Harish Rao: ప్రైవేటు ఎందుకు.. సర్కారే బెస్ట్‌

8 Jan, 2022 04:22 IST|Sakshi

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వైద్య సేవలు ఉన్నాయి 

ప్రజలకు వైద్యసేవలు అందేలా చూడాలి 

మూడోవేవ్‌ను సమర్థంగా ఎదుర్కొందాం  

ఈనెల 10 నుంచి 60 ఏళ్లకు పైబడిన వారికి బూస్టర్‌ డోస్‌ 

వైద్యాధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మూడోవేవ్‌ను ఎదుర్కొనేందుకు వైద్యారోగ్య శాఖ పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. కరోనా టీకా రెండో డోసు లక్ష్యాన్ని వంద శాతం పూర్తి చేయడంతోపాటు, 15–18 ఏళ్ల వారి వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాలని చెప్పారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో విద్యార్థులు ఇళ్లకు వస్తారని, వారికి అవగాహన కల్పించి టీకాలు ఇవ్వాలన్నారు.

ఈనెల 10 నుంచి 60 ఏళ్లకు పైబడిన వారికి బూస్టర్‌ డోస్‌ ఇచ్చే కార్యక్రమానికి సిద్ధం కావాలన్నారు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యం ఇచ్చి, రెండు డోసులు పూర్తి చేసి, బూస్టర్‌ డోస్‌ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి అప్పులపాలు కాకుండా చూడాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. శుక్రవారం ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావుతో కలిసి అన్ని జిల్లాల వైద్యాధికారులు, పీవోలు, ఆశా కార్యకర్తలతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో హరీశ్‌రావు మాట్లాడారు.  

సబ్‌ సెంటర్, పీహెచ్‌సీ స్థాయిలోనే చికిత్స 
‘కోటి హోం ఐసోలేషన్‌ కిట్లు, రెండు కోట్ల కరోనా నిర్ధారణ కిట్లు సమకూర్చుకున్నాం. వీటిని అన్ని జిల్లాల పీహెచ్‌సీ, సబ్‌సెంటర్‌ స్థాయికి సరఫరా చేశాం. ఎవరికి లక్షణాలు కనిపించినా ఎక్కడికక్కడే పరీక్షలు నిర్వహించి, సాధారణ లక్షణాలుంటే మందుల కిట్లు ఇచ్చి ఇళ్లలో ఐసోలేషన్‌లో ఉండేలా చర్యలు తీసుకోండి. వీరి ఆరోగ్య పరిస్థితిని ఆశ వర్కర్లు రోజు వారీ పరిశీలించి, అవసరమైతే వారిని సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించాలి’ అని హరీశ్‌రావు చెప్పారు.

మూడోవేవ్‌లో వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రమాదం తక్కువగా ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయని, ప్రజలు భయాందోళనకు గురి కాకుండా చైతన్య పరచాలన్నారు. పంచాయతీ, మున్సిపల్‌ సహా స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అవసరమైతే స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ఐసోలేషన్‌ కేంద్రాలను స్థానికంగా ఏర్పాటు చేయాలన్నారు. ఇదే సమయంలో అన్ని ఆసుపత్రుల్లో ఓపీ, గర్భిణులకు సేవలు, దీర్ఘకాలిక రోగులకు సేవలు అందించడంలో ఎలాంటి అంతరాయాలు కలగకుండా జిల్లా వైద్యాధికారులు చూసుకోవాలని చెప్పారు. 

ప్రభుత్వానికి ఆశాల ధన్యవాదాలు 
గత ప్రభుత్వాల హయాంలో పారితోషికం పెంపు కోసం ఆశ కార్యకర్తలు ధర్నాలు చేసేవారని, ఇందిరాపార్క్‌ వద్ద లాఠీ దెబ్బలు తినాల్సిన పరిస్థితులు ఉండేవని మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు. గుర్రాలతో తొక్కించిన సందర్భాలూ ఉన్నాయన్నారు. ఆశాల సేవలు గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి పారితోషికం పెంచారని, సీఎం నమ్మకాన్ని వమ్ముచేయకుండా ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆశాలకు సూచించారు. ఆశాల అందరి తరఫున ఆయన సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. పారితోషికం పెంపు సంతోషాన్ని ఆశ కార్యకర్తలు హరీశ్‌రావుతో పంచుకున్నారు.   

మరిన్ని వార్తలు