పల్లె దవాఖానాల్లో 1,569 పోస్టుల భర్తీ 

12 Nov, 2022 03:32 IST|Sakshi
మానిటరింగ్‌ హబ్‌ నుంచి పీహెచ్‌సీల వైద్యులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌ 

బస్తీ దవాఖానాలను 500కు పెంచుతాం

2,900 సబ్‌ సెంటర్లను పల్లె దవాఖానాలుగా మారుస్తాం

త్వరలో నోటిఫికేషన్‌ ఇస్తాం: వైద్య మంత్రి హరీశ్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పల్లె దవాఖానాల్లో పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. మునుగోడు ఉపఎన్ని­క వల్ల డాక్టర్ల నియామక ప్రక్రియ ఆలస్యమైందని చెప్పారు. 969 పోస్టులకు మెరిట్‌ జాబితా ప్రకటించామని, వారం పది రోజుల్లో నియామక పత్రాలు అందిస్తామని వెల్లడించారు. దీంతో అన్ని పీహెచ్‌సీల్లో డాక్టర్లు పూర్తిస్థాయిలో ఉంటారన్నారు.

హరీశ్‌రావు శుక్రవారం ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలో ‘పీహెచ్‌సీ మానిట­రింగ్‌ హబ్‌’ను ప్రారంభించిన అనంతరం మా­ట్లాడారు. ‘పల్లె దవాఖానాల కోసం 1,569 పో­స్టుల నియామక ప్రక్రియ త్వరలో మొదలవు­తుంది.స్టాఫ్‌ నర్సులు, 1,165 స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ త్వరలో విడుదల చేస్తాం. కేంద్రం దేశంలో వివిధ రాష్ట్రాలకు 157 మెడికల్‌ కాలేజీలు ఇచ్చినా తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు.

ఈ ఏడాది ఇంకా కొత్త కాలేజీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆయా జిల్లాల్లో కొత్త కాలేజీలను కేంద్రం ఇప్పుడు అనుమతించినా తీసుకుంటాం. దీనికోసం స్వయంగా నేనే కేంద్రం వద్దకు పత్రాలు తీసుకొని వెళ్తాను. కేంద్రం రేపు రమ్మంటే రేపే వెళ్తాను. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డిని కలవడానికి కూడా అభ్యంతరం లేదు. మరి ఆయన చొరవతీసుకుంటారా?’ అని అన్నారు. రాష్ట్రంలో 331 బస్తీ దవాఖానాలు పనిచేస్తున్నా­యని, వీటిని 500కు పెంచాలని నిర్ణయించామన్నారు.

బస్తీ దవాఖానాల్లో ఇప్పటివరకు 2.11 కోట్ల ఓపీ నమోదైందని చెప్పారు. వీటి వల్ల ఉస్మానియా, గాంధీ, ఫీవర్‌ ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గిందని తెలిపారు. ‘2019లో ఉస్మానియా ఆసుపత్రిలో 12 లక్షల ఓపీ ఉంటే.. ఈ ఏడాది 5 లక్షలకు తగ్గింది. గాంధీలో 6.5 లక్షల నుంచి 3.70 లక్షలకు, నిలోఫర్‌లో 8 లక్షల నుంచి 5.5 లక్షలకు, ఫీవర్‌ ఆసుపత్రిలో 4 లక్షల నుంచి 2 లక్షలకు తగ్గింది. దీంతో అక్కడ ఇతర సర్జరీల పెరిగాయి’ అని చెప్పారు. తెలంగాణ డయాగ్నొ­స్టిక్స్‌ ద్వారా ఇప్పటి­వరకు 36.20 లక్షల మందికి 6.46 కోట్ల టెస్టులు చేశారన్నారు. రాష్ట్రంలో ఉన్న 4,500 ఆరోగ్య ఉప­కేంద్రాలకుగాను 2,900 కేంద్రాలను పల్లె దవాఖా­నాలుగా మారుస్తామని హరీశ్‌రావు వెల్లడించారు. 

దేశంలో ఇదే తొలిసారి
వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఏడాది పూర్తి చేసు­కోవడం సంతోషంగా ఉందని హరీశ్‌రావు అన్నా­రు. ఈ ఏడాది జనవరి నుంచి చేపట్టిన కార్య­క్రమాలపై డిసెంబర్‌ చివరన ప్రగతి నివేదిక విడుదల చేస్తామని తెలిపారు. పీహెచ్‌సీ మానిట­రింగ్‌ హబ్‌ను ఏర్పాటు చేయడం దేశంలోనే మొద­టిసారని చెప్పారు. రాష్ట్రంలోని 887 పీహెచ్‌­సీ, యూపీహెచ్‌సీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వీటిని డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్, కుటుంబసంక్షేమ శాఖ కమిషనర్, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీలకు అనుసంధానం చేశామన్నారు.

మెడి­క­ల్‌ కాలేజీలు, జిల్లా ఆసుపత్రులతో సంప్రదించి స్పెషాలిటీ సేవలు అందించే అవకాశం కలుగుతుందన్నారు. రాష్ట్రంలో 43 పీహెచ్‌సీలకు రూ.67 కోట్లతో కొత్త భవనాలను మంజూరు చేశామన్నారు. 372 పీహెచ్‌సీల మర­మ్మతులకు రూ.43.18 కోట్లు ఖర్చు చేస్తున్నా­మన్నారు. ప్రారంభ కార్యక్రమం సందర్భంగా కు­షా­యిగూడ, సూర్యాపేట జిల్లా అంబేడ్కర్‌ నగర్, సిద్దిపేటలోని అంబేడ్కర్‌ నగర్‌ పీహెచ్‌సీ వైద్యు­లతో, ఆసుç­³­త్రికి వచ్చిన హరిత, అన్నపూర్ణ అనే మహిళల­తోనూ హరీశ్‌రావు మాట్లాడారు. ఈ సమావేశంలో అధికారులు శ్వేతామహంతి, డాక్టర్‌ శ్రీనివాస­రావు, డాక్టర్‌ రమేష్‌రెడ్డి, డాక్టర్‌ అజయ్‌కుమార్, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు