పల్లెల్లోకి రండి..  నీటి పరుగు చూపిస్తాం: మంత్రి హరీశ్‌రావు

22 Sep, 2022 04:06 IST|Sakshi

సిద్దిపేటజోన్‌/సిద్దిపేటకమాన్‌:హైదరాబాద్, ఢిల్లీలో కూర్చొని మాట్లాడడం కాదు.. తెలంగాణ పల్లెల్లో, సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో క్షేత్రస్థాయిలో చూస్తే కాళేశ్వరం గురించి తెలుస్తుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ కుల సంఘాలకు రూ.2 కోట్ల విలువైన కమ్యూనిటీ భవన నిర్మాణ ప్రొసీడింగ్‌ పత్రాలు అందించారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. నీరు పారలేదంటున్న వాళ్లు సిద్దిపేట నియోజకవర్గానికి వచ్చి చెరువులను చూస్తే తెలుస్తుందన్నారు. ఎప్పుడూ నిండని రాఘవాపూర్‌ చెరువు ఇప్పుడు గోదారి నీటితో కళకళలాడుతోందని, ఒకప్పుడు రాఘురూకుల, చింతమడక, నారాయణరావుపేట, తోర్నాలలు కరువు ప్రాంతాలుగా ఉండేవని, ఇప్పుడవి సస్యశ్యామలం అయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో గుంటెడు భూమైనా పడావు పడి ఉందా? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ హయాంలో సిద్దిపేట నియోజకవర్గం పరిధిలో కరంట్‌ సమస్యపై విద్యుత్‌ కార్యాలయం వద్ద వంటావార్పు, రాత్రి బస చేశామని, కానీ.. ఇప్పుడు సీఎం కేసీఆర్‌ హయాంలో రాష్ట్రంలో 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ వస్తోందని తెలిపారు. తెలంగాణలో రైతుల బావుల వద్ద మీటర్లు పెట్టలేదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్టానికి వచ్చే 30 వేల కోట్లు ఆపిందని ఆరోపించారు.

కేంద్రం వద్ద 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, అవి భర్తీ చేయకపోగా, ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టేపని పెట్టుకుందన్నారు. నియోజకవర్గ పరిధిలో ప్రతి ఊరికి కుల సంఘాల భవనాలున్నాయని, ఒక్కో ఊరిలో రెండు, మూడు, ఐదు, ఎనిమిది, 11 చొప్పున కమ్యూనిటీ భవనాలు ఉన్నాయని చెప్పారు. ఇబ్బందైనా కష్టపడి నిధులు తెచ్చానని, కొబ్బరికాయలు కొట్టి కొట్టి చెయ్యి నొప్పి పెట్టిందని చమత్కరించారు. కాగా, బుధవారం సిద్దిపేట ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో జరిగిన వార్షికోత్సవంలో కూడా ఆయన పాల్గొన్నారు. 

మెరుగైన వైద్యమే సీఎం ధ్యేయం
పేదలు, గ్రామీణ ప్రాంత వాసులకు మెరుగైన వైద్యం అందించాలన్నదే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట ప్రభుత్వ మెడికల్‌ కళాశాల వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం సందర్భంగా తెలంగాణకు తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులు ఆ ప్రాంతాలకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ అనుమతి ఇస్తే వారికి సహకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి హరీశ్‌ స్పష్టం చేశారు.    

మరిన్ని వార్తలు