వారి తిప్పలన్నీ నాలుగు ఓట్ల కోసమే

1 Nov, 2020 01:38 IST|Sakshi

డిపాజిట్ల కోసమే బీజేపీ, కాంగ్రెస్‌ ఆరాటం..

అబద్ధాల పునాదుల మీదే వారి రాజకీయం..

నా విశ్వసనీయతను దెబ్బతీసే ప్రయత్నం

బీజేపీ మాకు ప్రధాన ప్రత్యర్థి కాదు..

వారిది గోబెల్స్‌ ప్రచారం..

‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: ‘అసంబద్ధ హామీలు, ప్రలోభాలు, అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దుబ్బాక ఉపఎన్నికలో డిపాజిట్లు తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. మేం మాత్రం మా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓటేయమని అడుగుతున్నాం. ప్రజల్లో నాకున్న విశ్వసనీయతను దెబ్బకొట్టేలా విపక్షాలు అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి. సోషల్‌ మీడియాలో ఎదుటి వారిని మానసికంగా బలహీన పరిచి నాలుగు ఓట్లు పొందాలనుకునే వారి కుట్ర లను ప్రజాక్షేత్రంలోనే ఛేదిస్తాం. పార్టీ అధ్యక్షుడు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నామీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా దుబ్బాక ఉపఎన్నికలో విజ యం సాధిస్తాం’ అని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ ప్రచార సారథి హరీశ్‌తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ పూర్తి పాఠం..

17 రాష్ట్రాల్లో చేయలేదెందుకో?
కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర నాయ కులందరూ ఇక్కడ ప్రచారం చేస్తూ డబ్బు, మద్యంతో పాటు గుళ్లకు, గోపురాలకు డబ్బులు ఇస్తామంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. బీజేపీ పుకార్ల పుట్ట, అబద్ధాల గుట్టలా మారి పోయింది. దేశంలో బీజేపీ 17, కాంగ్రెస్‌ 4 రాష్ట్రాల్లో అధి కారంలో ఉన్నాయి. అక్కడ చేయని సంక్షేమం, అభివృద్ధి వారికి ఇక్కడ ఎలా సాధ్య మవుతుంది? దుబ్బాకలో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం గత ఆరేళ్లలో రూ. 7 వేల కోట్లు ఖర్చు చేసింది. మేం ప్రజాక్షేత్రంలో తిరుగుతూ టీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓటేయమని అడుగుతున్నాం. దుబ్బాక చైతన్యవంతమైన నియోజకవర్గం. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు కాబట్టే ఇన్నేళ్లుగా టీఆర్‌ఎస్‌ను ఆదరిస్తూ వస్తు న్నారు. కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న గోబెల్స్‌ ప్రచారం, అబద్ధాలను ఎప్పటికప్పుడు ప్రజలకు విడమరిచి చెప్తున్నాం. ఈ రోజు కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్‌ వైపు ప్రజలు చూస్తున్నారు. 

బీజేపీ ప్రధాన ప్రత్యర్థి కాదు
బీజేపీని ప్రధాన ప్రత్యర్థిగా భావించడం లేదు. ఆ పార్టీ అబద్ధాల పునాదుల మీద రాజకీయం చేస్తూ, చేయనిదానిని చేసినట్లుగా గోబెల్స్‌ ప్రచారం చేస్తోంది. వాళ్ల రాష్ట్ర నాయకులు ఇక్కడ కూర్చుని ఒక అబద్దాన్ని పదేపదే చెపితే నిజం అవుతుందనే రీతిలో పనిచేస్తున్నారు. ప్రభుత్వంగా మేం విఫలమయ్యాయని బీజేపీ ఒక వేలు మా వైపు చూపిస్తే, వారివైపు రెండు వేళ్లు చూపిస్తాయి. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. మేం మాత్రం మా మేనిఫెస్టోలో చెప్పినవి 75 శాతం నెరవేర్చాం. మరో 25 శాతం అమలు దిశగా సాగుతున్నాం. 

పార్టీకి నా మీద ఉన్న విశ్వాసానికి ప్రతీక
దుబ్బాకలో ప్రచార సారథ్య బాధ్యతలు నాకు అప్పగించడం... పార్టీకి నా మీద ఉన్న విశ్వాసాన్ని సూచిస్తోంది. మా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు కూడా స్పష్టంగా ఇదే విషయాన్ని చెప్పారు. నాతో మాట్లాడినపుడు సీఎం కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. నేను ఎంతగా ప్రజల్లో తిరిగితే మా పార్టీకి అంతగా ఓట్లు వస్తాయి కనుక విశ్వసనీయతను దెబ్బతీయాలని చూస్తున్నారు. ప్రజల్లో అపోహలు, అనుమానాలు సృష్టించి నాలుగు ఓట్లు పొందాలనేది వారి ప్రయత్నం. వారి తిట్లను కూడా దీవెనలుగా భావిస్తా. నిజం నిలకడ మీద తెలుస్తుంది.

నా రాజకీయ జీవితం తెరచిన పుస్తకం
నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. ఆరుసార్లు సిద్దిపేటలో గెలిచా. నా పనితీరు ఏంటో ఈ ప్రాంత ప్రజలకు తెలుసు. గతంలో దుబ్బాకలోని పలు గ్రామాలు సిద్దిపేట నియోజకవర్గం పరిధిలో ఉండేవి కాబట్టి వారికి నా మీద పూర్తి విశ్వాసం ఉంది. విపక్షాలు ఎంతగా దూషించినా దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ మీద, మా నాయకుడు కేసీఆర్‌ మీద ప్రజలకు నమ్మకం ఉంది. మరో మూడేళ్ల పాటు నేనే అభివృద్ది బాధ్యతలు తీసుకుంటా అని చెప్పాను కాబట్టి నా మీద విశ్వాసం పెడతారనే పూర్తి నమ్మకం ఉంది. ఎన్నికల సమయంలో పోలీసుల మీద, అధికారుల మీద పిర్యాదులు చేయడం విపక్షాలకు అలవాటుగా మారింది. జనంలో పలుకుబడి లేక అధికారుల మీద పడుతున్నారు. గతంలో పాలేరు ఉప ఎన్నికలోనూ కలెక్టర్‌ను బదిలీ చేయించారు. అక్కడ 45 వేల మెజారిటీతో గెలుపొందాం. 

బీజేపీ ఉద్దేశపూర్వక దాడి
సోషల్‌మీడీయాలో బీజేపీ పథకం ప్రకారం మా మీద దాడి చేస్తోంది. కిరాయి మనుషులను పెట్టుకుని ఎదుటి వారిని మానసికంగా బలహీనపరచాలనే కుట్రలకు సోషల్‌ మీడియాను వేదికగా వాడుకుంటున్నారు. ‘ప్రజల్లో తక్కువ... సోషల్‌ మీడియాలో ఎక్కువ’అన్నట్లు ఉంది వారి పరిస్థితి. మేం ప్రజల్లోనే ఉంటూ వారి విషప్రచారాన్ని తిప్పికొడతాం.

మరిన్ని వార్తలు