4 లక్షల మందికి గృహలక్ష్మి! 

10 Mar, 2023 02:01 IST|Sakshi

సొంత జాగాలో ఇళ్ల నిర్మాణానికి రూ.3 లక్షలు చొప్పున ఆర్థిక సాయం 

ఒక్కో నియోజకవర్గంలో 3 వేల మందికి ఇవ్వాలని సర్కారు నిర్ణయం 

రూ.4 వేల కోట్ల పేదల హౌసింగ్‌ రుణాలు మాఫీ 

రెండో దఫాలో లక్షా 30 వేల కుటుంబాలకు దళితబంధు.. 1.55 లక్షల మందికి 4 లక్షల ఎకరాల పోడు పట్టాలు 

ఏప్రిల్‌ 14న హైదరాబాద్‌లో అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ.. అనంతరం సభ 

ఇళ్లస్థలాల క్రమబద్ధీకరణకు జీవో 58, 59 కింద మళ్లీ దరఖాస్తులు 

కటాఫ్‌ తేదీ 2014 నుంచి 2020 ఏడాదికి మార్పు 

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు 

సమావేశం అనంతరం వివరాలు వెల్లడించిన మంత్రి హరీశ్‌రావు 

సాక్షి, హైదరాబాద్‌: సొంత జాగా ఉన్న పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించే పథకానికి రాష్ట్ర మంత్రి వర్గం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ పథకానికి ‘గృహ లక్ష్మి’గా నామకరణం చేయడంతోపాటు మొత్తం 4 లక్షల మందికి ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించింది. ఒక్కో నియోజకవర్గంలో 3వేల మందికి చొప్పున 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3,57,000 మందికి ఈ పథకాన్ని వర్తింపజేస్తామని, రాష్ట్ర ప్రభుత్వ కోటాలో మరో 43వేల ఇళ్లు కేటాయిస్తామని పేర్కొంది. దీనికోసం ఈ ఏడాది రూ.12వేల కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది.

గురువారం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సుదీర్ఘంగా జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనితోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు వివరాలను మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, మల్లారెడ్డిలతో కలిసి ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు మీడియాకు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘ఇంటి’ కోసం మూడు విడతల్లో రూ.3లక్షలు 
సొంత స్థలాలు ఉండి ఇల్లు లేనివారు, గతంలో ఉన్న ఇల్లు కూలిపోయిన పేదలు ‘గృహలక్ష్మి’ పథకానికి అర్హులు. మంజూరు చేసే ఇళ్లన్నీ మహిళల పేరు మీదనే ఉంటాయి. తక్షణమే లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల నిర్మాణ ప్రక్రియలను ప్రారంభించాలని కలెక్టర్లను ఆదేశించాం. ఒక్కో విడత రూ.లక్ష చొప్పున మూడు విడతల్లో రూ.3 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలో వేస్తుంది.

లబ్ధిదారులు తమకు నచ్చిన విధంగా ఇళ్లను నిర్మించుకోవడానికి వీలుగా నిబంధనలను సులభతరం చేయాలని నిర్ణయించాం. సొంత జాగా లేని పేదల కోసం డబుల్‌ బెడ్రూం ఇళ్ల పథకం కొనసాగుతుంది. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన డబుల్‌ బెడ్రూం ఇళ్లకు లబ్ధిదారుల ఎంపికను త్వరగా పూర్తి చేయాలని, నిర్మాణంలో ఉన్న ఇళ్ల పనులు వేగంగా ముగించాలని అధికారులను ఆదేశించాం. 

పేదల హౌసింగ్‌ రుణాలు మాఫీ 
గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలో హౌసింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా ఇళ్ల నిర్మాణం కోసం పేదలకు ఇచ్చిన రూ.40 వేలు/ రూ.60 వేలు/ రూ.90 వేలు అప్పులను మాఫీ చేస్తున్నాం. ఈ మేరకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మంత్రివర్గం ఆమోదించింది. దాదాపు రూ.4వేల కోట్ల అప్పులను ఆ పేదల తరఫున రాష్ట్ర ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుంది. ఇకపై వారికి బ్యాంకులు, గృహ నిర్మాణ సంస్థ నుంచి నోటీసుల బాధలు ఉండవు. 

రెండోదశలో లక్షా 30వేల కుటుంబాలకు దళితబంధు 
లక్షా 30వేల దళిత కుటుంబాలకు రెండోదశ దళితబంధు పథకాన్ని అమలు చేయాలని, తక్షణమే ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఇప్పటికే దళితబంధు 100 శాతం అమలైంది. మిగతా 118 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,100 మంది చొప్పున 1,29,800 మందికి.. సీఎస్‌ నేతృత్వంలోని కమిటీకి వచ్చే అప్పీళ్ల ఆధారంగా మరో 200 మందికి అందిస్తాం.

2021 ఆగస్టు 16న దళితబంధు పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ఇకపై ఏటా ఆగస్టు 16న రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించాం. గతంలో తరహాలోనే ఈసారి కూడా కలెక్టర్ల పర్యవేక్షణలో దళితబంధు అమలు చేయాలని, వేగంగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించాం. 
 
1.55 లక్షల మందికి పోడు పట్టాలు 

రాష్ట్రంలో 1,55,393 మంది అడవిబిడ్డలకు 4లక్షల 903 ఎకరాల్లో పోడు పట్టాలు ఇవ్వాలని, తక్షణమే పంపిణీని ప్రారంభించాలని అధికారులను ఆదేశించాం. లబ్ధిదారుల గుర్తింపు, తీర్మానాలు పూర్తి చేయడంతోపాటు పట్టాలను ముద్రించి పంపిణీకి సిద్ధం చేశాం. ఎక్కడైనా మిగిలి ఉన్నచోట ప్రక్రియ కొనసాగుతుంది. 
 
ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ 
హుస్సేన్‌సాగర్‌ తీరాన దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం సిద్ధమైంది. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఏప్రిల్‌ 14న ఘనంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించాలని మంత్రివర్గంలో నిర్ణయించాం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత ప్రజలు, బిడ్డలను హైదరాబాద్‌కు పిలుచుకుని, లక్షల మంది సమక్షంలో గొప్పగా ఈ కార్యక్రమాన్ని జరుపుతాం. అన్ని గ్రామాలు, పట్టణాల నుంచి దళితవర్గాల ప్రజలు హైదరాబాద్‌కు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని, విగ్రహావిష్కరణ అనంతరం భారీ సభ జరపాలని నిర్ణయం తీసుకున్నాం. 
 
2020 కటాఫ్‌తో జీవో 58, 59లకు దరఖాస్తులు 
ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ కోసం ఇచ్చిన జీవో 58, 59 కింద గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి చివరిసారిగా నెల రోజుల గడువుతో మరో అవకాశం కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. గతంలో 2014 కటాఫ్‌ తేదీ ఉండగా 2020కి మార్చుతున్నాం. జీవో 58 కింద ఒక్క రూపాయి లేకుండా పేదలకు స్థలం/ఇంటి మీద హక్కు కల్పిస్తాం. జీవో 58 కింద ఇప్పటివరకు 1,45,668 మందికి, జీవో 59 కింద 42వేల మందికి పట్టాలు అందించడం జరిగింది. గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు పేదల ఇళ్లను జేసీబీలు, పోక్లెయిన్లతో కూల్చివేస్తే.. మేం క్రమబద్ధీకరిస్తున్నాం. 
 
ఏప్రిల్‌ నుంచి గొర్రెల పంపిణీ 
గొర్రెల పంపిణీ పథకం కింద రాష్ట్రంలో 7.31 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించగా.. అందులో 50శాతం మందికి గతంలో పంపిణీ పూర్తయింది. రెండో విడత కింద మిగతా వారికి ఏప్రిల్‌ నుంచి పంపిణీ ప్రారంభించనున్నాం. ఇందుకోసం రూ.4,463 కోట్లను మంజూరు చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో పారదర్శకంగా, వేగవంతంగా ప్రక్రియ జరగాలని ఆదేశించాం. 
     
కాశీ, శబరిమలలో రాష్ట్ర వసతి గృహ సముదాయాలు 

రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో వెళ్లే భక్తుల కోసం కాశీ, శబరిమలలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వసతి గృహాలను నిర్మించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వీటికి చెరో రూ.25 కోట్లను మంజూరు చేసింది. సీఎస్‌ కాశీకి వెళ్లి అక్కడి అధికారులతో మాట్లాడి ప్రభుత్వ స్థలం తీసుకుంటారు. ప్రభుత్వ స్థలం దొరకకపోతే ప్రైవేటు స్థలం కొని అన్ని వసతులతో వసతి గృహ సముదాయాన్ని నిర్మిస్తాం. సీఎంవో అధికారి ప్రియాంక వర్గీస్‌ శబరిమల వెళ్లి అక్కడి ప్రభుత్వం నుంచి స్థలం తీసుకోవాలని సూచించాం. తర్వాత మంత్రుల బృందం వెళ్లి పనులు ప్రారంభిస్తుంది. గతంలో సీఎం కేసీఆర్‌ కేరళ సీఎంతో మాట్లాడినప్పుడు అక్కడ మంచి స్థలం ఇచ్చేందుకు అంగీకరించారు. 
 
ఏప్రిల్‌ నుంచి ధాన్యం కొనుగోళ్లు 

కొత్త సచివాలయం, అమరవీరుల స్థూపం పనులు పూర్తికావచ్చాయి. జూన్‌ 2లోగా వీటిని ప్రారంభించుకుంటాం. రంగారెడ్డి జిల్లాలోని వక్ఫ్‌ భూముల్లో ఇళ్లు కట్టుకున్నవారి విషయంలో చట్టాలు, నిబంధనలకు లోబడి ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుంది. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల ఎంపికకు మే వరకు సమయం ఉంది. ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదు. యాసంగిలో పండిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం. కేంద్రం కొన్నా, కొనకపోయినా ఏప్రిల్‌ నెలాఖరులోగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం..’’ అని హరీశ్‌రావు తెలిపారు.   

మరిన్ని వార్తలు