దేశంలో ప్రతిపక్షాల్లేకుండా చేసే కుట్ర

27 Aug, 2022 02:26 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వంపై మంత్రి హరీశ్‌రావు ధ్వజం  

ఎంఎన్‌జే కేన్సర్‌ ఆసుపత్రిలో 

అధునాతన మాడ్యులర్‌ థియేటర్లు ప్రారంభం

నాంపల్లి: కేంద్ర ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసి ప్రతిపక్షాలపై దాడులకు పాల్పడుతోందని, కేంద్రాన్ని ప్రశ్నించే ప్రతిపక్షాలపై ఈడీ, సీబీఐని ఉసిగొల్పుతోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. ఎనిమిది రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను బీజేపీ పడగొట్టి దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకుందని దుయ్యబట్టారు. శుక్రవారం హైదరాబాద్‌ రెడ్‌హిల్స్‌లోని ఎంఎన్‌జే కేన్సర్‌ ఆసుపత్రిలో రోబోటిక్‌ సహా 8 మాడ్యులర్‌ థియేటర్లు, అధునాతన దోబీ ఘాట్, కిచెన్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ప్రతిపక్షాలను లేకుండా చేయాలన్న ధోరణితో బీజేపీ పనిచేస్తోందని ధ్వజమెత్తారు. మహారాష్ట్ర, బిహార్, ఢిల్లీ, జార్ఖండ్‌లలో బీజేపీ నిర్వాహకాన్ని అందరూ చూశారన్నారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన సంఘటనలను చూస్తుంటే నిఘా సంస్థలు బీజేపీ జేబు సంస్థలుగా మారాయనే అనుమానం కలుగుతోందని ఆరోపించారు. తెలంగాణలో కృష్ణా, గోదావరి నీళ్లు పారించాలని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చూస్తుంటే... మత కలహాలు సృష్టించి రక్తం పారించాలని బీజేపీ చూస్తోందని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.  

రూ.30 కోట్లతో మాడ్యులర్‌ థియేటర్లు...  
ఎంఎన్‌జే కేన్సర్‌ ఆసుపత్రిలో రూ.30 కోట్లతో ఏడు మాడ్యులర్‌ థియేటర్లు ప్రారంభించడం సంతోషంగా ఉందని హరీశ్‌రావు అన్నారు. పీజీ విద్యార్థుల కోసం రూ. 4 కోట్లతో మౌలికవసతులు సమకూరుస్తున్నట్లు చెప్పారు. మరో 350 పడకలతో అధునాతన భవనం నిర్మాణ దశలో ఉందని.. ఈ నిర్మాణం పూర్తయితే మొత్తం 750 పడకల ఆసుపత్రిగా ఎంఎన్‌జే ఆసుపత్రి అందుబాటులోకి వస్తుందన్నారు. అధునాతన బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వివరించారు. రూ. 10 లక్షల దాకా ఆరోగ్యశ్రీ పథకం కింద రోగులకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నట్లు హరీశ్‌రావు చెప్పారు. దేశంలో తొలిసారి ఎంఎన్‌జే ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆంకాలజీ స్పెషల్‌ నర్సింగ్‌ స్కూల్‌ను త్వరలో ప్రారంభిస్తామన్నారు.   

మరిన్ని వార్తలు