్యారోగ్య మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ప్రైవేట్‌కు పోటీ గా ప్రభుత్వాస్పత్రుల్లో ఆర్థోపెడిక్‌ వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఆస్పత్రుల అభివృద్ధి కోసం ఆరోగ్యశ్రీ కింద నిధులను విడుదల చేశామని, ఈ నిధులను స్థానిక సూపరింటెండెంట్లు వాడుకొని ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు.

ఎంసీఆర్‌ హెచ్‌ఆర్డీలో ప్రభుత్వ, ప్రైవేటు ఆర్థోపెడిక్‌ వైద్యులతో మంత్రి ఆదివారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో అందిస్తున్న ఆర్థోపెడిక్‌ సేవలపై సమీక్షించారు. ఈ విభాగంలో ప్రజలకు మెరు గైన వైద్య సేవలందించేందుకు అవసరమైన వైద్య విధానాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని ఆస్పత్రులకు తగినంత బడ్జెట్‌ ఇచ్చామని, పేద ప్రజలకు మరింత మెరుగైన ఆర్థోపెడిక్‌ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  

జిల్లాల్లో చేయలేనివే హైదరాబాద్‌కు రిఫర్‌ చేయాలి 
‘మోకాలి చిప్ప మార్పిడి సర్జరీకి అన్ని వసతులను ప్రభుత్వాస్పత్రుల్లో సమకూర్చాం. రాష్ట్రవ్యాప్తంగా 56 సీఆర్మ్‌ మెషీన్లు ఏర్పాటు చేశాం. మోకాలి చిప్ప మార్పిడి సర్జరీలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరిగేలా చూడాలి. దీనివల్ల పేదలకు ఆర్థిక భారం తప్పుతుంది’అని మంత్రి అన్నారు. సూపరింటెండెంట్లు ఆర్థోపెడిక్‌ వైద్యులకు సహకారం అందించాలని కోరారు. ‘జిల్లా ఆస్పత్రులను బలోపేతం చేశాం.

అధునాతన వైద్య పరికరాలు సమకూర్చాం. జిల్లాల్లో అందించలేని చికిత్సలనే హైదరాబాద్‌కు రిఫర్‌ చేయాలి’అని చెప్పారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. బడ్జెట్‌లో వైద్య పరికరాలకు రూ. 500 కోట్లు, సర్జికల్‌కు రూ. 200 కోట్లు, వైద్య పరీక్షలకు రూ. 300 కోట్లు, మందులకు రూ. 500 కోట్లు, ఆస్పత్రుల అభివృద్ధికి రూ. 1,250 కోట్లు కేటాయించామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ వైద్య సేవలు అందించే వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లకు, ఇతర సిబ్బందికి అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తామన్నారు. అందరూ మరింత కష్టపడి పేదలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.  

ప్రణాళికతో ముందుకెళ్తే మరింత ప్రయోజనం: గురువారెడ్డి 
తమ ఆస్పత్రుల్లో ప్రణాళికాబద్ధమైన విధానం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మందికి చికిత్స అందించగలుగుతున్నామని, ఇదే పద్ధతిని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాటిస్తే ఎక్కువ మందికి ప్రయోజనం జరుగుతుందని ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యులు గురువారెడ్డి అన్నారు. ప్రభుత్వానికి ఏ సమయంలోనైనా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

వైద్యులు అంకితభావంతో పేషెంట్ల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తే మరింత మందికి సేవలు అందించడం సాధ్యమవుతుందని మరో ఆర్థోపెడిక్‌ వైద్యుడు అఖిల్‌ దాడి అన్నారు. కొత్త చికిత్స విధానాలపై పరిశోధనకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, దీని వల్ల వైద్యులకు ఆసక్తి పెరుగుతుందని డాక్టర్‌ నితిన్‌ చెప్పారు. సమావేశంలో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, టీఎస్‌ఎంఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీఎంఈ రమేశ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు