మహిళల చేతికి ‘స్టీరింగ్‌’..!

5 Jan, 2021 01:24 IST|Sakshi

సాక్షి, సంగారెడ్డి: ‘మహిళలు విమానాలు నడుపుతున్నారు.. అంతరిక్షంలోకి రాకెట్లతో వెళ్తున్నారు.. కుటుంబాలను నడిపే బాధ్యతనూ సమర్థంగా నిర్వహిస్తున్నారు.. కార్లను నడపటం వారికి కష్టమేమీ కాదు.. అందుకే ఇంటి స్టీరింగ్‌తో పాటు ఉపాధి పొందడానికి మొదటిసారిగా ప్రభుత్వం ‘కారు’ స్టీరింగ్‌ కూడా మీ చేతుల్లో పెడుతోంది..’అని ఆర్థికమంత్రి హరీశ్‌రావు అన్నారు. వీటిని విజయవంతంగా నడిపించుకొని ఉపాధి పొందుతారనే విశ్వాసముందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సంగారెడ్డిలో జరిగిన కార్యక్రమంలో సోమవారం ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 18 మంది మహిళలకు ‘షీ క్యాబ్స్‌’కార్లను అందజేశారు.

సమాజ అభివృద్ధికి దోహదం..
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఇది సమాజ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని హరీశ్‌ చెప్పారు. ‘తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎస్సీలకు రూ.2,737 కోట్లతో 1.63 లక్షల మంది ఎస్సీ లబ్ధిదారులకు మేలు చేసేలా పథకాలు అమలుపరిచాం. గత ప్రభుత్వాల హయాంలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు కావాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాల్సి ఉండేది. మహిళలకు షీ క్యాబ్స్‌ పేరుతో అద్దెకు నడిపి ఉపాధి పొందడానికి కార్లను అందజేసే కార్యక్రమం రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రారంభిస్తున్నాం. ఈ జిల్లా నుంచి ప్రారంభిస్తున్న ఈ పథకానికి 25 మంది దరఖాస్తు చేసుకోగా 18 మందిని ఎంపిక చేసి వారికి డ్రైవింగ్‌లో శిక్షణ ఇప్పించి లైసెన్సులు సైతం ఇచ్చాం. క్యాబ్‌ డ్రైవర్స్‌ ఆత్మరక్షణకు పెప్పర్‌ స్ప్రే, సెల్‌ఫోన్, జియో లొకేషన్‌ సౌకర్యం కల్పించాం.

ఈ పథకం విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. ఇటు ఈ పథకం సక్సెస్‌ అయ్యేందుకు కార్లను అందజేసిన మహిళలను మూడు నెలల పాటు వారం వారం పర్యవేక్షిస్తూ నెలకోసారి అధికారులు నివేదికను అందజేయాలి. జిల్లాలో అత్యధికంగా పరిశ్రమలున్నాయి. వాటిలో పనిచేసే మేనేజర్లు, పర్సనల్‌ మేనేజర్లు, ఇతర అధికారులకు కార్లు అద్దెకు అవసరం అవుతాయి. కార్లు పొందిన మహిళలకు ఆసక్తి ఉంటే పరిశ్రమల యజమానులతో మాట్లాడి టై అప్‌ చేయిస్తాం.. దీంతో ప్రతినెలా పని లభించడమే కాకుండా నెలనెలా అద్దె వస్తుంది.

ఇటు ‘ఊబర్‌’సంస్థతో కూడా టై అప్‌ చేసుకోవచ్చు..’అని మంత్రి అన్నారు. అనంతరం మహిళా లబ్ధిదారులు నడిపిన షీ క్యాబ్స్‌లో హరీశ్‌ ప్రయాణించి వారికి సూచనలు అందజేశారు. అనంతరం వారితో సెల్ఫీలు దిగి సంతోషాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ఎం.హనుమంతరావు, జెడ్పీ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల మంజుశ్రీ, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, మాణిక్‌రావు, భూపాల్‌రెడ్డి, పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మిగతావారికి వారంలో రైతుబంధు..
ఇక యాసంగిలో రూ.7,500 కోట్లు రైతుబంధు కింద రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తున్నామని మంత్రి హరీశ్‌ తెలిపారు. మునిపల్లి మండలం కంకోల్‌లో రైతువేదికను ప్రారంభించిన ఆయన.. ఇప్పటివరకు రూ.5,500 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశామని చెప్పారు. మిగతావారికి వారంలోగా డబ్బులు జమ అవుతాయన్నారు. కల్లాల నిర్మాణానికి రూ.600 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు.

కుటుంబానికి ఆసరా అవుతా..
సంగారెడ్డి కేంద్రంలోని తారా డిగ్రీ కళాశాలలో చదువుతున్నాను. కుటుంబానికి చేయూతనివ్వాలని ఏదో ఒక వ్యాపారం చేయాలనుకున్నాను. పెట్టుబడి పెట్టేంత ఆర్థిక స్థోమత లేకపోయింది. ప్రభుత్వ ‘షీ క్యాబ్‌’పథకం గురించి తెలిసి దరఖాస్తు చేశాను. ఎస్సీ కార్పొరేషన్‌ నుంచి ఎంపిక చేసి, డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చి లైసెన్స్‌ కూడా ఇప్పించారు. ఇప్పుడు కారు కూడా వచ్చింది. కుటుంబానికి ఎంతో కొంత ఆసరా అవుతాననే భరోసా కలిగింది. – బి.ప్రవళిక, చేర్యాల్, కంది మండలం

ఆత్మస్థైర్యం కలిగింది..
మావారు క్యాటరింగ్‌ చేస్తారు. ఆ సంపాదనతో కుటుంబ పోషణ కష్టంగా ఉంది. గృహిణిగా ఉన్న నేను కూడా ఏదో ఓ పనిచేసి అండగా నిలవలానుకున్నా. ఎస్సీ కార్పొరేషన్‌ ప్రకటనతో షీ క్యాబ్‌కు దరఖాస్తు చేసుకోవడంతో లబ్ధిదారుగా ఎంపిక చేశారు. నెలరోజుల పాటు ఇచ్చిన శిక్షణలో పురుషులతో పాటు మహిళలు కూడా అన్ని పనులు చేయగలరనే ఆత్మస్థైర్యం కలిగింది. అన్ని ఖర్చులు పోను నెలకు రూ.10 వేలు మిగిలినా కుటుంబానికి భారం తప్పుతుంది. – పాతర తేజస్వి, సంగారెడ్డి టౌన్‌

అమ్మను పోషించుకునేందుకు..
11 ఏళ్లు ఉన్నప్పుడే నాన్న చనిపోయాడు. నేను అమ్మ ఇద్దరమే ఉంటున్నాం. ఆమెనే నా ఆలనా పాలనా చూసేది. కూలిపనికి వెళ్లి కష్టపడి నన్ను చదివించింది. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడే పత్రికలో షీ క్యాబ్‌ స్కీం ప్రకటన చూశా. లబ్ధిదారుగా ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. సబ్సీడీపై కారు అందించారు. అన్నీ తానై నన్ను పోషించిన అమ్మకు అన్ని విధాలా అండగా ఉండాలనేదే లక్ష్యం. – గొర్లకాడి వసంత, జుల్‌కల్, కంది మండలం

మరిన్ని వార్తలు