ఆప్షన్లు లేవు.. అంతా మీరే ఇవ్వాలి 

6 Oct, 2020 02:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ పరిహారం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే చెల్లించాలని, ఈ విషయంలో ఆప్షన్లేవీ తమకు సమ్మతం కాదని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు తేల్చిచెప్పారు. కేంద్రమే ఆ మొత్తాన్ని రుణంగా తీసుకుని రాష్ట్రాలకు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన సోమవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశానికి సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరైన హరీశ్‌ జీఎస్టీ పరిహారం విషయంలో మరోమారు బలమైన వాదన వినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీఎస్టీ పరిహారం పొందడం రాష్ట్రాల హక్కు అని, చెల్లింపు కేంద్రం బాధ్యత అని స్పష్టం చేశారు. జీఎస్టీ పరిహారం మొత్తం కేంద్రమే చెల్లించాలని, ఆప్షన్‌–1, ఆప్షన్‌ –2లలో ఏవీ తమకు సమ్మతం కావని వెల్లడించారు. జీఎస్టీ చట్టం ప్రకారం.. రాష్టానికి హక్కుగా రావాల్సిన పరిహారం కేంద్రమే అప్పు తీసుకుని చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న ఐజీఎస్టీ బకాయిలు వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఇప్పటికే సెస్‌ రూపంలో కౌన్సిల్‌కు జమ అయిన రూ. 30 వేల కోట్లు వెంటనే రాష్ట్రాలకు విడుదల చేయాలన్నారు. ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ కింద రాష్ట్రాలకు ఇచ్చిన రుణ పరిమితికి, జీఎస్టీ పరిహారం చెల్లింపులకు ముడిపెట్టవద్దని సూచించారు. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐజీఎస్టీ రూ. 24 వేల కోట్లను కన్సాలిడేటెడ్‌ ఫండ్‌లో జమ చేశారని, ఇందులో తెలంగాణ రాష్ట్రానికి రూ. 2,638 కోట్లు రావాల్సి ఉందని, ఈ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని కోరారు. రివర్స్‌డ్‌ అండ్‌ ల్యాప్స్‌డ్‌ ఐజీఎస్టీ, ఐటీసీ కూడా రాష్ట్రాలకు కొద్దికాలంగా ఇవ్వడం లేదని, ఇందులో తెలంగాణకు రావాల్సిన రూ. 1000 కోట్లు వెంటనే విడుదల చేయాలని హరీశ్‌ కోరారు.  

వారంలో ఇస్తాం 
కాగా, ఐజీఎస్టీ కింద రాష్ట్రాలకు రావాల్సిన రూ. 24 వేల కోట్లను వారం రోజుల్లో ఇస్తామని నిర్మలా సీతారామన్‌ ఈ సమావేశంలో ప్రకటించారు. కాగా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌తో పాటు ఇతర కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు ఆప్షన్లకు అంగీకరించకుండా జీఎస్టీ పరిహారం మొత్తం కేంద్రమే చెల్లించాలని డిమాండ్‌ చేయడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే కౌన్సిల్‌ సమావేశం వాయిదా పడింది. సంప్రదింపుల ప్రక్రియ కొనసాగించేందుకు ఈ నెల 12న మరోమారు   భేటీ కావాలని కౌన్సిల్‌ నిర్ణయించింది.  

మరిన్ని వార్తలు