ప్రైవేటు టీచర్లకు ‘డబుల్‌’ ఇళ్లు 

6 Sep, 2021 05:10 IST|Sakshi
ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానిస్తున్న మంత్రులు

రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు 

రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు అంశం పరిశీలనలో ఉందని వెల్లడి 

హుజూరాబాద్‌/ఇల్లందకుంట: హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని అర్హులైన ప్రైవేట్‌ ఉపాధ్యాయులకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇచ్చేందుకు కృషి చేస్తామని  ఆర్థికమంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం హుజూరాబాద్‌ నియోజకవర్గంలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. ఇప్పటికే 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం మరో 60 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇస్తామని హుజూరాబాద్‌ పట్టణంలో ట్రస్మా నిర్వహించిన గురుపూజోత్సవంలో వెల్లడించారు.

సంక్షేమ పథకాల్లో ప్రైవేటు టీచర్లను భాగస్వాములను చేస్తామని హామీ ఇచ్చారు. హుజూరాబాద్‌లో మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామని సిటీ సెంట్రల్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన రెడ్డిసంఘం సమావేశంలో చెప్పారు. రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు అంశం సీఎం కేసీఆర్‌ పరిశీలనలో ఉందన్నారు.  జమ్మికుంటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇల్లందకుంట, జమ్మికుంట, వీణవంకకు చెందిన పలువురు యువకులు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కాగా, బీజేపీ నేతలు పంచేందుకు ఇచ్చిన గోడ గడియారాలు, గొడుగులను మంత్రి సమక్షంలో పలువురు ధ్వంసం చేశారు.

బిజిగిర్‌ షరీఫ్‌ దర్గాను దర్శించుకున్న మంత్రులు 
జమ్మికుంట మండలంలోని బిజిగిర్‌ షరీఫ్‌ దర్గాను మంత్రులు మహమూద్‌ అలీ, హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి దర్శించుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి గంగుల, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, పార్టీ నేత పాడి కౌశిక్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు